ఏడాది పాలనకు పాస్‌ మార్కులూ వేయని ప్రజలు

సీఎం రేవంత్‌ ఏడాది పాలనలో తెలంగాణ తిరోగమనమే

Advertisement
Update:2024-12-07 13:48 IST

ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తున్నది. నేటితో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నది. ఏడాదిలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొన్నది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కాకపోగా నిత్య నిర్బంధాలు, అక్రమ కేసులు, అరెస్టులు, ఆందోళనకారులపై అణిచివేతలు గత ఆరు నెలలుగా తెలంగాణ ప్రజల అనుభవంలో ఉన్నాయి. మార్పు రావాలి...కాంగ్రెస్‌ రావాలన్న నినాదాన్ని నమ్మి ఓట్లు వేసిన జనాలకు కాంగ్రెస్‌ మార్క్‌ పాలనను రేవంత్‌ ప్రభుత్వం చూపెడుతున్నది.

2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నాటి నుంచి పాలన సాగించిన బీఆర్ఎస్‌ ఏడాదిలోనే ఉద్యమకాలపు ఉద్వేగాల ఆధారంగా చాలామందిలో ఉన్న అనేక అనుమానాలను పటాపంచలు చేసింది. కరెంటు కష్టాలను తొలిగించింది. గతానికి వర్తమానానికి తేడా ఏమిటో స్పష్టంగా తన పాలనా విధానాల ద్వారా చూపెట్టింది. దీనికంతటికీ కారణం కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజలకు ఏం చేయాలన్నదానిపై ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. ప్రాధాన్య అంశాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయడానికి యత్నించారు. ప్రజల అంచనాలను వందశాతం అందుకోకున్నా అన్నివర్గాల వాళ్లకు స్వయంపాలన అంటే ఎలా ఉంటుందో? మన నిధులు, నీళ్లు ఎలా మనం సమర్థవంతంగా వినియోగించుకోవచ్చో చూపెట్టారు.

కానీ రేవంత్‌ సర్కార్‌ ఏం చెప్పింది. కేసీఆర్‌ ప్రభుత్వం అప్పులు చేసిందని ఆరోపించింది. నియమాకాలు చేపట్టలేదని విమర్శించింది. రైతుల మద్దతు ధర ఇవ్వలేదని, రుణమాఫీ ఏక కాలంలో చేయలేదని చెప్పింది. కాంగ్రెస్‌ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని అడిగింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన తర్వాత కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను విశ్వసించి మార్పునకు జై కొట్టారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ప్రతి పంటకు మద్దతు ధరతో పాటు బోనస్‌ ఇస్తామన్నారు. మహిళలకు రూ. 2,500 అకౌంట్లలో వేస్తామన్నారు. ఇట్లా 420 హామీలు ఇచ్చారు. హామీల అమలును ఎన్నికల పేరుతో, మంత్రుల సబ్‌ కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ ఏడాది పూర్తి చేసింది. మొన్నటికి మొన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పోయిన ముఖ్యమంత్రి తెలంగాణలో పథకాల గురించి, ఆరు గ్యారెంటీల గురించి అక్కడి ఓటర్లకు చెప్పారు. ఆరు గ్యారెంటీలు అమలయ్యాయని, ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రెండు లక్షల రుణమాఫీ చేశామని గప్పాలు కొట్టారు. కానీ అక్కడి ప్రజలు విశ్వసించలేదు. మొన్న ప్రెస్‌మీట్‌లో రేవంత్‌రెడ్డి హామీల గురించి మాట్లాడుతూ పెళ్లి కాగానే పిల్లలు పుడుతారా.... అని కొత్త రాగం మొదలుపెట్టారు. ఏడాది కాలంగా గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి, కాంగ్రెస్‌ ప్రభుత్వం కడుతున్న వడ్డీల గురించే నిత్యం ప్రస్తావిస్తున్నారు. మరి అప్పుల్లో రాష్ట్రంలో మీరు ఏం సాధించారని సంబురాలు చేస్తున్నారు? అంటే సమాధానం లేదు. ఆరు గ్యారెంటీల గురించి అడిగితే అప్పుడేనా? అంటారు. అందరికీ రుణమాఫీ చేసి తీరుతామంటారు. రైతు భరోసా ఇస్తామంటారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామంటారు. అందులో నిబంధనలు చూస్తే అవి ఎవరికి వస్తాయో? ఎవరికి రావో రానున్నరోజుల్లో తేలుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా రూ. 500 గ్యాస్‌ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ లెక్కనే ఉంటందని జనాలు అప్పుడే చెప్పుకుంటున్నారు.

ఏడాది తర్వాత తమ ప్రభుతం ఏం చేసిందో నేరుగా చెప్పరు. పత్రికల ప్రకటనల్లో, హోర్డింగ్స్ లో మాత్రం పెద్ద పెద్ద అక్షరాలు, అంకెలు వేస్తారు. అవన్నీ రేవంత్‌ మాటలు కోటలు దాటుతాయి అన్నట్టే ఉంటాయి. అందుకే ఏడాది పాలనలో రేవంత్‌ ఏం సాధించారు అని జనాలను అడిగితే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీశారని, తన వ్యక్తిగత ప్రచారం కోసం ఆరాటపడుతున్నారని, పాలనలో కుటుంబం జోక్యం పెరిగిపోయిందని, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు హామీలపై ప్రజలకు ఏం చెప్పాలో తెలియక ముఖం చాటేస్తున్నారని, ప్రజాపాలనలో దరఖాస్తులు పరిష్కారం కావడం లేదని, నిరుద్యోగులు నోటిఫికేషన్లు రావడం లేదని, రైతులు రైతుబంధు రావడం లేదనే కుండబద్దలు కొడుతున్నారు. చివరికి ఏడాదిలోనే ప్రజలు ఏ నిర్ణయానికి రేవంత్‌ కంటే కేసీఆర్‌ పాలనే బాగుండేదంటున్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్‌ కొత్తగా తెచ్చిన మార్పేమీ లేదు. కేవలం కేసీఆర్‌ ఆనవాళ్లను చెరిపేయాలనే అక్కసుతో నంబర్‌ ప్లేట్స్‌, గత ప్రభుత్వం పెట్టిన పేర్ల మార్పు, తెలంగాణ తల్లి రూపం మార్పు తప్పా ఇంతకుమించి చేసిందేమీ లేదంటున్నారు. అందుకే పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేయలేని పనులను తాము పది నెలల్లోనే చేశామని ప్రచారం చేసుకుంటున్నా... ప్రజలు మాత్రం రేవంత్‌కు పాస్‌ మార్కులు కూడా ఇవ్వేలేదు. కాంగ్రెస్‌ ఏడాది పాలన ఉత్సవాల్లో ప్రచారం తెలంగాణ రైజింగ్‌ 2004 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నినదించిన భారత్‌ వెలిగిపోతున్నది లెక్కనే ఉన్నదంటున్నారు. ఆ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఏమిటో? భవిష్యత్తులో తెలంగాణలో ఎన్నికలు జరిగితే ప్రజలు ఏం చేయబోతున్నారో? ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Tags:    
Advertisement

Similar News