హర్యానా, జమ్ముకశ్మీర్‌ జడ్జిమెంట్‌ డే రేపే

రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి

Advertisement
Update:2024-10-07 20:31 IST

జమ్ముకశ్మీర్‌, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రేపు ఫలితాలు వెల్లడికానున్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 46 స్థానాల్లో విజయం సాధించాలి. ఈ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనేది ఇప్పటికే ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. హర్యానా హస్తానిదే అని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చి చెప్పగా... జమ్ములో మాత్రం హంగ్ అసెంబ్లీకి అవకాశం ఉన్నట్లు అంచనా వేశాయి.

హర్యానా హస్తానిదే!

ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసారి ప్రాధాన్యం ఉన్నది. కేంద్రంలో మోడీ 3.0 కొలువుదీరిన తర్వాత జరిగిన ఎన్నికలు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా గెలుపొందుతామని ప్రచారం చేసిన కమలనాథులకు ఓటర్లు షాక్‌ ఇచ్చారు. కనీసం బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. దీంతో మోడీ హవా మెల్లగా మసబారుతున్నదని విపక్షాలతో పాటు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మోడీ హవాలోనే 2014లోమొదటిసారి 47 సీట్లు గెలుచుకుని హర్యానాలో అధికారంలోకి వచ్చింది. జాట్‌ల ప్రభావం ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రంలో మొదటిసారి జాట్‌ యేతర పంజాబ్‌కు చెందిన మనోహర్ లాల్ ఖట్టర్ ను సీఎం చేసింది. గత ఎన్నికల్లో మాత్రం పూర్తి మెజారిటీ రాకపోతే (జననాయక్ జనతా పార్టీ) జేజేపీ మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సంకీర్ణ ప్రభుత్వంలో జేజేపీతో విభేదాల నేపథ్యంలో ఖట్టర్‌ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ఓబీసీ నేత అయిన నయాబ్ సింగ్ సైనీని సీఎం చేసింది. ఖట్టర్‌కు ఈయన అత్యంత సన్నిహితుడు . హర్యానా ఓబీసీల్లో సైనీల జనాభా సుమారు 8 శాతం ఉంటుంది. కురుక్షేత్ర, హిస్సార్‌, అంబాల, రేవాడీ జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అయితే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్ఠానం చేసిన వ్యూహం బెడిసి కొట్టింది. అక్కడ గత ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్ చేసిన బీజేపీ ఈసారి సగం స్థానాలు కోల్పోయింది. ఈసారి జేజేపీ ఒంటరిగా పోటీ చేయడం, జాట్‌ ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మళ్లడం, కేంద్ర తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాది పాటు చేసిన ఉద్యమంలో హర్యానా రైతులు కీలకపాత్ర పోషించడం, రెజర్లు కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు వంటి అంశాలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపెట్టనున్నాయి. అందుకే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కమలనాథుల కల నెరవేరదని ఎగ్జిట్‌పోల్స్‌ ఇప్పటికే తేల్చాయి. రేపు ఓటర్లు ఇచ్చిన తీర్పు దాన్నే నిజం చేస్తుందా లేదా అన్నది చూడాలి.

జమ్ముకశ్మీర్‌లో హంగా? ఇండియా కూటమా?

సుమారు పదేళ్ల తర్వాత జరిగిన జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాదని సర్వే సంస్థలు అంచనా వేశాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పాయి. బీజేపీకి కనిష్ఠంగా 20 గరిష్ఠంగా 32 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. మొహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ సింగిల్‌ డిజిట్‌కు మాత్రమే పరిమితమౌతుందని సర్వేసంస్థలు అంచనా వేశాయి. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలిగించిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. దీంతో బీజేపీ-పీడీపీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈసారి ఈ రెండు పార్టీలు విడిగా పోటీ చేయగా.. ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌, ఎన్సీ పొత్తుతో బరిలోకి దిగాయి.

అయితే ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా ప్రకారం ఏ పార్టీకి మెజారిటీ రాకపోవచ్చన్న నేపథ్యంలో ఫలితాలకు ముందురోజు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకున్నా పీడీపీ మద్దతు ఇస్తానంటే తాము అంగీకరిస్తామని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటునకు అవసరం లేకపోయినా మద్దతు ఇస్తానంటే తీసుకుంటామన్నారు. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ముందుకెళ్తామన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి మనమంతా కృషి చేయాలన్నారు. మేమంతా కలిసి రాష్ట్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత తాను మెహబూబాబా ముఫ్తీతో మాట్లాడలేదన్నారు. ముఫ్తీ మద్దతు ఇస్తానన్న విషయాన్ని పేపర్లలో మాత్రమే చదివాను అన్న ఫరూఖ్‌.. ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News