ఏపీ ఐటీ మినిస్టర్ అలా.. ! తెలంగాణ ఐటీ మినిస్టర్ ఇలా..!
మంత్రి కేటీఆర్ మాత్రం ముందు అభివృద్ధి, తర్వాతే రాజకీయాలంటున్నారు. అందుకే ఆయన హైదరాబాద్ కి ఏయే కంపెనీలు వస్తున్నాయి, ఎంత పెట్టుబడి వస్తోంది, ఎంతమందికి ఉపాధి కలుగుతోంది.. అనే అంశాలపై ఫోకస్ పెట్టారు.
"జీనోమ్ వ్యాలీలో 5 కొత్త ప్రాజెక్ట్ లు ప్రారంభించడం సంతోషంగా ఉంది. 1100కోట్ల రూపాయల పెట్టుబడులు, 3వేలమందికి పైగా ఉపాధి అవకాశాలు ఈ ప్రాజెక్ట్ ల ద్వారా లభిస్తాయి." తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి పెట్టిన ట్వీట్ ఇది.
PK = పిచ్చి కుక్క
PK = ప్యాకేజీ కల్యాణ్
PK = పెళ్లిళ్ల కల్యాణ్. ఏపీ ఐటీ మంత్రి తాజాగా వేసిన ట్వీట్ ఇది.
ఇంతకంటే ఇంకేం పోలిక కావాలి, ఇంతకంటే ఇంకేం వివరణ ఇవ్వాలి. ఏపీలో మంత్రుల పరిస్థితి ఎలా ఉంది, తెలంగాణలో మంత్రులు ఎలా ఆలోచిస్తున్నారు అని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ.
వాస్తవానికి 151 సీట్లతో వైసీపీ ఏపీలో బలంగా ఉంది. దాదాపుగా అక్కడ ప్రతిపక్షం లేదనే చెప్పాలి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కి బీజేపీ, కాంగ్రెస్ గట్టిపోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. అంటే రాజకీయాలు ఏపీలో కంటే తెలంగాణలోనే వాడివేడిగా ఉండాలి. అందులోనూ ఏపీలో రెండేళ్ల తర్వాతే ఎన్నికలు. తెలంగాణలో ఏడాదిలోనే ఎన్నికలు ఉన్నాయి. ముందు మునుగోడు ఉప పోరు జరుగుతోంది. అంటే తెలంగాణ మంత్రులు పథకాలు, అభివృద్ధిని పక్కనపెట్టి పూర్తిగా రాజకీయాల్లో తలమునకలై ఉండాల్సిన సందర్భం ఇది. కానీ, మంత్రి కేటీఆర్ మాత్రం ముందు అభివృద్ధి, తర్వాతే రాజకీయాలంటున్నారు. అందుకే ఆయన హైదరాబాద్ కి ఏయే కంపెనీలు వస్తున్నాయి, ఎంత పెట్టుబడి వస్తోంది, ఎంతమందికి ఉపాధి కలుగుతోంది.. అనే అంశాలపై ఫోకస్ పెట్టారు.
ఏపీ మంత్రి ట్వీట్ చూశారుగా, రాజకీయాలు ఎలా మారిపోయాయో. ఏపీలో మంత్రి కావాలన్నా, మంత్రి పదవి నిలబెట్టుకోవాలన్నా ప్రధాన అర్హత అదే. అందుకే అక్కడ పదవులు నిలబెట్టుకునేందుకు అభివృద్ధిని సైతం పక్కనపెట్టేశారు మంత్రులు. అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేని పవన్ కల్యాణ్ ని మాటలతో తరుముతున్నారు. తిడుతున్నారు, తిట్టించుకుంటున్నారు, ఏపీ రాజకీయాలను తిట్ల పురాణంగా మార్చేశారు. వ్యక్తిగత విషయాలతో పరువు బజారుకీడ్చుకుంటున్నారు.
గతంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోలిక అవసరం లేదు. ఎందుకంటే వైసీపీకి తెలంగాణలో చోటు లేదు, టీఆర్ఎస్ కి ఏపీతో అవసరం లేదు. కానీ, ఇప్పుడు టీఆర్ఎస్, బీఆర్ఎస్ అవుతోంది.. తెలంగాణ మోడల్ అభివృద్ధిని అన్నిచోట్లా చేసి చూపిస్తామంటోంది. ఈ దశలో టీఆర్ఎస్ పాలన దేశవ్యాప్తంగా రోల్ మోడల్ అవుతోంది. ఏపీ నాయకులూ కాస్త తెలంగాణ మంత్రుల్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. అధినాయకుడిని సంతృప్తిపరచాలనుకోవడంతోపాటు, ప్రజలకు ఏది అవసరమో గమనించండి.