హైకోర్టు తీర్పుతో పాక్ నటులు తిరిగి వచ్చేస్తారా?
దేశం దారి దేశానిది, కోర్టు దారి కోర్టుది అన్నట్టుంది... కోర్టు తీర్పు అమలు పరిస్తే ఎవరైనా బతికి బట్ట కడతారా అన్నదీ ప్రశ్నే. అసలు ఇందులో కోర్టు జోక్యం ఎందుకన్నదీ ప్రశ్నే. గతవారం పాకిస్తానీ కళాకారులపై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ని బాంబే హైకోర్టు కొట్టివేసింది.
దేశం దారి దేశానిది, కోర్టు దారి కోర్టుది అన్నట్టుంది... కోర్టు తీర్పు అమలు పరిస్తే ఎవరైనా బతికి బట్ట కడతారా అన్నదీ ప్రశ్నే. అసలు ఇందులో కోర్టు జోక్యం ఎందుకన్నదీ ప్రశ్నే. గతవారం పాకిస్తానీ కళాకారులపై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ని బాంబే హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు న్యాయ నిపుణులతో బాటు బాలీవుడ్ ప్రముఖుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మనం మనం నిషేధించుకుంటాం, ఇందులో కోర్టుకేం పని అని ప్రశ్నిస్తున్నారు. అసలు పాక్ కళాకారులపై బాలీవుడ్ విధించిన నిషేధం వుండగా, మళ్ళీ పిటిషన్ దారు పాక్ కళాకారుల్ని నిషేధించమని కోర్టు కెళ్ళడంలో ఆంతర్యమేమిటని కూడా అడుగుతున్నారు.
బాలీవుడ్ పరిశ్రమలో పాకిస్థానీ కళాకారులకి పాత్రలు కేటాయించకుండా నిషేధం విధించాలని కోరుతూ ఫైజ్ అన్వర్ ఖురేషీ అనే నటుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. బాలీవుడ్ లోని అన్ని సంఘాలు పాక్ కళాకారుల్ని నిషేధిస్తూ తీర్మానాలు చేశాయని పిటిషన్ లో పేర్కొన్నాడు. దీని మీద విచారణ జరిపిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ ని కొట్టి వేస్తూ, అక్టోబర్ 20న తీర్పు వెలువరించింది.
న్యాయస్థానం తీర్పులో ఇలా పేర్కొంది: ‘ఈ పిటిషన్ సాంస్కృతిక సామరస్యం, ఐక్యత, శాంతిని ప్రోత్సహించడం పట్ల తిరోగమన అడుగు. ఈ పిటిషన్ కి ఎటువంటి యోగ్యత లేదు... కళలు, సంగీతం, క్రీడలు, సంస్కృతి, నృత్యం మొదలైనవి జాతీయతలకి, సంస్కృతులకి, దేశాలకీ అతీతంగా దేశాల మధ్య నిజమైన శాంతిని, ప్రశాంతతని,ఐక్యతనీ, సామరస్యాన్నీ కలిగిస్తాయి... దేశభక్తులు అన్పించుకోవడానికి విదేశాల నుంచి, ప్రత్యేకించి పొరుగు దేశం నుంచి వచ్చిన వారి పట్ల వైరి భావం ప్రదర్శించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవాలి. నిస్వార్థంగా, అంకితభావంతో వున్న వ్యక్తి నిజమైన దేశభక్తుడు. అతను మంచి హృదయం వున్న వ్యక్తి అయితే తప్ప అతను తన దేశానికి గర్వ కారణం కాదు...’
ఈ తీర్పుతో తల పట్టుకున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇప్పుడేం చేయాలి? మళ్ళీ ఫవాద్ ఖాన్, మాహిరా ఖాన్, అలీ జాఫర్ మొదలైన పాకిస్తాన్ స్టార్స్ నీ, అతిఫ్ అస్లాం రాహత్ ఫతే అలీ ఖాన్ మొదలైన స్టార్ సింగర్స్ నీ పిలిచి ఎర్ర తివాచీ పర్చాలా అని ప్రశ్నిస్తున్నాయి. పిటిషన్ దారు పాకిస్థానీ నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని, గాయకుల్ని, సంగీతకారుల్నీ, గీతరచయితల్నీ నియమించడాన్ని నిషేధిస్తూ సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టుని కోరాడు.
