శిఖర సమాన కళాకారుల్లో చిరంజీవి ఒకరు.. సుప్రీం మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసలు
కళామతల్లికి ఆయన చేసిన సేవలు మహోన్నతం అని అన్నారు. చిరంజీవికి లభించిన పురస్కారం తెలుగు సినీ రంగానికి గర్వకారణమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి తాజాగా ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు సినీ రాజకీయ ప్రముఖులే కాకుండా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చిరంజీవికి అభినందనలు తెలిపారు.
పునాదిరాళ్లు సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించాడు. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ రంగంలో నెంబర్ వన్‌గా నిలిచాడు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో చిరంజీవిని అభినందిస్తూ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఒక లేఖ రాశారు.
తెలుగు సినీ రంగం గర్వించదగిన శిఖర సమాన కళాకారుల్లో చిరంజీవి ఒకరని ఆయన కొనియాడారు. కళామతల్లికి ఆయన చేసిన సేవలు మహోన్నతం అని అన్నారు. చిరంజీవికి లభించిన పురస్కారం తెలుగు సినీ రంగానికి గర్వకారణమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా భారతీయ చిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013 నుంచి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 2022 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు మెగాస్టార్ చిరంజీవి ఎంపిక అయ్యారు.