అస్తిత్వ చిహ్నమా? ఆనవాళ్లు చెరిపేసే ప్రయత్నమా?

తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కాంగ్రెస్‌ చర్యలపై సర్వత్రా విమర్శలు

Advertisement
Update:2024-12-10 16:05 IST

తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే వారేదో ఉద్యమకారుడిగా తనకు తానే సర్టిఫికెట్‌ ఇచ్చుకున్నట్లు కనిపించింది. ఎందుకంటే డిసెంబర్‌ 9 తెలంగాణకు పర్వదినం అన్నారు. 2009లో అదే రోజు ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చిందని గుర్తుచేశారు. ఆ ప్రకటన రావడానికి కారణం ఎవరు? నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 9 వరకు రేవంత్‌ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు? ఆయన పాత్ర ఏమిటి అన్నది చరిత్రలో ఉన్నది.సీఎం అయ్యాక కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు హామీలకు తిలోదకాలిచ్చిన సీఎం రోజుకో ప్రకటన, పూటకో వివాదాన్ని తెరమీదికి తెస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.

డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని నాటి కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు ముందు పార్లమెంటులో జరిగిన చర్చలు రేవంత్‌ మరోసారి చూడాలి. తెలంగాణకు మద్దతుగా 36 పార్టీల మద్దతు కాంగ్రెస్‌ పార్టీ సంప్రదింపుల ద్వారా కూడగట్టలేదు. కనీసం ఆపార్టీ అభిప్రాయాన్ని కూడా స్పష్టం చెప్పలేకపోయింది. అందుకే పార్లమెంటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత ముఖ్యమో? ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్‌ ప్రాణాలు అంతకంటే ముఖ్యమని విపక్ష నేతలు వ్యాఖ్యానించారు. కొత్తగా మతం పుచ్చుకున్న వాళ్లకు నామాలు ఎక్కువ అన్నట్లు రేవంత్‌రెడ్డి తానేదో తెలంగాణ ఉద్యమకారుడిని అయినట్లు, అసలు ఉద్యమానికి ఆయనే నాయకత్వం వహించినట్లు చెప్పుకుంటున్న తీరే హాస్యాస్పందంగా ఉన్నది. ఎందుకంటే డిసెంబర్‌ 9 తెలంగాణపై ప్రకటన వచ్చిన తర్వాత డిసెంబర్‌ 10న ప్రపంచ మానవహక్కుల దినోత్సవం రోజున ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో రేవంత్‌ రెడ్డి పార్టీ అధినేత మాట్లాడిన మాటలు అందరికీ గుర్తున్నాయి. ఎవరిని అడిగి ప్రకటన చేశారు? అంతా మీ ఇష్టం అనుకుంటున్నారా? అన్నట్లు నాడు చంద్రబాబు మాట్లాడారు. అప్పుడు రేవంత్‌ చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారా? చంద్రబాబు చెప్పే రెండు కండ్ల సిద్ధాంతంలో తెలంగాణ లేదని తన పదవికి రాజీనామా చేశారా? అన్నది చెప్పాలి.

సీఎం ఇంకో మాట కూడా అన్నారు. తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు.. నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం అన్నారు. తెలంగాణ అన్నివర్గాల ప్రజలు భావోద్వేగంతో ఉద్యమం చేసిన నాడు వారిపై రైఫిల్‌ ఎక్కుపెట్టింది ఎవరో తెలియంది కాదు. ఇప్పుడు సోనియా గాంధీ గురించి గొప్పగా చెబుతున్న ఆయన గతంలో ఆమెపై ఏ వ్యాఖ్యలు చేశారో తెలిసిందే. కానీ రేవంత్‌ రెడ్డి లెక్క కేసీఆర్‌ది సంకుచిత మనస్తత్వం కాదు. అసెంబ్లీ నిండు సభలో సోనియా గాంధీ సంకల్పం లేకుంటే తెలంగాణ సాధ్యమయ్యేది కాదని అన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాత్రం పొద్దున లేస్తే కేసీఆర్‌ ఆనవాళ్లను చెరిపేసే బాధ్యత తాను తీసుకుంటానన్నది నిజం కాదా? తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే చర్యలు ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటిరోజు నుంచే మొదలుపెట్టారు. తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చే ప్రయత్నం చేశారు. ప్రజల నుంచి నిరసన వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నామని సీఎం అన్నారు. సంతోషం. ఈ అంశంపై అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఒక కామెంట్‌ చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకుంటే బాగుండేది అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి బతుకమ్మ ఉంటే బాగుండేది అన్నారు. అంతేకాదు ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాలు మార్చుకుంటు పోతున్నారు అని వ్యాఖ్యానించారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్‌ సర్కార్‌ ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ముందుకెళ్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?

ఇప్పటివరకు రేవంత్‌ ప్రభుత్వం తీసుకున్న ఏ చర్యలకు ప్రజామోదం ఏమీ లేదు. అందుకే హామీలన్నీ అసంపూర్ణంగా అమలు చేసి చేతులు దులుపుకున్నారు. నిత్యం అప్పులు, వడ్డీలు అంటూ సీఎం సహా మంత్రులంతా కొన్నిరోజులుగా కొత్త పల్లవి అందుకుంటున్నారు. ఉద్యమంలో కీలక భూమిక పోషించి, ప్రజల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వ అనాలోచిత చర్యలను సమర్థిస్తూ వాళ్లను వాళ్లే తక్కువ చేసుకుంటున్నారు. ఫైనల్‌గా ఒక్కటి మాత్రం వాస్తవం. ఉద్యమకాలం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం ప్రజల మనసుల్లో నిక్షిప్తమై ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూపం మార్చినంత మాత్రానా అదేమీ మారిపోదు. కాంగ్రెస్‌ పాలన అంటే వివాదాలు, విధ్వంసాలు, విభజన రాజకీయాలు అన్నది మరోసారి రుజువైంది.

Tags:    
Advertisement

Similar News