కాంగ్రెస్ కు ప్రాంతీయశక్తులు దూరం

మమతకు ఇండియా కూటమిలో పెరుగుతున్న మద్దతు

Advertisement
Update:2024-12-11 15:47 IST

దేశానికి దశాబ్దాల పాటు నాయకత్వం వహించిన కాంగ్రెస్‌ పార్టీ నేడు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఆపార్టీ అనుసరిస్తున్న పార్టీ విధానాలే. ఒక జాతీయ పార్టీగా ఆపార్టీకి వివిధ అంశాలపై వాళ్ల పార్టీలోనే ద్వంద్వ విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా అదానీ వ్యవహారం పార్లమెంటు శీతాకాల సమావేశాలను కుదిపేస్తున్నది. అదానీ అంశంపై చర్చకు పట్టుబడుతున్న ఇండియా కూటమి నిరసనలతో పార్లమెంటు వారం రోజులుగా వాయిదా పడుతున్నది. అయితే జాతీయస్థాయిలో ఆపార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అదానీ-మోడీ బంధంపై రోజుకో నిరసన తెలుపుతుంటే ఆపార్టీ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో మాత్రం అదానీతో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నారు. ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడం అనేకంటే బీజేపీని ఢీ కొట్టడమే అంటే కరెక్టుగా ఉంటుంది. ఎందుకంటే 2014, 2019లో ఆ పార్టీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మెజారిటీ మార్క్‌ దాటింది. తాజా ఎన్నికల్లో ఆపార్టీ 230 సీట్లకు పరిమితమైంది అంటే వివిధ రాష్ట్రాల్లో ఆశించిన సీట్లు తగ్గడానికి కారణం ఆయా రాష్ట్రాల్లో (యూపీ, మహారాష్ట్ర) వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలు నిలువరించాయి. అందుకే మోడీ3.0 సర్కార్‌ సర్కార్‌ ను నిలబెట్టింది ప్రాంతీయపార్టీలే.

కానీ కాంగ్రెస్‌ పార్టీ బీజేపీతో నేరుగా తలపడే రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోతుండటం వల్ల ఆ పార్టీ దారుణంగా బలహీనపడటమే కాదు, ఆపార్టీతో కలిసి వెళ్లిన పార్టీలు దెబ్బతింటున్నాయి. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం సరిగ్గా వ్యవహరించి ఉంటే మహారాష్ట్ర ఫలితాలు వేరేలా ఉండేవి. కానీ అక్కడ ఓడిపోవడమే కాకుండా మహారాష్ట్రలోనూ హస్తం పార్టీ చేతులెత్తేసింది. దీంతో వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతబలంతోనే పోటీ చేయాలని ఇండియా కూటమిలోని ఆప్‌ డిసైడ్‌ అయ్యింది. ఆ పార్టీ కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలోని మరికొన్ని పార్టీలతో కలిసి పోటీ చేయబోతున్నదనే వార్తలకు కేజ్రీవాల్‌ చెక్‌ పెట్టారు. ఒకప్పుడు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోటీ చేయడానికి ఇప్పుడు ఆప్‌ మాత్రమే కాదు చాలా పార్టీలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 2008లో 43 స్థానాలతో అధికారంలో ఉన్న ఆపార్టీ 2013 ఎన్నికలు వచ్చే నాటికి 8 సీట్లకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ (32 సీట్లు) అధికారం చేపట్టకుండా అడ్డుకోవడానికి 28 స్థానాలు గెలుచుకున్న ఆప్‌ మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆప్‌ ప్రభుత్వానికి ఉప సంహరించుకోవడంతో 2015లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఆప్‌ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ ధాటికి రెండు జాతీయపార్టీలు బీజేపీ (3), కాంగ్రెస్‌ (0) కొట్టుకుపోయాయి.

