భారత్ లో ఖాలిస్తాన్ దేశం కోసం కెనడాలో రెఫరెండం
ఖాలిస్తాన్ దేశం కోసం కెనడాలో రెఫరెండం జరిగింది. సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే సంస్థ నిర్వహించిన ఈ రెఫరెండంలో వేలాదిగా సిక్కులు ఓట్లు వేశారు.
భారత దేశంలో ఖాలిస్తాన్ ప్రత్యేక దేశం కావాలంటూ ఖలిస్థాన్ అనుకూల గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) కెనడాలో రెఫరెండం నిర్వహించింది. టొరంటో, బ్రాంప్టన్‌లోని గోర్ మెడోస్ కమ్యూనిటీ సెంటర్‌లోని పోలింగ్ స్టేషన్‌లో సిక్కులు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు.
ప్రత్యేక ప్రార్థనలతో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది, అనంతరం భారీ సంఖ్యలో పురుషులు, మహిళలు ఓటు వేసేందుకు క్యూ కట్టారు.
" ప్రపంచ పటంలో భారత పంజాబ్ రాష్ట్రంలో కొత్త దేశం కనిపిస్తుంది'' అని కొందరు ఓటర్లు వ్యాఖ్యానించారు.
కెనడాలో పది లక్షలకు పైగా సిక్కులు ఉన్నారు. చాలా కాలంగా అక్కడ ఖాలిస్తాన్ కు అనుకూల ఉద్యమం నడుస్తోంది. దానిలో భాగంగానే ఈ రెఫరెండం నిర్వహించారు. దీనిని అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేసింది. రెఫరెండం జరగకుండా చూడాలని కెనడా ప్రభుత్వాన్ని భారత సర్కార్ కోరింది. భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ చర్యలను అడ్డుకోవాలని కాస్తంత ఘాటుగానే కెనడాకు చెప్పింది. అయినప్పటికీ కెనడా మాత్రం ఒప్పుకోలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా తమ భావాలను వ్యక్తీకరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని , చట్టపరిధిలో వారు చేస్తున్న ఈ చర్యలను తాము అడ్డుకోలేమని తేల్చి చెప్పింది.
కెనడియన్ ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ, "కెనడియన్ పౌరులకు కెనడియన్ చట్టాల ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం, సమావేశమయ్యే హక్కు, తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ప్రతి ఒక్కరికీ పూర్తి స్వేచ్ఛ ఉంది." అని అన్నారు.
కెనడా రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా రాజకీయ వ్యక్తీకరణను ఆపలేమని కెనడా ఎంపీ సుఖ్మీందర్ సింగ్ ధాలివాల్ అన్నారు.
సిక్స్ ఫర్ జస్టిస్(SFJ) పాలసీ డైరెక్టర్ జతీందర్ సింగ్ గ్రేవాల్ మాట్లాడుతూ, "ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణ అంశం భావప్రకటనా స్వేచ్ఛ హక్కులో బాగం. ఇది కెనడియన్లందరికీ ఉన్న ప్రాథమిక హక్కు. ఈ ప్రజాస్వామ్య సూత్రాన్ని అర్థం చేసుకోవడం భారతదేశానికి చాలా కష్టం. ఎందుకంటే వారు తమ దేశంలో రాజకీయ కార్యకలాపాలను నేరంగా పరిగణిస్తున్నారు. తమ స్వయం నిర్ణయాధికారం కోసం తమ హక్కును వినియోగించుకోవాలనుకునే అసంఖ్యాక సిక్కులపై 'ఉగ్రవాదులు'గా ముద్ర వేశారు. ఇప్పుడు భారతదేశం ఆ అప్రజాస్వామిక పద్దతిని పశ్చిమానికి ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ కెనడియన్ చార్టర్ ఆఫ్ రైట్స్ అండ్ ఫ్రీడమ్ మాకు ఈ హక్కును హామీ ఇచ్చింది. భారతదేశం ఎంత ఒత్తిడి చేసినా మాకు ఈ హక్కును లేకుండా చేయలేదు.'' అన్నారాయన.