కౌశిక్ రెడ్డి ఇంటిపై గాంధీ అనుచరుల దాడి.. హైటెన్షన్

ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం మరింత హీటెక్కింది.

Advertisement
Update: 2024-09-12 07:59 GMT

హైదరాబాద్ : ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం మరింత హీటెక్కింది. కౌశిక్ రెడ్డి ఇంటికి అరెకపూడి గాంధీ అనుచరులతో కలిసి వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు గాంధీ అనుచరులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు, గాంధీ అనుచరులు పోలీసులను తోసుకుని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. పోటాపోటీగా నినాదాలు చేయడంతో పాటు కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంట్లోకి అరికెపూడి అనుచరులు దూసుకెళ్లారు. ఇంటిపై రాళ్లతో దాడి చేయడంతో అద్దాలు ద్వంసం అయ్యాయి. ఇరు వర్గాలు అనుచరులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నియంత్రించడం పోలీసులు కూడా కష్టంగా మారింది. మరోవైపు తన అనచరులతో కలిసి అరెకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటివద్దే బైఠాయించారు. ఆయన్ను వెళ్లిపోవాలని పోలీసులు ప్రయత్నించినా లాభం లేదు. కౌశిక్ రెడ్డిని బయటకు పిలవాలని, లేదంటే తనను లోపలికి పంపించాలని గాంధీ డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ లో ఉంటే.. తెలంగాణ భవన్‌కు రావాలి

అంతకు ముందు కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. "బీఆర్ఎస్ తో పంచాయితీ లేదని అరెకపూడి గాంధీ అంటున్నారు. నాతోనే ఆయన పంచాయితీ అని చెబుతున్నారు. మీతో నాకు భూమి గొడవలు ఏమైనా ఉన్నాయా? బీఆర్ఎస్ బీ ఫాంపై గెలిచి కాంగ్రెస్‌లో ఎలా చేరతారు? రూ. కోట్లకు అమ్ముడుపోయారు. భూ పంచాయితీలో సెటిల్‌మెంట్ల కోసమే కాంగ్రెస్‌ లో చేరారు. ధైర్యముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి. ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది. అరెకపూడి గాంధీ బీఆర్ఎస్ లోనే ఉంటే తెలంగాణ భవన్‌కు రావాలి. అక్కడి నుంచి ఇద్దరం కేసీఆర్‌ దగ్గరకు వెళదాం. ఒకవేళ కాంగ్రెస్‌లో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. శుక్రవారం ఉదయం పార్టీ కార్యకర్తలతో కలిసి అరెకపూడి గాంధీ ఇంటికెళ్తాం. ఆయన మా పార్టీలో ఉన్నానని చెబుతున్నారు కాబట్టే వెళ్తున్నాం. గాంధీని సాదరంగా కేసీఆర్‌ ఇంటికి తీసుకెళ్తాం. పార్టీ నుంచి వెళ్లిన ప్రతి ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడను. కాంగ్రెస్‌లో చేరలేదని అరెకపూడి గాంధీ అన్నారు. మా పార్టీ ఎమ్మెల్యే కాబట్టే ఆయన ఇంటికి వెళ్తామంటున్నాం.. దీనిలో తప్పేముంది?" అని అరెకపూడి గాంధీని ఉద్దేశించి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

గాంధీ అరెస్టు

తన ఇంటికి పాడి కౌశిక్ రెడ్డి వస్తానని రాలేదు కాబట్టే తాను ఆయన ఇంటికి వెళ్లానని అరికెపూడి గాంధీ అన్నారు. ‘ నా ఇంటికి నువ్వు రాలేకపోయావ్.. నేనే మీ ఇంటికి వచ్చా. కౌశిక్ రెడ్డి ఒక బ్రోకర్.’తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ లోకి వచ్చినప్పటి నుంచి కౌశిక్ రెడ్డి తీరు సరిగా లేదని అరికెపూడి గాంధీ తెలిపారు. కౌశిక్ తీరు వల్లే ఆ పార్టీ ఓటమి పాలైందని విమర్శలు చేశారు. కోవర్టుగా వ్యవహరించిన కౌశిక్ వ్యక్తిత్వం తెలుసుకోకుండా బీఆర్ఎస్ లో స్థానం కల్పించారని మండిపడ్డారు. అనంతరం కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా ఇరు వర్గాల కార్యకర్తలను పోలుసులు అరెస్టు చేశారు.

Tags:    
Advertisement

Similar News