పాలన బేజారు.. బూతుల హోరు
పదిహేను నెలల పాలనలో సమస్యల వలయంలో తెలంగాణ;
సీఎం అనుభవరాహిత్యం రాష్ట్ర ప్రజలకు అనేక సమస్యలు తెచ్చిపెడుతున్నది. పదిహేను నెలలు పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ అన్నివర్గాల ప్రజలను అరిగోస పెడుతున్నారు. దీన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారు. పాలనలో లోపాలు ఉంటే సరిచేసుకోవచ్చు. కానీ నేరం నాది కాదు గత పాలకులదే అన్నట్లు సీఎం వ్యవహరిస్తు తీరుతో రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో వరి పంట ఎండింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్లు బిల్లుల కోసం డిప్యూటీ సీఎం ఛాంబర్ ముందు ఆందోళన చేశారు. రుణమాఫీ, రైతు భరోసా కోసం రైతులు రోడ్లపైకి వస్తున్నారు. అయినా సీఎం స్పందించడం లేదు. తన రాజ్యం రామరాజ్యం అన్నట్లు గప్పాలు కొడుతున్నారు.
అందరినీ సమన్వయం చేసుకుంటూ సుపరిపాలన అందిస్తే పాలనపై పట్టు సాధించినట్లుగా రేవంత్ రెడ్డి చెబుతున్నారు. సర్కార్‌లో సమన్వయం లేదని అనేకసార్లు రుజువైంది. అసెంబ్లీలోనూ అది తేటతెల్లమౌతున్నది. అధికారపార్టీనే అసెంబ్లీలో ఇష్యూను డైవర్ట్ చేసేలా వ్యవహరిస్తున్నది. దీన్ని ప్రశ్నిస్తే ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేపై సస్పెండ్ చేశారు. నిన్న ఎంఐఎం శాసనసభా పక్ష నేత కూడా ప్రభుత్వం సభను నడపడం లో విఫలమైందని ధ్వజమెత్తారు. ఇది గాంధీభవన్ కాదు.. తెలంగాణ శాసనసభ అని కొంచెం ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రశ్నలను ఆపుతున్నది, మార్చివేస్తున్నదని మండిపడ్డారు. మంత్రి సీతక్క వెబ్‌సైట్లు పనిచేయడం లేదంటే నిన్న సండే అని సమాధానం ఇచ్చారు. మండలిలో ఎమ్మెల్సీ కవిత కల్యాణలక్ష్మీ బకాయిలు, తులం బంగారం, మహాలక్ష్మి స్కీం కింద మహిళలకు ఇస్తానన్న రూ. 2500 గురించి ప్రశ్నిచారు. దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇస్తూ తులం బంగారం, రూ. 2500 మంగళం పాడేశారు. దీన్నిబట్టి ప్రభుత్వం పాదర్శకంగా పనిచేస్తున్నదని, ఇచ్చిన హామీలను నెరవేరస్తున్నదని ఎలా అనుకోవాలో సీఎం రేవంత్ రెడ్డే చెప్పాలి.
హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూలుస్తూ.. రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నదే రేవంత్ సర్కార్. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని విపక్షాలే కాదు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యాన్ని తెలియజేస్తున్నది. అందుకే జనాలు కూడా ఆయనకు పాలన చేయడం రావడం లేదని అంటున్నారు.ఇట్లా అనేక తప్పులు చేస్తూ.. సీఎం గురువింద నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది. పదిహేను నెలలు అవుతున్నా మంత్రివర్గ విస్తరణ చేసుకోలేని ఆయన అన్నింటికీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
ఇక తెలంగాణ ఉద్యమంలో ఎవరి పాత్ర ఏమిటో ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన పాలన, తన పాలనా విధానాలు, ఈ పదిహేను నెలల్లో తాము సాధించిన విజయాల గురించి చెప్పుకోక.. కేసీఆర్, కిషన్‌రెడ్డిలపై అసందర్భ విమర్శలు చేయడం ముఖ్యమంత్రికి పరిపాటిగా మారింది. కేసీఆర్ గాంధేయ మార్గంలో తెలంగాణ సాధించారు . చిన్న రాష్ట్రాల కోసం పోరాడే వారికి స్ఫూర్తిని ఇచ్చారు. కేసీఆర్ తెలంగాణ తప్పా ఏమీ కోరలేదు అని కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ ప్రణబ్ ముఖర్జీ నే ఆయన తన పుస్తకంలో కొనియాడారు. తెలంగాణ తెచ్చిన ఆయనను సమాజం అంతా కీర్తిస్తున్నది. సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో రాష్ట్రాన్ని సాధించడం ఒక చరిత్ర. అలాంటిది ఉద్యమం చేసిన వారిపై, త్యాగాలు చేసిన వారిపై అవాకులు చెవాకులు పేలుతూ ముఖ్యమంత్రి ప్రజల్లో మరింత పలుచన అవుతున్నారు తప్పా ఆయన పతారాను ఎవరూ తగ్గించడం లేదన్నది గుర్తు పెట్టుకోవాలి.