కేసీఆర్ పేరు చెరిపేయడమంటే 'తెలంగాణ' లేకుండా చేస్తరా?
స్వరాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీయడమే సీఎం రేవంత్ రెడ్డి గేమ్ ప్లానా?
గడిచిన 11 నెలలుగా తెలంగాణ అస్తిత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్ధతి ప్రకారం దాడి చేస్తున్నారా? తెలంగాణకు ఆయువు పట్టుగా ఉన్న హైదరాబాద్ ను దెబ్బతీసేందుకు పాలకుడి హోదాలో తనకు దఖలు పరిచిన అధికారాన్ని విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారా? 'తెలంగాణ' లేకుండా చేయడమే ఆయన వ్యూహమా? తనకు తాను గొప్పగా చెప్పుకునే 'గేమ్ ప్లాన్' అదేనా? అనే ప్రశ్నలకు వరుస పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. తన గేమ్ ప్లాన్ ను సియోల్ పర్యటనకు వెళ్లివచ్చిన జర్నలిస్టుల చిట్ చాట్ లో చాలా గొప్పగా ఆవిష్కరించుకున్నారు ఏలినవారు రేవంత్ రెడ్డి. ఏడాదిలో కేసీఆర్ పేరు లేకుండా చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పడం వెనుక రాజకీయ కోణం మాత్రమే కాదు.. పకడ్బందీ గేమ్ ప్లాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక్క గేమ్ ప్లాన్ తోనే ఆన్ ఫీల్డ్ లో ఆట రక్తికట్టదు. దానికి పకడ్బందీ స్క్రీన్ ప్లే కూడా కావాలి. రేవంత్ రెడ్డి మంచి గేమ్ ప్లానర్ అయితే.. ఆయన స్క్రిప్ట్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కాస్త దూరం నుంచి పని చేస్తున్నట్టు అనిపిస్తున్నది. అందుకే అద్బుతమైన ఆర్ట్ డైరెక్టర్ (హైడ్రా) ను ముందు పెట్టి హైదరాబాద్ ను శిథిల సౌథంగా మార్చే కుట్రకు అంకురార్పణ జరిగింది. మూసీ బ్యూటిఫికేషన్.. ఆ తర్వాత ముఖ్యమంత్రి నాలుక మడతేసినట్టు మూసీ పునరుజ్జీవం పేరుతో సామాన్యులపైకి సర్కారు కత్తి దూసింది. పిడిబాకు విసిరింది. విల్లంబులు ఎక్కుపెట్టింది. తద్వారా మూసీ బాధితుల రక్తకన్నీరుకు కారణం అయ్యింది.
రాజకీయంగా రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రత్యర్థులు. తెలంగాణ పాలిటిక్స్ లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తో పాటు మెయిన్ ప్లేయర్ గా బీజేపీ కూడా ఉంది. కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో సమన్వయం లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ రఘునందన్ రావు ఔట్ రైట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యలను సమర్థిస్తున్నారు. ఈటల రాజేందర్ ఔట్ రైట్ గా రేవంత్ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాస్త డైలమాలో ఉన్నారు. మిగతా బీజేపీ ఎంపీలు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. బండి సంజయ్, రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డికి అండగా నిలవడం వెనుక ఏ కారణాలున్నాయో కానీ వారిద్దరికీ రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్ అన్నది మాత్రం స్పష్టమవుతోంది. రేవంత్ రెడ్డితో పాటు తమకు కామన్ గా పొలిటికల్ వైరం ఉన్నది కేసీఆర్ తో కాబట్టి బీజేపీలో ఉన్నా వారిద్దరు తెలంగాణ ముఖ్యమంత్రి వైపు మొగ్గు చూపుతున్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్.. ఇద్దరూ రాజకీయంగా కేసీఆర్ అస్తిత్వాన్ని తెరమరుగు చేస్తామని చెప్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు రాజకీయ విమర్శలు చేసుకోవడం వరకు ఓకే.. వాటిని ఎవరూ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు, ఆయన వేస్తున్న అడుగులు మాత్రం ఎక్కడో సందేహాలకు తావిస్తున్నాయి. కేసీఆర్ అస్తిత్వం లేకుండా చేయడం అంటే అసలు తెలంగాణానే లేకుండా చేయడం అన్నట్టుగా ఆయన చర్యలున్నాయి.
తెలంగాణ, కేసీఆర్ ను వేర్వేరుగా చూడలేం. కేసీఆర్ తో రాజకీయంగా ఎంతగా విభేదించినా కేసీఆర్ వేరు, తెలంగాణ వేరు అని చెప్పలేం. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు.. తెలంగాణ లేకుండా కేసీఆర్ లేరు. నివురుకప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రజ్వరిల్లేలా చేసింది కేసీఆర్. ఆయనతో సబ్బండ వర్ణాలు కలిసి నడిచాయి. తెలంగాణ ఏర్పాటు తప్ప అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ఇంకో ప్రత్యామ్నాయం లేకుండా కేసీఆర్ చేశారు. పార్లమెంట్ లో ప్రాతినిథ్యం ఉన్న సీపీఎం మినహా దాదాపు అన్ని పార్టీల మద్దతును కేసీఆర్ కూడగట్టగలిగారు. అందుకే అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసింది. స్వరాష్ట్ర సాధకుడిగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు రెండుసార్లు అవకాశమిచ్చి ముఖ్యమంత్రిని చేశారు. మూడోసారి చాన్స్ ఇవ్వకుండా ప్రతిపక్షానికి పరిమితం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేశానని.. అది తన ఘనత మాత్రమేనని రేవంత్ రెడ్డి డప్పు కొట్టుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి కేసీఆర్ ను చూస్తున్న వాళ్లకు ఆయన మౌనానికి కారణాలమేమిటో తెలుసు. ఆయన పార్టీ నాయకుడిగా గతంలో పని చేసిన రేవంత్ రెడ్డి అంతకన్నా ఎక్కువే తెలుసు. తన పది నెలల పరిపాలనలో మెజార్టీ ప్రజల వ్యతిరేకతను రేవంత్ మూటగట్టుకున్నారు. ఈ విషయం అందరికన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి కూడా రేవంత్ రెడ్డినే. ఒక్క ప్రజావిశ్వాసాన్ని మాత్రమే కాదు.. కాంగ్రెస్ హైకమాండ్ విశ్వాసాన్ని కూడా రేవంత్ కోల్పోయినట్టుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. రేవంత్ ను కలవడానికి కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇష్టపడటం లేదని అంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికార మార్పిడి తథ్యమని కూడా చెప్తున్నారు.
