క్షిపణిని ప్రయోగించి ... ఐసీస్ అగ్రనేత మట్టుబెట్టిందిలా...!
ఇస్లామిక్ స్టేట్ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబు ఖదీజాను మట్టుబెట్టిన వీడియోను విడుదల చేసిన వైట్‌హౌజ్;
ఉగ్రవాద కట్టడిలో అమెరికాకు భారీ విజయం లభించింది. ఇస్లామిక్ స్టేట్ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబ్ధుల్లా మక్కీ మస్లిహ్ అల్ రిఫాయ్ అలియాస్ అబు ఖదీజాను అగ్రరాజ్యం మట్టుబెట్టింది. ఇరాకీ ఇంటెలిజెన్స్, భద్రతా దళాల సంయుక్త సహకారంతో ఇరాక్‌లో జరిపిన ఆపరేషన్‌లో అతడిని హతమార్చింది. అబు ఖదీజా కారులో వెళ్తుండగా.. క్షిపణిని ప్రయోగించి చంపేసింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలను అమెరికా సెంట్రల్ కమాండ్ రిలీజ్ చేసింది.
మార్చి 13న జరిగిన ఈ సీక్రెట్ ఆపరేషన్ వివరాలు తాజాగా బైటికి వచ్చాయి. అబు ఖదీజా కారులో వెళ్తుండగా అమెరికా దళాలు క్షిపణి ప్రయోగించింది. దీంతో ఘటనా స్థంలో అతను మరణించాడు. అతడితో పాటు మరో ఐసిస్ ఉగ్రవాది కూడా చనిపోయినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దాని అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి శరీరాలకు సూసైడ్ బాంబులు అమర్చి ఉన్నాయని, మరిన్న ఆయుధాలు కూడా ఉన్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. గతంలో ఓ ఆపరేషన్ నుంచి అబు ఖదీజా తృటిలో తప్పించుకున్నాడు. అప్పట్లోనే అతని డీఎన్‌ఏ నమూనాను సేకరించారు. వాటి ఆధారంగా తాజాగా డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి ఖదీజా మృతిని ధృవీకరించారు.
బలంతోనే శాంతిని సాధించాం: ట్రంప్
మొదట ఇరాక్ ప్రధాని అతని మృతి వార్తను ప్రకటించారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు.' ఇరాక్‌లో ఐసీస్ అగ్రనేతను హతమార్చాం. అతని కోసం ధైర్యవంతమైన యుద్ధ యోధులను నిర్విరామంగా వేటాడారు. ఇప్పుడు అతడి దుర్భర జీవితం ముగిసింది. బలంతోనే శాంతిని సాధించాం' అని తన ట్రూత్ సోషల్ మీడియాలో రాసకొర్చారు.