Artificial Intellegence- IMF | కృత్రిమ మేధతో 50 శాతం ఉద్యోగాలు హాంఫట్.. తేల్చి చెప్పిన ఐఎంఎఫ్ చీఫ్..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సంపన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రారంభంలో తక్కువ ప్రభావం ఉండొచ్చునని అంచనా వేసినా క్రిస్టాలినా జార్జివా.. పని ప్రదేశాల్లో సమగ్రత వల్ల ఉత్పాదకతతో బెనిఫిట్ పొందొచ్చునని చెప్పారు.
Artificial Intellegence- IMF |టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడొక సంచలనం. యావత్ టెక్నాలజీ దాని చుట్టూ తిరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివా సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు అన్ని రంగాల్లో ఉత్పాదకత స్థాయితోపాటు ప్రపంచ వృద్ధి రేటు పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా స్పష్టం చేశారు. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కుదిపేస్తుందని హెచ్చరించారు. సంపన్న దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల 60 శాతం ఉద్యోగులకు కొలువులు పోతాయని చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు బయలుదేరే ముందు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం తక్కువగా ఉంటుందని క్రిస్టాలినా జార్జివా చెప్పారు. అంతర్జాతీయంగా సరాసరి 40 శాతం మంది ఉద్యోగాలు కోల్పోతారని హెచ్చరించారు. అత్యంత ఉన్నత నైపుణ్యం కలిగి ఉన్న ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం ఉంటుందన్నారు. ఏఐ వల్ల 50 శాతం ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని ఐఎంఎఫ్ తాజా నివేదిక తెలిపింది. మరోవైపు, కృత్రిమ మేధ వల్ల ఉత్పాదకత లాభాలు పెరుగుతాయని అంచనా వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల మీ ఉద్యోగం కోల్పోవచ్చు.. అది మంచిది కాదు. మీ ఉద్యోగ సామర్ధ్యాన్ని పెంపొందించవచ్చు. మరింత ఉత్పాదకతతో మీ ఆదాయం స్థాయి మరింత పెరుగుతుంది అని క్రిస్టాలినా జార్జివా తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సంపన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రారంభంలో తక్కువ ప్రభావం ఉండొచ్చునని అంచనా వేసినా క్రిస్టాలినా జార్జివా.. పని ప్రదేశాల్లో సమగ్రత వల్ల ఉత్పాదకతతో బెనిఫిట్ పొందొచ్చునని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను అంది పుచ్చుకునేందుకు పేద దేశాలకు సాయం చేయడంపై తాము తప్పక దృష్టి సారిస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి భయపడటం తగ్గించాలని, ప్రతి ఒక్కరికి అద్భుతమైన అవకాశాలు కల్పిస్తుందన్నారు.
ఈ ఏడాది కష్టాలే..
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్య పరపతికి 2024 చాలా కష్టమైన సంవత్సరం అని క్రిస్టాలినా జార్జివా చెప్పారు. కొవిడ్ నష్టాలు, రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు అభివృద్ధిపై దేశాలన్నీ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. పలు దేశాల్లో కోట్లాది మంది ప్రజలు ఎన్నికల్లో పాల్గొంటారని, వారి మనస్సులు దోచుకునేందుకు ప్రభుత్వాలు పన్నులు తగ్గించి, ఖర్చు పెంచాల్సి వస్తుందని, దీనివల్ల ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. సుమారు 80 దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికల వల్ల ఖర్చు ఒత్తిళ్లు ఎలా పెరుగుతాయో తనకు తెలుసునన్నారు. ప్రపంచదేశాలు అధిక ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా గట్టిగా జరిపిన పోరాటంలో విజయం సాధించాయన్నారు. ఈ ఏడాది చివరిలో ఐఎంఎఫ్ ఎండీగా ఆమె ఐదేండ్ల పదవీ కాలం ముగియనున్నది. ఈ పదవిలో కొనసాగే అంశంపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు.