ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం,డిజిటల్ చెల్లింపుల్లో భారత్ భేష్
భారత్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్న బిల్‌గేట్స్;
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ భారత్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. త్వరలో భారత పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మన దేశంపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సరికొత్త ఆవిష్కరణలతో అద్భుతమైన పురోగతి సాధిస్తుందని కొనియాడారు.
మూడేళ్లలో మూడోసారి భారత పర్యటనకు రానున్నట్లు బిల్‌గేట్స్ లింక్డిన్‌లో తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆరోగ్య కార్యక్రమాలను, పోలియో నిర్యూలనను ప్రశంసించారు. 2011లో భారత్ చివరి పోలియో కేసును నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. హెచ్‌ఐవీ నివారణకు చేపడుతున్న అహవాన్ వంటి కార్యక్రమాలను ప్రశంసించారు. నేడు క్షయవ్యాధిపై భారత్ పోరాటం చేస్తున్నదన్నారు. టీకాల తయారీ, రోగ నిర్ధారణలో దేశ సామర్థ్యాలను కొనియాడారు. భారతీయ కంపెనీలు అభవృద్ధి చేస్తున్న టీబీ పరీక్షలు.. ఆఫ్రికాలో ఆ వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు.
బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ గురించి కొనియాడారు. వ్యవసాయ రంగానికి సంబంధించి వాతావరణాన్ని అంచనా వేయడంలో, పంటలను ఎంచుకోవడంలో, చీడపీడల బెదడను తగ్గించడానికి ఏఐ సాయం చేస్తున్నదని చెప్పారు. ఈ సాంకేతికత ఆసియా అంతటా రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.