గురుకుల సెక్రటరీ.. పొలిటికల్‌ స్టేట్‌మెంట్లు

ప్రతిపక్షాల ఆందోళనలపై రాజకీయ విమర్శలు

Advertisement
Update:2024-12-06 18:44 IST

తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి పొలిటికల్‌ లీడర్‌ అవతారమెత్తారు. గురుకులాలను సమర్థంగా నడిపించాల్సిన ఆఫీసర్‌ ప్రతిపక్షాల ఆందోళనలపై రాజకీయ విమర్శలు చేశారు. గురుకులాల్లో విద్యార్థుల మరణాలను నివారించలేక నేషనల్‌ ఎస్సీ కమిషన్‌కు సరైన సమాధానం చెప్పుకోలేక తప్పును విద్యార్థుల తల్లిదండ్రులపైకే నెట్టేసే ప్రయత్నానికి తెరతీశారు. ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలకు నిల్వ పచ్చళ్లే కారణమని.. విద్యార్థుల తల్లిదండ్రులు తెస్తున్న పచ్చళ్లను విద్యార్థులు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతున్నారని వాటి వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని సూత్రీకరించారు. గురుకులాల్లో విద్యార్థుల మరణాలతో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. గురుకులాల్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి బీఆర్‌ఎస్‌ గురుకుల బాట చేపట్టింది. గురుకులాల మాజీ సెక్రటరీ, బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్ కుమార్‌ నేతృత్వంలో గురుకులాల్లో వాస్తవ పరిస్థితులపై స్టడీ చేస్తోంది. బీఆర్‌ఎస్‌ చేస్తున్న ఈ ప్రయత్నాలను కాంగ్రెస్‌ నాయకులు రాజకీయంగా తిప్పికొట్టారంటే.. విమర్శలు, ప్రతి విమర్శలు సహజం అనుకోవచ్చు. కానీ గురుకులాల సెక్రటరీగా పని చేస్తున్న ఐఏఎస్‌ అధికారి పొలిటికల్‌ లీడర్‌లను తలపించేలా స్టేట్‌మెంట్లు ఇవ్వడం, విమర్శలు చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అడ్మినిస్ట్రేషన్‌లో లోటుపాట్లను సరిదిద్దలేకనే ఆమె ఇలా మాట్లాడారని అనిపిస్తోందని గురుకుల విద్యాసంస్థల్లో పని చేస్తున్న వారే చెప్తున్నారు.

శుక్రవారం మాసబ్‌ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి మాట్లాడుతూ, ''ప్రతిపక్షాల ఆందోళనలు చూసి నాకు సిగ్గుగా వుంది.. ప్రతిపక్షాల విమర్శలు ఎక్కువయ్యాయి, సలహాలు ఇవ్వాలి కానీ విమర్శలు చేయవద్దు.. ఏమైన చెప్పాలకుంటే అసెంబ్లీలో లేదంటే సీఎస్‌, అధికారుల వద్దకు వచ్చి చెప్పండి.. అమ్మాయిలు ఉన్న చోటకు వెళ్లి అల్లర్లు చేయవద్దు.. గురుకుల పాఠశాలల వద్ద ఆందోళనలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతాం.. పార్టీల నేతలు అలోచించి ఆందోళనలు చేయాలి.. స్కూల్స్ నడపడమంటే ఆషామాషీకాదు.. గత ప్రభుత్వంలో పనిచేసిన టీచర్లే ఇప్పుడూ పనిచేస్తున్నారు.. రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ను రాజకీయాలకు వాడుకోవద్దని హెచ్చరిస్తున్నా.. సీఎం గారే గురుకుల పాఠశాలలకు చైర్మన్‌గా ఉన్నారు.. ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణలతో రెసిడెన్షల్ టీచర్లు, స్టాఫ్ పని చేయడానికే భయపడుతున్నారు..'' అన్నారు. తాను తమిళనాడుకు వెళ్లినప్పుడు గురుకులాల గురించి గొప్పగా చెప్పానని.. ఇప్పుడు చెప్పలేకపోతున్నానని అన్నారు.

గురుకుల పాఠశాలల్లో చదివే పిల్లలు తమ పిల్లలే అని గురుకులాల స్టాఫ్ భావించి పనిచేస్తారని తెలిపారు. ఎక్కడైనా రోడ్‌ యాక్సిడెంట్‌ జరిగితేనే ఫీల్‌ అవుతామని.. అలాంటిది ఒక అమ్మాయి చనిపోతే తాము బాధపడమా అన్నారు. ప్రతిపక్షాలు రాజకీయాల కోసం తమను ఫుట్ బాల్ గా వాడొద్దని సలహా ఇచ్చారు. గురుకులాల్లో రెండు చోట్ల ఫుడ్ వికటించిందని, కూరగాయలు తరలించడానికి కంటేనర్లు కొనుగోలు చేయాలని చెప్పామన్నారు. శుభ్రమైన ప్రదేశాల్లో వంట చేయాలని, కుక్‌ యూనిఫామ్‌, గ్లౌస్‌, క్యాప్‌ పెట్టుకోవాలని గట్టిగా హెచ్చరిస్తున్నామని చెప్పారు. అలాగే పేరెంట్స్‌ తెచ్చే నిలువ పచ్చళ్లను అనుమతించొద్దని కూడా ఆదేశిస్తున్నామని అన్నారు. గురుకులాల్లో అడ్మిషన్లకు ఈనెల 18న నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముందన్నారు. జూన్‌ 12న పిల్లలకు స్కూల్‌ బ్యాగ్స్‌, బుక్స్‌, డ్రెస్‌లు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News