ఈ నొప్పికి ఇలా నిద్రపోండి..
నిద్రపోతున్నప్పుడు మీరు గురక వేస్తే పక్కకు తిరిగి లేదా వెల్లకిలా పడుకోండి. ఆ సమయంలో మీ తలను సహజంగా కన్నా ఇంకాస్త ఎక్కువ ఎత్తులో ఉంచండి.
సాధారణంగా నిద్రపోయే ముందు ఏ భంగిమలో పడుకున్నామో లేచేటప్పుడు అలాగే లేచేవారు చాలా తక్కువ. నిద్రలో కొందరు ఒక పక్కకు తిరుగుతారు. మరికొందరు వెల్లకిలా పడుకుంటారు. సౌకర్యవంతంగా నిద్రపోయేందుకు ఒక్కొక్కరు ఒక్కో భంగిమ ప్రయత్నిస్తారు. అయితే ఏ భంగిమలో పడుకోవడం ఉత్తమమో మీకు తెలుసా.. అది తెలియాలంటే ఇది చదవాల్సిందే..
గురక ఉంటే..
నిద్రపోతున్నప్పుడు మీరు గురక వేస్తే పక్కకు తిరిగి లేదా వెల్లకిలా పడుకోండి. ఆ సమయంలో మీ తలను సహజంగా కన్నా ఇంకాస్త ఎక్కువ ఎత్తులో ఉంచండి. ఈ స్థితిలో నిద్రించడం వల్ల నాలుక, కణజాలం గొంతుకు అంటుకోవు. శ్వాస సులభంగా వచ్చి శబ్దం రాకుండా ఉంటుంది.
మెడ నొప్పి..
మెడ నొప్పి వచ్చినప్పుడు రాత్రంతా నిద్రలేకుండా గడపాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో మెడ కింద దిండు పెట్టుకోవద్దు. దిండు ఎత్తు భుజానికి సమానంగా ఉండాలి. నిటారుగా పడుకోవటం ఉత్తమం.
వెన్నునొప్పి..
రాత్రి అయ్యేసరికి వచ్చే వెన్నునొప్పి కూడా నిద్రలో ఇబ్బందికి ఒక ముఖ్యమైన కారణం అవుతుంది. ఈ సందర్భంలో మీ వెనుకభాగం నేలపై ఉండేలా పడుకోండి. మోకాళ్ల కింద దిండు ఉంచండి. ఇది వెన్నెముక సహజంగా ఉండేందుకు సహాయపడుతుంది. అయితే మీరు మరీ సన్నగా ఉండి, నడుం నేలకు తగలకపోతే మాత్రం నడుము కింద టవల్ పెట్టుకోవచ్చు.
ఎసిడిటీ..
చాలాసార్లు అర్ధరాత్రి వచ్చే ఎసిడిటీ ఆ తరువాత సమయం అంతా నిద్రపోనివ్వదు. అటువంటి పరిస్థితిలో తల కింద ఒక ఎత్తైన దిండును ఉంచండి. గుండెల్లో మంటగా అనిపిస్తే ఎడమ వైపు పడుకోవడం కూడా ఉపశమనం కలిగిస్తుంది.
కాలు తిమ్మిర్లు..
మీకు రాత్రిపూట కాలు తిమ్మిర్లు అనిపిస్తే కొన్ని రోజులపాటూ పాదాలకు రాత్రిపుట మసాజ్ చేయండి. తేలికగా సాగదీయండి. ఇప్పటికీ, నొప్పి కొనసాగితే, మీరు హీట్ ప్యాడ్ ఉపయోగించవచ్చు.
పీరియడ్స్ సమయంలో కొంతమందికి కడుపులో విపరీతమైన నొప్పి ఉంటుంది. దాని వల్ల నిద్ర కూడా పట్టదు. అలాంటప్పుడు పక్కకు తిరిగి పడుకుని ఛాతివైపు మోకాళ్లను ముడుచుకుని పడుకోవడం వల్ల కండరాలపై ఒత్తిడి తగ్గి, నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. నొప్పి ఎక్కువగా అనిపిస్తే బోర్లా పడుకుని పొట్టకు కాస్త కింద.. దిండు పెట్టుకోండి.