తెలంగాణ మహిళ.. ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక
సంధ్యారెడ్డి సేవలకు గుర్తింపుగా 2020లో సిటిజన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది. స్థానికుల కోరిక మేరకు 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు.
ఆస్ట్రేలియాలో స్ట్రాత్‌ఫీల్డ్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్‌గా తొలిసారిగా తెలుగు మహిళ గురువారం ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఈ పదవి చేపట్టిన తొలి భారతీయ సంతతి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. ఖైరతాబాద్‌కు చెందిన కర్రి సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) ఇక్కడే స్టాన్లీ కాలేజీలో ఇంటర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో లా డిగ్రీ, ఉస్మానియాలో ఎంఏ పూర్తిచేశారు. ఆమె తల్లిదండ్రులు పట్లోళ్ల శంకర్‌రెడ్డి, సారా రెడ్డి. 1991లో కర్రి బుచ్చిరెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో ఆమెకు వివాహం కాగా.. భర్తతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడి ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో మైగ్రేషన్ లా డిగ్రీ పొందారు. తర్వాత ఆమె ఇమ్మిగ్రేషన్ న్యాయవాదిగా పనిచేశారు. స్థానికంగా ఉంటూ భర్తతో కలిసి విస్తృతంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సిటిజన్ ఆఫ్ ది ఇయర్‌గా..
సంధ్యారెడ్డి సేవలకు గుర్తింపుగా 2020లో సిటిజన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది. స్థానికుల కోరిక మేరకు 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఈ మున్సిపాలిటీకి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ప్రతి ఏటా జరుగుతాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో సంధ్యారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఆమె ఎన్నికపై బీఆర్ఎస్ ప్రవాస విభాగం సమన్వయకర్త బిగాల మహేశ్, ఇతర నేతలు అభినందనలు తెలియజేశారు. ఆమె ఎన్నిక తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని పేర్కొన్నారు. సంధ్యారెడ్డికి ఇద్దరు కుమారులు కాగా.. వారిలో నిఖిల్‌రెడ్డి ఈ ఏడాది ఆస్ట్రేలియా జాతీయ చదరంగం పోటీల్లో ఛాంపియన్‌గా నిలవడం విశేషం.