కూతుళ్లు కూడా వారసులే.. చిరంజీవికి కిరణ్ బేడీ కౌంటర్
వారసత్వం కోసం ఓ మగ బిడ్డను కనమని రామ్‌చరణ్ అడుగుతుంటా అని చిరంజీవి కామెంట్స్ వివాదాస్పదమైనవి;
వారసత్వం కోసం ఓ మగ బిడ్డను కనమని మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్‌చరణ్ అడుగుతుంటా అని ఇటీవల మెగాస్టార్ చేసిన కామెంట్స్ విదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్‌పై మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ స్పందించారు. కూతుళ్లు కూడా వారసులేనన్న విషయాన్ని నమ్మండి, గుర్తించండి అని ఆమె హితువు పలికారు. ఈ మేరకు కిరణ్ బేడీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక పోస్టు పెట్టారు. "చిరంజీవి గారూ... దయచేసి కూతురు కూడా ఒక వారసురాలేనని నమ్మడం, గుర్తించడం ప్రారంభించండి.
ఇదంతా మీరు కూతురిని ఎలా పెంచుతారు, ఆమె ఎలా అభివృద్ధి చెందుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. తమ కూతుళ్లను పెంచి, తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న తల్లిదండ్రుల నుంచి నేర్చుకోండి. వారిని బాగా చూసుకుంటే, వారు తమ కుటుంబాలను గర్వపడేలా చేస్తారు. ఇప్పటికే చాలా మంది ఈ విషయాన్ని నిరూపించారు. అమ్మాయిలేం తక్కువ కాదు" అని కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. తన ఇల్లంతా మనవరాళ్లతో నిండిపోయిందని, ఇంట్లో ఉన్నప్పుడల్లా తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్‌లాగా ఉంటుందని చిరంజీవి చెప్పిన విషయం తెలిసిందే