ఇట్లా పదిహేనేళ్ల కాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ హస్తినలో తన ప్రాభవాన్ని మొత్తం కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి 15 సీట్లు ఇవ్వనున్నదని జరిగిన ప్రచారాన్ని కేజ్రీవాల్‌ కొట్టిపారేశారు. కేజ్రీవాల్‌ ఢిల్లీ సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఆయన పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. ఉత్తరాఖండ్‌, గోవా, గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో తదితర రాష్ట్రాల్లో పోటీ చేసి ఓటు బ్యాంకును పెంచుకున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన పార్టీ ఇతర రాష్ట్రాలకు విస్తరించి, పంజాబ్‌లో పాగా వేయడానికి కారణం ఢిల్లీ. అందుకే ఇక్కడే అధికారం కోల్పోతే తన రాజకీయ ఉనికే ప్రశ్నార్థకమౌతుందని కేజ్రీవాల్‌కు తెలుసు. అదీ కాంగ్రెస్‌తో కలిసి వెళ్తే అదనంగా ఒనగూరే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా గ్రహించారు. అందుకే ఒంటరిగానే బరిలోకి దిగాలని డిసైడ్‌ అయ్యారు. ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ స్వయంకృతం. ఆ పార్టీ బీజేపీతో నేరుగా కొట్లాడాల్సిన రాష్ట్రాల్లో వెన్నుచూపి ప్రాంతీయపార్టీలు బలంగా ఉన్నచోట సీట్ల సర్దుబాటు పట్టువిడుపులతో వ్యవహరించకుండా సంక్షోభానికి కారణమౌతున్నది. ఇదే హర్యానాలో ఆపార్టీ ఓటమికి కారణం. అక్కడ కాంగ్రెస్‌ బలంగా ఉన్నది. ఇండియా కూటమిలోని పార్టీలతో ఐదారు స్థానాల్లో సర్దుబాటు చేసుకుని ఉంటే ఫలితం ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు నిజమయ్యేవి. కానీ వ్యక్తులను నమ్ముకుని సొంత పార్టీని, సీట్ల సర్దుబాటులో జాప్యంతో భాగస్వామ్య పార్టీలను ముంచుతున్నదని హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి.

ఈ నేపథ్యంలోనే విపక్ష ఇండియా కూటమిలో నాయకత్వ మార్పుపై చర్చకు దారితీసింది. మొన్న పార్లమెంటు ఎన్నికల్లో బెంగాల్‌లో సొంతంగా పోటీ చేసి సత్తా చాటిన మమతా బెనర్జీ సారథ్యానికి కాంగ్రెసేతర నేతల మద్దతు పెరుగుతున్నది. దీనికి కారణం బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీజేపీని ఢీ కొట్టి గెలిచింది. లోక్‌సభలోనూ అక్కడ బీజేపీని నిలువరించింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీఎంసీ హవా కొనసాగింది. ఈ క్రమంలోనే మమతా నాయకత్వానికి సమాజ్‌వాదీ , ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ) నేతలు ఆమెకు మద్దతుగా గళం విప్పుతున్నారు. వీళ్లందరి మద్దతు కంటే కాంగ్రెస్‌కు గట్టి మద్దతుదారుగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ ఈ జాబితాలో చేరారు. ఇండియా కూటమిని మమత నడపగలదు. ఆమెక నాయకత్వం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో బెంగాల్‌కు వెలుపల గోవా, త్రిపుర, మేఘాలయ, అసోం, నాగాలాండ్‌, అరుణాచల్‌ వంటి రాష్ట్రాల్లో టీఎంసీ ప్రభావం లేదన్న కాంగ్రెస్‌ అభ్యంతరాలను ఆయన తోసిపుచ్చారు. దీనికి కారణం లేకపోలేదు. మొన్న లోక్‌సభ ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు విషయంలో మమతా ఒక ప్రతిపాదన చేశారు. బెంగాల్‌, బీహార్‌, యూపీ, ఢిల్లీ, పంజాబ్‌లను ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలకు వదిలేసి మిగిలిన చోట్ల కాంగ్రెస్‌ పోటీ చేయాలని మమతా ప్రతిపాదించారు. దీనికి కాంగ్రెస్‌ అధిష్టానం అంగీకరించకపోవడంతో ఆమె సొంతంగా పోటీ చేశారు. వీటిలో యూపీలో ఎస్పీ, బెంగాల్‌లో టీఎంసీ బీజేపీ సీట్లను గణనీయంగా తగ్గించాయి. ఈ క్రమంలోనే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా విఫలమవడంతో నాయకత్వ మార్పుపై ఇండియా కూటమి భాగస్వాముల దృష్టి మళ్లడానికి కారణం.

Tags:    
Advertisement

Similar News