సర్కారు చెప్పిందా.. వాళ్లే పట్టించుకుంటలేరా? సీఎంవోలో ఏం జరుగుతోంది
ముగ్గురు ఉన్నతాధికారుల దగ్గర పేరుకుపోతున్న ఫైళ్లు.. ఆందోళనలో ఆయా శాఖల అధికారులు
తెలంగాణ సీఎంవో.. రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైనది. ప్రభుత్వ శాఖల నుంచి ప్రజలకందించాల్సిన సేవలతో పాటు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన కీలక దస్త్రాలన్నీ అక్కడ క్లియర్ కావాల్సిందే.. సీఎంవో క్లియరెన్స్ లేకుండా ఏ పని ముందుకు కదలదు. అలాంటిది తెలంగాణ సీఎంవోలో నెలల తరబడి ఫైళ్లన్నీ పెండింగ్ లో ఉంటున్నాయి. ముఖ్యంగా ముగ్గురు అధికారుల దగ్గర ఫైళ్లు అసలే కదలడం లేదు. ఆయా శాఖలకు సంబంధించిన ఫైళ్లను అంత అర్జంట్‌గా చూడాల్సిన పనిలేదని ప్రభుత్వ పెద్దనే ఆదేశించారా లేక ఆయా శాఖలను చూస్తున్న అధికారులే పట్టించుకోవడం లేదా అనే చర్చ సెక్రటేరియట్ లో పెద్ద ఎత్తున జరుగుతోంది. అసలు సీఎంవోలో ఏం జరుగుతోంది.. ఎందుకింత గందరగోళమని ఆయా ప్రభుత్వ శాఖల్లోని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రి పని చేస్తున్నారు. మరో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి, సెక్రటరీగా మానిక్ రాజ్, జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ పని చేస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి, మానిక్ రాజ్, సంగీత సత్యనారాయణల దగ్గర ఫైళ్లు నెలల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయని ఆయా శాఖల మంత్రులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రశేఖర్ రెడ్డి సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీగా పంచాయతీరాజ్, ఫారెస్ట్ శాఖల వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. మానిక్ రాజ్ దగ్గర ఇరిగేషన్, మెడికల్ అండ్ హెల్త్, సంగీత సత్యనారాయణ దగ్గర ఎస్సీ డెవలప్‌మెంట్, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు ఉన్నాయి. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పది నెలలుగా ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయని సెక్రటేరియట్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఇక పంచాయతీరాజ్ శాఖలో సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పని చేస్తున్న ఒక అధికారి హవా కొనసాగుతుందని చెప్తున్నారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఒక్క ఫైల్ కూడా సీఎంవో నుంచి క్లియర్ అయి తిరిగి డిపార్ట్‌మెంట్ కు రాలేదని ఇటీవల ఆ శాఖ ఉన్నతాధికారులు మంత్రి సీతక్క దగ్గర మొర పెట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఇతర వ్యక్తులు సంబంధిత శాఖలతో పాటు సీఎంవో చుట్టూ నెలల తరబడి ప్రదక్షిణలు చేస్తున్నా ఒక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేదు. రెవెన్యూ, ఫైనాన్స్, హోం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్లలోనూ ఫైళ్లు రోజుల తరబడి క్లియర్ కావడం లేదు. దీంతో ఆయా శాఖల హెచ్‌వోడీలు, కింది స్థాయి అధికారులు ఏ పని చేద్దామన్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ షానవాజ్ ఖాసీం, స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న శాఖల పరిధిలో సమస్యలు లేవని.. మిగతా ముగ్గురి దగ్గరే దీర్ఘకాలం ఫైళ్లు పెండింగ్ లో ఉంటున్నాయని ఆయా శాఖల అధికారులు చెప్తున్నారు.
''మాది ప్రజాపాలన అని గొప్పగా చెప్పుకుంటున్నాం.. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో సంబరాలు చేస్తున్నాం.. ఏడాదిలో ఏం చేశారని ఎవరైనా అడిగితే చెప్దామన్నా ఒక్క పని లేదు. ఇన్ని రోజులంటే కేసీఆర్ అప్పులు చేసి పోయిండు.. పనులు చేసేందుకు పైసలు లేవని బుకాయించినం.. ఇంకా ఎక్కువ రోజులు అట్లా చెప్తే ఓట్లు ఎందుకు అడిగారని ప్రజలు తిరగబడే పరిస్థితి ఉన్నది.. నియోజకవర్గానికి సంబంధించిన పనుల కోసం ముఖ్యమంత్రి దగ్గరికి పోతే తప్పకుండా చేద్దామని పీఏకు, ఓఎస్డీలకు చెప్తున్నడు.. ఆఫీస్ కు పోతే ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు.. నెలల తరబడి ఫైళ్లు పెండింగ్‌లో పెడితే ఏం లాభం.. దగ్గరోళ్లకు, పార్టీ లీడర్లకు సంబంధించిన పనులు కూడా చేయలేకున్నప్పుడు ఎమ్మెల్యే పదవిలో ఉండటం ఎందుకు?'' అని ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే తన సన్నిహితుల దగ్గర వాపోయాడు. సీఎంవో చుట్టూ ఫైళ్ల క్లియరెన్స్‌ల కోసం తిరగడం తప్ప సాధించిందేమి లేదని ఆయన బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే సైతం కొన్ని రోజుల క్రితం సెక్రటేరియట్ లో ఇదే తరహాలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలం పోయి పనులు అడిగినా కొందరు ఆఫీసర్లు పట్టించుకోవట్లేదని కొందరు ఎమ్మెల్యేలు తమ జిల్లా మంత్రి దగ్గర కొన్ని రోజుల క్రితం చెప్పుకొని వాపోయారు. సెక్రటేరియట్ లో ఫైళ్ల క్లియరెన్స్ తో పాటు పాలనలో లోపాలను సవరించుకోకుంటే పదవిలో ఉండి కూడా ప్రజలకు ఏమి చేయలేమనే ఆందోళన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో నెలకొన్నది. ఈ పరిస్థితిని సరిదిద్దాలని తాము కోరడమే కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని ఎమ్మెల్యేలే చెప్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు సన్నిహితంగా ఉండే మీడియా ప్రతినిధుల దగ్గర అధికారుల తీరుపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు కూడా.