సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు ఊరట
జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం
సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆ రోజు జరిగిన ఘటనలు, మొత్తం వ్యవహారాన్నంతా మోహన్‌బాబు తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. గత విచారణ సందర్భంగా వెలుబుచ్చిన అభిప్రాయమే ఈసారి కూడా కోర్టు ముందు తన వాదనలు వినిపించారు. అది అనుకోకుండా జరిగిన ఘటన అని, తన క్లయింట్‌కు, ఆయన కొడుకుకు మధ్య విద్యాసంస్థకు సంబంధించిన వ్యవహారం, దానితోపాటు రెండు రాష్ట్రాల్లో ఉన్న విద్యాసంస్థలు, కుటుంబపరమైన అంశాలపై వివాదం చెలరేగింది. ఇది బైటికి ప్రపంచానికి సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో గాయపడిన జర్నలిస్టు దగ్గరికి తన క్లయింటే స్వయంగా వెళ్లి పరామర్శించి, క్షమాపణలు చెప్పారని, ఆర్థికపరమైనవే కాకుండా అన్నిరకాల సహకారాలు అందిస్తానని లిఖిత పూర్వకంగా భరోసా ఇచ్చారు. ఈవ్యవహారంలో సీసీ ఫుటేజ్ లో మోహన్‌బాబు తప్పు చేసినట్లు కనిపిస్తున్నదనగా.. తాను సెలబ్రిటిగా ఉన్నానని ఇలాంటి పనులు చేసేవాడిని కాదని, కేవలం తన కొడుకుకు, తనకు మధ్య కుటుంబపరమైన వివాదమని ఆయన తరఫు న్యాయవాది వివరించారు. గాయపడిన జర్నలిస్టు ఆరోగ్యపరిస్థితిని సుప్రీం ధర్మాసనం న్యాయవాదిని అడిగి తెలుసుకున్నది. ఇరువురి వాదనల అనంతరం మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తుది ఉత్తర్వులు ఇచ్చింది.