44 ఏళ్ల నాటి ఊచకోత కేసులో దోషులకు మరణశిక్ష
విచారణ సమయంలోనే 14 మంది మృతి. మిగిలిన దోషులకు మరణశిక్ష విధించిన ప్రత్యేక కోర్టు;
44 ఏళ్ల నాటి దళితుల ఊచకోత కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. ముగ్గురు దోషులకు ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. 1981 లో 24 మంది దళితులను దుండగులు ఊచకోత కోశారు. ఈ ఘటనపై 1981లో 17 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విచారణ సమయంలోనే 14 మంది నిందితులు చనిపోయారు. మిగిలిన ముగ్గురు దోషులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
యూపీలోని దిహులీలో 1981 నవంబర్ 18న 24 మంది ఊచకోతకు గురైన ఘన సంచలనం సృష్టించింది. ఓ దళిత కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఆ దారుణానికి పాల్పడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో మహిళలు సహా ఆరు నెలలు, రెండేళ్ల వయసున్న చిన్నారులు కూడా ఉన్నారు. ఖాకీ డ్రెస్‌ల్లో వచ్చిన 17 మంది ఈ దారుణానికి ఒడిగట్టారు.
ఈ కేసులో మొదట 17 మంది హత్య, హత్యాయత్నం, దోపిడీ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే, కేసు విచారణ జరుగుతున్న క్రమంలోనే 14 మంది నిందితులు ప్రాణాలు కోల్పోయారు. సుదీర్ఘకాలం పాటు ఈ కేసు విచారణ జరిగింది. ఆ దారుణ ఘటనపై స్పందించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ బాధిత కుటుంబీకులను కలిసి పరామర్శించారు. బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయీ బాధిత కుటుంబానికి సంఘీభావంగా ఫిరోజాబాద్‌లోని సదుపూర్ నుంచి దిహులీ వరకు పాదయాత్ర చేయడం విశేషం.