వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
తదుపరి విచారణ రెండువారాలు వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం
న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేపట్టడానికి అభ్యంతరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి అభ్యంతరం లేదని ఇప్పటికే చెప్పింది. న్యాయవాదులైన దంపతులు ఇద్దరినీ కోర్టు ప్రాంగణలోనే హత్య చేశారని.. దీనికి సంబంధించిన వీడియోలన్నీ ఉన్నాయని వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అందరూ చూస్తుండగానే ఇద్దరినీ దారుణంగా చంపారన్నారు. అవే వీడియోలు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయని చెప్పారు. కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదని ఆరోపించారు.
తమపై లేని ఆరోపణలు చేసి నిందితులుగా చేర్చారని.. కేసును కొట్టివేయాలని పుట్ట మధు తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. మరణ వాంగ్మూలంలో ఎవరి పేరూ చెప్పలేదని.. కావాలంటే దానికి సంబంధించిన వివరాలు కోర్టుకు అందిస్తామన్నారు. మరణ వాంగ్మూలాన్ని ట్రాన్స్‌క్రిప్ట్ చేసి ఇస్తామని.. దీనికి సమయం ఇవ్వానలి విజ్ఞప్తి చేశారు. అనంతరం తదుపరి విచారణను జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ రాజేశ్ బిందాల్ ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది.