ఓటీటీలోకి 'సత్యం సుందరం' .. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అరవిందస్వామి, కార్తీ బావ, బావమరిదిగా నటించిన ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ఆదరణ పొందింది.

Advertisement
Update:2024-10-22 11:15 IST

అరవిందస్వామి, కార్తీ బావ, బావమరిదిగా నటించిన మూవీ 'సత్యం సుందరం' ఇటీవల థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఉన్న ఊరు, ఇంటి జ్ఞాపకాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో చాలా భావోద్వేగ అంశాలున్నాయి. చాలామందికి కనెక్ట్‌ అయ్యే కథ. సినిమా నిడివి పెద్దగా ఉన్నా బోర్‌ కొట్టకుండా కామెడీ, భావోద్వేగాలతో కూడిన డ్రామాను దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ అద్భుతంగా డైరెక్ట్‌ చేశారు. శ్రీదివ్య కీలక పాత్రలో పోషించింది. ఈ మూవీ నెట్‌ ఫ్లిక్స్‌ వేదికగా అక్టోబర్‌ 27 నుంచి డిజిటల్‌ ప్రేక్షకులను అలరించనున్నది. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్టు తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

కథ ఏమిటంటే?

సత్యమూర్తి అలియాస్‌ సత్యం (అరవిందస్వామి)ది గుంటూరు దగ్గరున్న ఉద్దండరాయుని పాలెం. అతనికి ఆ ఊరు అన్నా.. అక్కడ ఉన్న తమ తాతల కాలం నాటి ఇళ్లు అన్నా చాలా ఇష్టం. కొందరు బంధువులు చేసిన మోసం వల్ల సత్యం యవ్వనంలో ఉన్నప్పుడే వాళ్ల కుటుంబం ఆ ఇల్లు కోల్పోతుంది. దీంతో వాళ్లు ఆ ఊరును వదిలి వైజాగ్‌ వచ్చి స్థిరపడుతారు. ఈ క్రమంలోనే 30 ఏళ్లు గడిచిపోతాయి. అయినా సత్యంను తన ఊరు, ఇంటి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఒకసారి తన బాబాయి కూతురు పెళ్లి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో సత్యం ఉద్ధండరాయుని పాలెం వెళ్తాడు. ఆ పెళ్లిలోనే అతని బావా అని ఆప్యాయంగా పలుకరిస్తూ ఒక వ్యక్తి (కార్తీ) అతనికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాడు. నిజానికి అతను ఎవరు? తన పేరు ఏమిటి అన్నది సత్యం గుర్తుపట్టడు. మొహమాటం కొద్దీ తను పరిచయం ఉన్న వ్యక్తిలా నటిస్తూ వస్తాడు. మొదట్లో అతని అతి వాగుడు.. మితిమీరిన కలుపుగోలుతనం చూసి తనను జిడ్డులా భావిస్తాడు. కానీ కలిసి ప్రయాణం చేసే క్రమంలో అతను చూపెట్టే ప్రేమ, ఆప్యాయతలకు సత్యం ఫిదా అవుతాడు. వీళ్లిద్దరి ప్రయాణం ఏ మజిలికి చేరింది? ఈ ప్రయాణంలో సత్యం తనను తాను ఎలా తెలుసుకున్నాడు? బావా అని పిలుస్తున్న ఆ వ్యక్తితో అతనికి ఉన్న అనుబంధం ఏమిటి? చివరికి సత్యంకు అతని పేరు గుర్తు వచ్చిందా? అన్నదే మిగతా కథ.

Tags:    
Advertisement

Similar News