స్మార్ట్ ఫోన్ పెద్దవాళ్లకే కాదు, పిల్లలకు కూడా హస్తభూషణంలా మారిపోయింది. పిల్లలు మారాం చేయకుండా తిండి తినాలంటే స్మార్ట్ ఫోన్ చేతికందించి వీడియోలు చూపించడం ఒక్కటే పరిష్కారం అనుకుంటున్నారు ఈ తరం తల్లిదండ్రులు. అలా ఫోన్ అలవాటైన పిల్లలు ఇక దాన్ని వదిలిపెట్టడం లేదు. హై స్కూల్ లెవల్ కే సొంత ఫోన్ల వాడకం మొదలు పెడుతున్నారు. సోషల్ మీడియా అకౌంట్లలో కూడా వారిదే హవా. పిల్ల చదువులపై ప్రభావం చూపించే సెల్ ఫోన్ ని వీలైనంత మేర కట్టడి చేయాలనుకుంటోంది చైనా.
చైనా చిన్నారులు ఇంటర్నెట్ కు బానిసలుగా మారిపోయారని అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఆన్ లైన్ గేమ్స్ ఆడుకునే విషయంలో చైనాలో ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి. చిన్నారులు పగటిపూట ఆన్ లైన్ గేమ్స్ ఆడుకునే సమయాన్ని 90 నిమిషాలకే పరిమితం చేస్తూ 2019లో ఆంక్షలు విధించింది చైనా ప్రభుత్వం. శుక్ర, శని, ఆదివారాలు, సెలవుల రోజుల్లో ఈ సమయాన్ని గంటకి పరిమితం చేస్తూ 2021లో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. తాజాగా మరిన్ని నిబంధనలు అమలులోకి తెస్తోంది చైనా ప్రభుత్వం. మైనర్లు స్మార్ట్ ఫోన్ ఉపయోగించే సమయాన్ని రోజుకు గరిష్టంగా 2 గంటలకు పరిమితం చేస్తూ కొత్త ఆంక్షలను తెరపైకి తెచ్చింది. చైనా ఇంటర్నెట్ నియంత్రణ సంస్థ అయిన ‘సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా’ (CAC) ఈ నిబంధనలు ఖరారు చేసింది.
కొత్త నిబంధనలు..
మైనర్లకు రాత్రి 10 గంటలనుంచి ఉదయం 6 గంటల మధ్య ఇంటర్నెట్ బంద్.
16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసువారికి రోజుకి 2 గంటలే ఇంటర్నెట్
8 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు రోజుకి గంటసేపు ఇంటర్నెట్
ఎనిమిదేళ్లలోపు వారికి రోజుకి 40 నిమిషాలు మాత్రమే ఇంటర్నెట్
అయితే ఇంటర్నెట్ లో అన్ని సేవలపై ఆంక్షలు లేవు. మైనర్ల శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడే యాప్స్, విద్యకు సంబంధించిన యాప్స్ కి ఈ నిబంధనలు వర్తించవు. ఇంటర్నెట్ ప్లాట్ ఫాంలలో ‘యూత్ మోడ్’ను తీసుకొచ్చింది చైనా. సెప్టెంబర్-2లోగా ప్రజల అభిప్రాయాలు తీసుకుని కొత్త నిర్ణయాలను చట్టం రూపంలో తీసుకు వస్తుంది ప్రభుత్వం.