అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. నలుగురు మృతి
ఓబులవారి పల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగుల దాడిలో నలుగురు భక్తులు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓబులవారి పల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగుల దాడిలో నలుగురు భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. శివరాత్రి సందర్భంగా వై.కోట సమీపంలోని గుండాల కోనకు దర్శనానికి బయలదేరిన భక్తులను ఏనుగులు తొక్కి చంపాయి. మృతుల ఉర్లగడ్డ పోడు గ్రామానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తోంది.
మరో ఘటనలో పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలో ఏనుగులు హల్‌చల్ చేశాయి. తెల్లవారుజామున సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ షట్టర్లను విరగగొట్టి నాశనం చేశాయి. నెల రోజుల్లో రెండుసార్లు ఇదే మిల్‌పై దాడి చేయడంతో దాదాపు రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య దశాబ్దాలుగా ఉన్నది. అడవిదాటి వచ్చి ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. మరోవైపు ఏనుగుల దాడుల్లో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఏనుగులు కూడా వివిధ కారణాలతో మరణిస్తున్నాయి. అడవిలో నుంచి ఏనుగులు బైటికి రాకుండా కట్టడి చేయడానికి ఇప్పటివరకు అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాల తవ్వకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.