జమ్మూకశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే

జమ్మూకశ్మీర్‌పై పాక్‌ విమర్శలపై ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ ఫైర్‌;

Advertisement
Update:2025-03-15 10:08 IST

అంతర్జాతీయ వేదికపై భారత్ పై నిందలు వేయడానికి యత్నించిన పాకిస్థాన్‌కు మరోసారి షాక్‌ తప్పలేదు. సంబంధంలేని అంశాల్లోకి జమ్మూకశ్మీర్‌ ప్రస్తావన తీసుకొచ్చిన దాయాదికి న్యూఢిల్లీ గట్టిగా సమాధానం ఇచ్చింది. ఆ దేశానికి మతోన్మాద మనస్తత్వం అని దుయ్యబట్టింది. ఇలాంటి వ్యాఖ్యలతో అబద్ధాలను నిజం చేయలేరని, సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరని చురకలు అంటించింది.

అంతర్జాతీయ ఇస్లామోఫోబియా నిర్మూలన దినం సందర్భంగా ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ఓ సమావేశం నిర్వహించారు.ఇందులో పాకిస్థాన్‌ ప్రతినిధి, ఆ దేశ విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి తెహ్‌మినా జంజువా మాట్లాడుతూ.. కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించారు. దీన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ మాట్లాడుతూ.. పాక్‌ తీరును ఎండగట్టారు.అలవాటు మాదిరిగానే భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌పై పాక్‌ ప్రతినిధి అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. ఇలా పదే పదే అవాస్తవాలు చెప్పినంత మాత్రాన.. వారి వాదన నిజమైపోదు. ఈ వ్యాఖ్యలతో వారు చేస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరు. ఆ దేశ మతోన్మాద మనస్తత్వం ఏమిటో అందరికీ తెలుసు. ఇలాంటి కుటిల ప్రయత్నాలు జమ్మూకశ్మీర్‌ వాస్తవ అంశాలను ఎన్నటికీ మార్చలేవు. అది ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే అని హరీశ్‌ స్పష్టం చేశారు. భారత్‌ వైవిధ్యత, బహుళత్వాన్ని గౌరవిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో మత వివక్ష ఎక్కడున్నా న్యూఢిల్లీ తన వాదనను వినిపిస్తుందని వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News