మస్క్ కి మస్కా కొట్టిన బగ్.. ట్విట్టర్లో ఫ్రీగా బ్లూటిక్

Twitter blue tick renewal for free: డబ్బులు కట్టి బ్లూటిక్ కొనసాగించుకోవాలనుకున్నవారు కూడా వాయిదా వేస్తున్నారు. ఉచితంగా బ్లూటిక్ వచ్చినన్ని రోజులు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. దీనంతటికీ కారణమైన బగ్ ని మాత్రం ట్విట్టర్ టీమ్ ఇంకా కనిపెట్టలేకపోయింది.

Advertisement
Update:2023-02-11 14:38 IST

ట్విట్టర్ ని సొంతం చేసుకున్న తర్వాత.. యజమాని ఎలన్ మస్క్, బ్లూటిక్ కి రేటు కట్టి యూజర్లందరికీ షాకిచ్చారు. కాస్త ఆలస్యంగా అయినా బ్లూటిక్ వ్యవహారం తెరపైకి వచ్చింది. భారత్ లో టిక్ మార్క్ కోసం నెలకి 900 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే ట్విట్టర్లోని ఓ బగ్ ఇప్పుడు మస్క్ కి మస్కా కొట్టింది. ఉచితంగా బ్లూటిక్ వచ్చేలా చేస్తోంది. దీనిపై ఇప్పుడు ట్విట్టర్ దృష్టిపెట్టింది. ఆ బగ్ ని కనిపెట్టేందుకు ట్విట్టర్ టీమ్ కష్టపడుతోంది.

ఎలా సాధ్యమైందంటే..?

రుసుము చెల్లించి ఫలానా టైమ్ లోగా మీ బ్లూటిక్ రెన్యువల్ చేసుకోండి, లేకపోతే టిక్ మార్క్ కోల్పోతారు అంటూ చాలామందికి నోటీసులు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది యూజర్లు డబ్బులు కట్టకపోయినా బ్లూటిక్ అలానే ఉంటోందట. దీని గురించి వారి అనుభవాలను యూజర్లు ట్విట్టర్లోనే షేర్ చేసుకుంటున్నారు. దీనికి ఓ బగ్ కారణం అంటూ ప్రాథమికంగా గుర్తించారు. దాన్ని తీసేస్తేనే బ్లూటిక్ విషయంలో ట్విట్టర్ కంపెనీకి డబ్బులు సమకూరతాయి. లేకపోతే బ్లూటిక్ ఉచితంగా ఇచ్చేసినట్టే లెక్క.

బ్లూటిక్ డెడ్ లైన్ కంటే ముందు ఓ యూజర్ తన ప్రొఫైల్ పిక్చర్ మార్చాడు. ఆ వెంటనే ట్విట్టర్ నుంచి మెసేజ్ వచ్చింది. యూజర్ వెరిఫికేషన్ ని కోరింది. అయితే సరిగ్గా తన బ్లూటిక్ ఎక్స్ పయిరీ రోజే అతను వెరిఫికేషన్ చేసుకున్నాడు. దీంతో ట్విట్టర్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ట్విట్టర్ బ్లూ ని సబ్ స్క్రైబ్ చేసుకున్నందుకు ఈ అకౌంట్ ని వెరిఫై చేశామంటూ సందేశం వచ్చింది. దీంతో అతను బ్లూటిక్ కి డబ్బులు కట్టకుండానే అది సొంతమైనట్టయింది.

మరో యూజర్ కూడా తన అనుభవాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు. బ్లూటిక్ కోసం డబ్బులు కట్టకపోయినా తన టిక్ మార్క్ తీసివేయలేదని, రోజులు గడుస్తున్నా అదింకా అలానే ఉందంటున్నాడు. దీంతో డబ్బులు కట్టి బ్లూటిక్ కొనసాగించుకోవాలనుకున్నవారు కూడా వాయిదా వేస్తున్నారు. ఉచితంగా బ్లూటిక్ వచ్చినన్ని రోజులు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. దీనంతటికీ కారణమైన బగ్ ని మాత్రం ట్విట్టర్ టీమ్ ఇంకా కనిపెట్టలేకపోయింది. అప్పటి వరకు బ్లూటిక్ ఉచితమేనన్నమాట.

Tags:    
Advertisement

Similar News