ఇలాంటి విషయాల్లో కోర్టు ఎలా తెరపైకి వస్తుందో అర్ధంగావడం లేదని బాలీవుడ్ వర్గాలు వాపోతున్నాయి. ఇది అసోసియేషన్ కీ, దాని సభ్యులకీ మధ్య వున్న అంశమనీ, సభ్యులకు ఏది మంచిదో అసోసియేషన్ కి తెలుసనీ అంటున్నారు. పాకిస్తానీ కళాకారుల్ని నిషేధించకూడదన్న తీర్పుని అమలుపరిస్తే తలెత్తే పరిణామాలకి కోర్టు బాధ్యత వహిస్తుందా అని కూడా ప్రశ్నిస్తున్నారు. సినిమా నిర్మాతలు ప్రజల అభిరుచుల్ని తీర్చడానికి ప్రయత్నిస్తారనీ, చలనచిత్ర పరిశ్రమలో పాకిస్థానీయుల భాగస్వామ్యంపై ప్రజల మనోభావాలని కోర్టు పరిగణనలోకి తీసుకుందా అని కూడా అడుగుతున్నారు. పాక్ కళాకారులపై ఇదివరకే నిషేధముండగా, నిషేధం కోరుతూ పిటిషన్ దారు కోర్టు నాశ్రయించంలో మతలబు ఏమిటని కూడా ప్రశ్నిస్తున్నారు.
నిషేధం ఎందుకు?
2010ల ప్రారంభంలో, ‘హమ్‌సఫర్’ (2011), ‘జిందగీ గుల్జార్ హై’ (2012) వంటి విజయవంతమైన పాకిస్థానీ సీరియల్స్ ఇండియాలో ప్రసారం కావడం, ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ , అలీ జాఫర్ లు పాపులర్ అవడం, దాంతో బాలీవుడ్ వాళ్ళ వెంటబడడం జరిగాయి. అలాగే సంగీత దర్శకులు పాక్ సింగర్స్ అతిఫ్ అస్లాం, రాహత్ ఫతే అలీ ఖాన్ మొదలైన పాక్ సింగర్స్ నీ రప్పించుకుని హిట్స్ సాంగ్స్ ఇవ్వడం మొదలెట్టారు. పాక్ కళాకారులకి అంతా పచ్చ పచ్చగా, మన ప్రేక్షకులకి వెచ్చ వెచ్చగా వుంటున్నాక, 2016 లో యురీ మీద పాక్ ఉగ్రవాద దాడి జరిగింది.
ఈ దాడిని పాక్ కళాకారులు ఖండించకపోవడంతో, పాకిస్థానీ కళాకారుల్ని నిషేధిస్తూ ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ యూనియన్ చేసిన తీర్మానాలతో సరిహద్దుల మధ్య సీమాంతర సాంస్కృతిక మార్పిడి సదాశయానికి తెరపడింది. 2019లో పుల్వామా ఘటనతో ఆల్-ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ కూడా 2016 నిషేధాన్ని సమర్థిస్తూ తీర్మానం చేసింది.
అయితే ఇప్పుడు హైకోర్టు తీర్పుని అమలు చేయమంటూ డిమాండ్లు చేయడం గానీ, అమలు చేయకపోతే అప్పీలు కెళ్ళడం గానీ చేసే వ్యక్తులెవరూ వుండరు. పాక్ కళాకారులు అసలే జోక్యం చేసుకోరు. పొరపాటున ఎవరైనా నిర్మాత పాక్ నటుడ్ని పిలిపించుకుని సినిమా తీస్తే భక్తులు బ్రతకనివ్వరు. కొన్ని తీర్పుల్ని సరదాగా తీసుకోవాలంతే!