భారత్‌కు భారీస్థాయిలో హెలికాప్టర్ విడిభాగాలు
అమెరికా ఆమోదించినట్లు పెంటగాన్ ఓ కీలక ప్రకటన
భారత్-అమెరికాల వ్యూహాత్మక బంధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. భారత్‌కు భారీస్థాయిలో హెలికాప్టర్ విడిభాగాల విక్రయానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈ మేరకు పెంటగాన్ ఓ కీలక ప్రకటన చేసింది. 1.17 బిలియన్ డాలర్ల (రూ.9.9 వేల కోట్ల) విలువైన హెలికాప్టర్ విడిభాగాల విక్రయానికి అగ్రరాజ్యం ఆమోదముద్ర వేసింది. ఈ విడిభాగాలు ఎంహెచ్-60 ఆర్ సీహాక్ (MH-60R Seahawk) హెలికాప్టర్‌ల బలోపేతానికి విక్రయించనున్నట్లు పెంటగాన్ తెలిపింది. లాక్‌హీడ్ మార్టిన్ అనే కంపెనీ ఈ ఒప్పందంలో కీలకపాత్ర పోషించినట్లు వెల్లడించింది.
ఎంహెచ్-60 ఆర్ సీహాక్ గురించి
సముద్ర జలాల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, రాడార్లను నాశనం చేయడానికి ఈ ఎంహెచ్-60 ఆర్ సీహాక్ హెలికాప్టర్‌లను ఉపయోగిస్తారు. ఇందులో 38 లేజర్-గైడెడ్ రాకెట్లు, నాలుగు ఎంకే54 టోర్పిడోలు, మెషీన్‌గన్‌లు శత్రువులను నాశనం చేయడానికి ఉపయోగపడుతాయి. హెలికాప్టర్ ముందుభాగంలోని ఫార్వర్డ్-లుకింగ్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్లు ఎదురుగా ఉన్న జలాంతర్గామి లేదా క్షిపణికి సంబంధించిన కచ్చితమైన ఫొటోను ఆవిష్కరిస్తాయి. ఈ లోహ విహంగం ఒక ప్రాంతాన్ని స్కాన్ చేయగలదు. క్షిపణి దాడులపై హెచ్చరికలను కూడా చేస్తున్నది.