పాక్‌లో మరోసారి ఉగ్రవాదుల పంజా

పాకిస్థాన్‌లో రెండో అతిపెద్ద వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు సైనికులు మృతిచెందినట్టు స్థానిక మీడియా తెలిపింది. అయితే, ఈ దాడికి తామే పాల్పడినట్టు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది.

Advertisement
Update:2024-03-26 16:24 IST

పాకిస్థాన్‌లో రెండో అతిపెద్ద వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు సైనికులు మృతిచెందినట్టు స్థానిక మీడియా తెలిపింది. అయితే, ఈ దాడికి తామే పాల్పడినట్టు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. బలూచిస్థాన్ వనరులపై చైనా పెట్టుబడులకు వ్యతిరేకంగా ఈ చర్యకు దిగినట్టు పేర్కొంది.

ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్.. దాని కబంధ హస్తాల్లోనే చిక్కుకొని విలవిలలాడుతోంది. వరుస ఉగ్రవాద దాడులతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. వారం వ్యవధిలోనే సైనిక స్థావరాలే లక్ష్యంగా ఉగ్రవాదులు రెండు సార్లు దాడులకు పాల్పడ్డారు. తాజా ఉగ్రదాడితో అప్రమత్తమైన అధికారులు.. తుర్బాత్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్యుల సెలవులను రద్దుచేసి అందరూ తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని ఆదేశించారు.


విమానాశ్రయ సరిహద్దుకు మూడు వైపుల నుంచి దాడికి ప్రయత్నించారని, రాత్రి సమయంలో కాల్పులు, పేలుళ్లు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎయిర్‌బేస్ లేదా ఎయిర్‌క్రాఫ్ట్‌కు ఎలాంటి హాని జరగకుండా నిరోధించామని భద్రతా సిబ్బంది తెలిపారు.

భద్రతా బలగాలు దాడిని అడ్డుకుని కనీసం ఆరుగురు ఉగ్రవాదులను హతమారచినట్టుగా సమాచారం. వారం రోజుల వ్యవధిలో బలూచ్ ఆర్మీ చేసిన రెండో దాడి కాగా.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ మూడోది. జనవరి 29న మాచ్ నగరం, మార్చి 20 గ్వాదర్‌లోని పాక్ మిలటరీ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై బీఎల్ఏ మజీద్ బ్రిగేడ్ దాడులు చేసింది. గ్వాదర్ పోర్టుపై జరిగిన దాడిలో ఇద్దరు పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపెక్)‌లో గ్వాదర్ పోర్ట్ చాలా కీలకమైంది. దీనికోసం దీంతో చైనా భారీగా ఖర్చుచేస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌ను బలూచిస్థాన్ ప్రావిన్సుల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చైనా ఈ ప్రాజెక్ట్ పేరుతో వనరులను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.


 



Tags:    
Advertisement

Similar News