5000 కార్ల దొంగ.. రూ. 10 కోట్ల విల్లా.. అతడి రూటే సెపరేటు.!

అస్సాంకు చెందిన అనిల్ చౌహాన్ (52) ప్రభుత్వ క్లాస్-1 కాంట్రాక్టర్‌గా పని చేస్తుండేవాడు. అయితే కాంట్రాక్టు వర్క్స్‌లో నష్టాలు రావడంతో దొంగతనాలు మొదలు పెట్టాడు. 1998లో తొలిసారిగా కారు దొంగిలించి అమ్మేశాడు.

Advertisement
Update:2022-09-07 07:58 IST

పార్క్ చేసిన కారు కనపడితే చాలు.. క్షణాల్లో మాయం చేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. అలా ఒకటి కాదు రెండు కాదు.. గత కొన్నేళ్లలో 5000 కార్లను హాంఫట్ చేసేశాడు. గతంలో పలుమార్లు కార్ల దొంగతనం కేసులో అరెస్టై జైలుకు వెళ్లినా.. తిరిగి వచ్చిన తర్వాత కూడా అదే పని చేసేవాడు. గత కొన్నాళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న ఆ గజదొంగను రెండు రోజుల క్రితం సెంట్రల్ ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం అరెస్టు చేసింది. కాగా, అతడిని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 90వ దశకం చివరిలో కార్ల దొంగతనాలు మొదలు పెట్టిన అనిల్ చౌహాన్.. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ దొంగగా గుర్తింపు పొందాడు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

అస్సాంకు చెందిన అనిల్ చౌహాన్ (52) ప్రభుత్వ క్లాస్-1 కాంట్రాక్టర్‌గా పని చేస్తుండేవాడు. అయితే కాంట్రాక్టు వర్క్స్‌లో నష్టాలు రావడంతో దొంగతనాలు మొదలు పెట్టాడు. 1998లో తొలిసారిగా కారు దొంగిలించి అమ్మేశాడు. ఈజీ మనీకి కార్ల దొంగతనం బాగుందని అనుకొని.. ఇక అప్పటి నుంచి వరుసగా చోరీలు చేస్తూనే ఉన్నాడు. అస్సాం నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చి.. ఇక్కడ ఓ మోటర్ సైకిల్‌పై రెక్కీ నిర్వహించేవాడు. జనసంచారం ఎక్కువగా లేని ప్రాంతంలో కారు దొంగిలించి.. తన సహచరులకు ఇచ్చేవాడు. అనంతరం మళ్లీ విమానం ఎక్కి అస్సాం వెళ్లిపోయేవాడు. దొంగిలించిన కార్లన్నీ అస్సాం, గ్యాంగ్‌టక్, నేపాల్ వంటి ప్రాంతాల్లో అమ్మేసేవాడు. కార్లు అమ్మడానికి అతడికి దాదాపు 25-30 మంది సహకరించేవారు. అయితే, అతడితో నేరుగా కేవలం ముగ్గురు నమ్మకస్తులు మాత్రమే టచ్‌లో ఉండేవారు.

ఇలా సంపాదించిన సొమ్ముతో రూ. 10 కోట్ల విలువ చేసే విల్లాను కూడా కొన్నాడు. అంతే కాకుండా కాంట్రాక్టర్‌గా పని చేసే సమయంలో తనకు పరిచయం అయిన అధికారుల పేర్లను ఉపయోగించేవాడు. దర్జాగా ఓ అధికారిలా తయారై.. ఖరీదైన వాచీ, బ్రేస్‌లెట్లు ధరించి తిరిగేవాడు. అతడిని చూస్తే ఎవరికీ దొంగ అని అనుమానమే రాదు. ఇతడు కేవలం ఖరీదైన ఎస్‌యూవీ, సెడాన్లను మాత్రమే దొంగిలించే వాడు. కాగా, ఇతడికి ముగ్గురు భార్యలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరు భార్యలకు అసలు అనిల్ చౌహాన్ పెద్ద క్రిమినల్ అని తెలియకపోవడం గమనార్హం.

కొంత కాలం క్రితం అనిల్ చౌహాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రైనో కొమ్ములు, అక్రమ ఆయుధాలు, డ్రగ్స్ అమ్ముతున్నాడనే కేసులో అతడిని అరెస్టు చేశాడు. ఆ సమయంలో ఈడీ అతడి ఆస్తుల గురించి ఆరా తీయగా రూ. 10 కోట్ల విలువైన విల్లా ఉందని తేలింది. అప్పుడే అతడి ఆస్తులను జప్తు చేశారు. ఆ సమయంలోనే ఇద్దరు భార్యలకు అతడో బడా క్రిమినల్ అని తెలిసింది. కాగా, అప్పటి వరకు అనిల్‌ను వారు ఓ కార్ల డీలర్ అని అనుకున్నారు. ఈడీ సోదాల తర్వాత ఇద్దరు భార్యలు అతడిని వదిలేసి వెళ్లిపోయారు.

ఇక కొంత కాలంగా తప్పించుకొని తిరుగుతున్న అనిల్ చౌహాన్‌ కోసం సెంట్రల్ ఢిల్లీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇన్‌స్పెక్టర్ సందీప్ గొదార నేతృత్వంలోని బృందం అతడి కోసం అస్సాం, సిక్కిం, నేపాల్, ఎన్‌సీఆర్‌లో గాలించింది. అయితే అనిల్ చౌహాన్‌ ఢిల్లీలో ఉన్నట్లు ఆగస్టు 23న వారికి ఓ చిన్న సమాచారం అందింది. వెంటనే డీబీజీ రోడ్డులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతడు ఓ మోటార్ బైక్ మీద కారు దొంగతనానికి వెళ్తున్నాడు. అతడి వద్ద ఓ పిస్టోల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా, అనిల్‌పై 181 క్రిమినల్ కేసులు ఉన్నాయని, గతంలో అరెస్టు చేసినా బెయిలుపై బయటకు వచ్చాడని పోలీసులు చెబుతున్నారు. ఈ సారి మాత్రం జైలు నుంచి బయటకు రాకుండా కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు. అయితే అతడు గత 20 ఏళ్లకు పైగా దొంగతనం చేసి, అమ్మిన కార్లలో 10 శాతం కూడా రికవరీ అయ్యే అవకాశం లేదని పోలీసులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News