Bajaj CNG fuel bike | బజాజ్ నుంచి మరో అద్భుతమైన మోటార్ బైక్.. ఫ్యూయల్ కాస్ట్ సగానికి సగం తగ్గింపు
సీఎన్‌జీ ఫ్యూయల్ బేస్డ్ మోటార్ సైకిల్‌ను మార్కెట్లోకి తెస్తున్నట్లు ఇటీవల బజాజ్ ఆటో ఎండీ కం సీఈఓ రాజీవ్ బజాజ్ చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ ధరలు, ఫ్యూయల్ ఖర్చుతో పోలిస్తే సీఎన్‌జీ మోటార్ సైకిళ్లు చౌకగా లభిస్తాయన్నారు.
Bajaj CNG fuel bike | దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో.. 1972 నుంచి 2006 వరకు ఉత్పత్తి చేసిన టూ వీలర్ (2/4 స్ట్రోక్) బజాజ్ చేతక్ (Bajaj Chetak) ఏంతో ఫేమస్.. తాజాగా అత్యాధునిక వర్షన్ చేతక్ ఎలక్ట్రిక్ (Chetak Electric). 2.89 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో 4.2 కిలోవాట్ల బీఎల్‌డీసీ మోటార్‌తో ఇటీవల చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఆవిష్కరించింది బజాజ్ ఆటో. చేతక్ ఎలక్ట్రిక్ (Chetak Electric) సింగిల్ చార్జింగ్‌తో 90 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. గంటకు గరిష్టంగా 63 కి.మీ (50 మైళ్లు) దూరం ప్రయాణించగల కెపాసిటీ దీని స్పెషాలిటీ. తాజాగా ఎంట్రీ లెవల్ సీఎన్‌జీ ఫ్యూయల్ మోటార్ సైకిల్ ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది.
సీఎన్‌జీ ఫ్యూయల్ బేస్డ్ మోటార్ సైకిల్‌ను మార్కెట్లోకి తెస్తున్నట్లు ఇటీవల ఓ ఆంగ్ల టీవీ చానెల్‌తో మాట్లాడతూ బజాజ్ ఆటో ఎండీ కం సీఈఓ రాజీవ్ బజాజ్ చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ ధరలు, ఫ్యూయల్ ఖర్చుతో పోలిస్తే సీఎన్‌జీ మోటార్ సైకిళ్లు చౌకగా లభిస్తాయన్నారు. అధిక పెట్రోల్ ధరలు భరించలేని వారికి సీఎన్‌జీ ఫ్యూయల్ బైక్ ఆకర్షణీయంగా ఉంటుందని పేర్కొన్నారు.
సీఎన్‌జీ ఫ్యూయల్ బైక్‌ల బ్యాటరీ లైఫ్, చార్జింగ్, సేఫ్టీ, శ్రేణి గురించి తయారీదారులకు ఆందోళనలేమి లేవని రాజీవ్ బజాజ్ చెప్పారు. ఈ బైక్‌ల ఫ్యూయల్ ఖర్చు 50 శాతానికి తగ్గుతుందన్నారు. మోటార్ సైకిల్ రైడర్లకు చాలా మంచిదన్నారు. ఈ ప్రణాళికను బజాజ్ ఆటో అమలు చేస్తే.. భారత్ మార్కెట్లో పూర్తిస్థాయిలో సీఎన్‌జీ ఫ్యూయల్ వినియోగంతో పని చేసే మోటార్ సైకిల్ తయారు చేసిన తొలి సంస్థగా నిలుస్తుంది.
ప్రస్తుత ఫెస్టివ్ సీజన్‌లో ఎంట్రీ లెవల్ ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ బైక్‌ల (100సీసీ) విక్రయాలు పెరుగుతాయని తాను భావించడం లేదని రాజీవ్ బజాజ్ చెప్పారు. మోటారు సైకిళ్లు, స్కూటర్ల కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మళ్తున్నారన్నారు. పెరిగిన పెట్రోల్ ధరలు, కొవిడ్-19 ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులైన వారు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని తెలిపారు.
100సీసీ-125సీసీ ఇంజిన్ సెగ్మెంటల మధ్య బజాజ్ ఏడు మోటారు సైకిళ్లు విక్రయిస్తోంది. 100 సీసీ సెగ్మెంట్‌లో బజాజ్ ప్లాటినా, బజాజ్ సీటీ 100 విక్రయిస్తోంది. 100 సీసీ సెగ్మెంట్ బైక్స్‌లో తాము మొదటి స్థానంలో లేమన్నారు రాజీవ్ బజాజ్.
ప్రస్తుతం సీఎన్‌జీ వేరియంట్ త్రీ వీలర్స్ మార్కెట్‌లో బజాజ్ ఆటో సుమారు 70 శాతం వాటా కలిగి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు అప్‌గ్రేడ్ చేసిన పల్సర్ మోటార్ సైకిళ్లు, అత్యంత శక్తిమంతమైన పల్సర్ ఆవిష్కరించామని రాజీవ్ బజాజ్ వివరించారు. 250సీసీ సెగ్మెంట్‌లో అత్యంత శక్తిమంతమైన మోటారు సైకిల్ మార్కెట్‌లో ఉందని తెలిపారు.
ట్రయంఫ్ మోటార్ సైకిళ్లు, చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి పెంచుతున్నట్లు రాజీవ్ బజాజ్ తెలిపారు. ట్రయంఫ్ మోటార్ సైకిళ్లు ప్రస్తుతం 8000 యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నామని, ఇక నుంచి ప్రతి నెలా 15,000-20,000 యూనిట్ల మధ్య ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రస్తుత ఫెస్టివ్ సీజన్‌లో సుమారు 10 వేల చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉత్పత్తి చేస్తామని, ఈ ఏడాది చివరికల్లా సుమారు 20 వేల యూనిట్లు ఉత్పత్తి చేస్తామన్నారు. వచ్చే నెల నుంచి ట్రయంఫ్ మోటారు సైకిళ్లు విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు.
2016లో ప్రయోగాత్మకంగా కేంద్ర ప్రభుత్వం సీఎన్‌జీ ఫ్యూయల్ టూవీలర్‌ను ఆవిష్కరించింది. సీఎన్‌జీ పవర్డ్ హోండా యాక్టీవా స్కూటర్లను ఢిల్లీలో ఫుడ్ డెలివరీ సర్వీసుల కోసం వినియోగిస్తున్నారు.
♦