ఛైల్డ్ పోర్నోగ్రఫి చూడటం నేరమే: సుప్రీం
ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమేనని అత్యున్నత న్యాయస్థానం వెల్లడి
ఛైల్డ్ పోర్నోగ్రఫి చూడటం నేరం కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తోసిపుచ్చింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమేనని వెల్లడించింది.
ఇలాంటి తీర్పు ఇచ్చి హైకోర్టు ఘోరమైన తప్పిదం చేసిందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేంద్రానికి పలు సూచనలు చేసింది. పోక్సో చట్టంలో 'ఛైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ' ఛైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యుసివ్ మెటీరియల్' అనే పదంతో మారుస్తూ పోక్సో చట్టానికి సవరణలు చేయాలని పార్లమెంటుకు తెలిపింది. ఆ సవరణలు అమల్లోకి వచ్చేంత వరకు దీనిపై ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చని తెలిపింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని కోర్టులు ఉపయోగించవద్దని ఆదేశించింది.
ఛైల్డ్ పోర్న్ వీడియోలు డౌన్‌లోడ్ చేసిన 28 ఏళ్ల వ్యక్తిపై క్రిమినల్ చర్యలు నిలిపివేస్తూ జనవరి 11న మద్రాస్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఛైల్డ్ పోర్నోగ్రఫిని చూడటం తప్పేమీ కాదని వ్యాఖ్యానించింది. ఆ వీడియోలు చూస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ అంశంలో శిక్షలు విధించడం కంటే సమాజాన్ని చైతన్యవంతం చేయాలని సూచించింది. మద్రాస్ హైకోర్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చైల్డ్ పోర్నోగ్రఫీ నేరమేనని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.