మల్లన్నసాగర్.. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన రిజర్వాయర్. 50 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన ఈ రిజర్వాయర్ తెలంగాణాకే కాదు హైదరాబాద్ కు లైఫ్ లైన్ అని కేసీఆర్ గతంలో చెప్పేవారు. ఇప్పుడు ఆయన మాటలను రేవంత్ రెడ్డి నిజం చేస్తున్నారు. కాళేశ్వరం నీళ్లతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు నింపి మూసీని పునరుజ్జీవం చేయడం అనే ప్రాజెక్టుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే అంకురార్పణ జరిగింది. మల్లన్నసాగర్ నుంచి కాకుండా కొండపోచమ్మ సాగర్ నుంచి ప్రత్యేక ట్రంక్ లైన్ ద్వారా శామీర్ పేట మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు అవతలి నుంచి గోదావరి జలాల తరలింపు ప్రక్రియను రూ.1,100 కోట్లతో చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కేసీఆర్ నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ హైదరాబాద్ కు లైఫ్ లైన్ అని నిరూపించేందుకు అక్కడి నుంచే గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు చేపడుతున్నారు. ఇందుకు ఏకంగా రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. తద్వారా కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం కాదు.. ఆయన నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సార్థకత చేకూర్చే ప్రయత్నాల్లో రేవంత్ ఉన్నారు. తద్వారా తాను కాదు కదా తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ పేరు చెరిపేయడం సాధ్యం కాదని ఆయనే కుండబద్దలు కొడుతున్నారు.
తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ పేరు ఉంటుంది. తెలంగాణాను లేకుండా చేస్తేనే కేసీఆర్ పేరు చెరిపేయడం సాధ్యమవుతుంది. తెలంగాణను లేకుండా చేయడం, విభజిత ఆంధ్రప్రదేశ్ తో కలిపేసి మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం ఇప్పటికీ కొందరి ఎజెండా. అది ఆచరణ సాధ్యం కాకపోవచ్చు.. అందుకే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేయాలని కాంక్షించే రాజకీయ శక్తులకు తెలంగాణాలో ఊపిరి పోయాలనేది రేవంత్ రెడ్డి సంకల్పంగా కనిపిస్తున్నది. ఆ రాజకీయ శక్తులు ఇక్కడ ఊపిరిపోసుకుంటే.. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఉనికిలో ఉన్న స్వరాష్ట్ర అస్తిత్వం దెబ్బతీయడం పెద్ద కష్టకాదు. రేవంత్ కు ఔట్ సోర్సింగ్ స్క్రిప్ట్/స్క్రీన్ ప్లే రైటర్ కోరుకుంటున్నది ఇదే. రేవంత్ రెడ్డి తెలంగాణ పాలకుడిగా చేస్తున్నది ఇదే. దక్షిణాదిలో బెంగళూరు తర్వాత అత్యధిక ఆదాయం సమకూరుతున్నది హైదరాబాద్ నుంచే. అందుకే హైదరాబాద్ ను దెబ్బతీసే కుట్రల స్క్రీన్ ప్లే ఔట్ సోర్సింగ్ రైటర్ రచించగా.. తెలంగాణ పాలకుడు తన గేమ్ ప్లాన్ ద్వారా దానిని రక్తికట్టించి ప్రజల ఆర్థనాథాలు చూసి వికటాట్టహాసం చేస్తున్నారు. ఒక్క ప్రజావేదికను కూల్చేస్తేనే జగన్ మోహన రెడ్డిని విధ్వంస పాలకుడిగా ప్రచారం చేశారు. ప్రజలు తమ రక్తమాంసాలు దారపోసి పైసా పైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇండ్లను కూల్చేస్తున్న రేవంత్ రెడ్డిని విధ్వంస పాలకుడు కాక ప్రగతి నిర్మాతగా చెప్పలేం కాదా? తెలంగాణను, హైదరాబాద్ ను శిథిలం చేసి కేసీఆర్ పేరు చెరిపేయాలని చూసే ప్రయత్నాలు తాత్కాలికంగా కూడా ఫలవంతం కాలేదు. సరిహద్దుల అవతలి స్క్రీన్ ప్లే రైటర్ ప్రయత్నాలు, రేవంత్ గేమ్ ప్లానూ సక్సెస్ కాలేదు. దశాబ్దాల వలస పాలకుల కుట్రలనే తట్టుకొని నిలబడ్డ పోరాటాల పురిటిగడ్డకు ఈ కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కోవడం.. ఎదురొడ్డి నిలిచి పోరాడటం పెద్ద విషయమేమి కాదు. రేవంత్ కు ఈ నిజాలన్నీ తెలుసు.. ఇప్పటికే పార్టీలో ఒంటరిగా మారుతున్న తాను త్వరలో ప్రభుత్వంలోనూ ఒంటరిని కావడం ఖాయమని తెలుసుకొనే ఈ పెద్ద పెద్ద డైలాగులు!!!