బాలీవుడ్ తో బంధం ఏనాటిదో!

బాలీవుడ్ లో టాలీవుడ్ సినిమాల ప్రభావం ఇవ్వాళ కొత్తగా కన్పిస్తున్నదేగానీ, ముందు నుంచీ బాలీవుడ్ కి టాలీవుడ్ తో సంబంధముంది.

Advertisement
Update:2022-11-22 14:11 IST

బాలీవుడ్ తో బంధం ఏనాటిదో!

బాలీవుడ్ లో టాలీవుడ్ సినిమాల ప్రభావం ఇవ్వాళ కొత్తగా కన్పిస్తున్నదేగానీ, ముందు నుంచీ బాలీవుడ్ కి టాలీవుడ్ తో సంబంధముంది. ఎందరో తెలుగు నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్లూ తెలుగు నుంచి బాలీవుడ్ కి వెళ్ళి హిట్లు ఇచ్చి బాలీవుడ్ మనుగడకి తోడ్పడిన చరిత్ర వుంది. తెలుగే కాదు, తమిళ చిత్ర పరిశ్రమ కూడా దశాబ్దాలుగా బాలీవుడ్ విజయానికి దోహదం చేస్తోంది. తెలుగులో, తమిళంలో విజయవంతమైన కథలు ఎల్లప్పుడూ బాలీవుడ్ నిర్మాతల్ని ఆకర్షించాయి. సుప్రసిద్ధ నిర్మాత, నటుడు, దర్శకుడూ అయిన తెలుగువాడు ఎల్వీ ప్రసాద్ భారతీయ సినిమాని సుసంపన్నం చేసిన మార్గదర్శకులు. ఆయన 1931లోనే భారతదేశపు మొదటి టాకీ 'ఆలం ఆరా'లో నటించేశారు.

ఆలాగే మొదటి తెలుగు - తమిళ ద్విభాషా టాకీ 'కాళిదాస్', మొదటి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాప్రహ్లాద' లో కూడా నటించారు. హిందీ, తెలుగు సినిమాల్లో నటించడమే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో సహా వివిధ భారతీయ భాషలలో దర్శకత్వం వహించిన నిర్మాతగా వున్నారు. ఇక ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నటించిన హిట్ సినిమాలు కొన్ని హిందీలో రీమేక్ అయిన చరిత్ర కూడా వుంది.

ఎన్టీఆర్ నటించిన 'రాముడు భీముడు' (1964) హిందీలో 'రామ్ ఔర్ శ్యామ్' (1967) గా దిలీప్ కుమార్ తో రీమేకైంది. అక్కినేని నాగేశ్వరరావు తొమ్మిది పాత్రల్లో నటించిన 'నవరాత్రి' (1966) సంజీవ్ కుమార్ తో 'నయా దిన్ నయీ రాత్' గా హిందీలో రీమేకైంది.

దర్శకుడు తాతినేని రామారావు 38 తెలుగు హిట్స్ ని హిందీలో రీమేక్ చేసి రికార్డు సృష్టించారు! ఆయన దర్శకత్వంలో ఎన్టీ రామారావు నటించిన 'యమగోల' (1977) హిందీలో జీతేంద్రతో 'లోక్ పరలోక్ ' గా తీశారు. కె. రాఘవేంద్రరావు కూడా శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రదలతో తీసిన 'దేవత' (1982) ని హిందీలో జీతేంద్రతో 'తోఫా' (1984)గా రీమేక్ చేశారు. ఇదే గాక తెలుగులో తను తీసిన ఇంకో 11 తెలుగు హిట్స్ ని హిందీలో దిలీప్ కుమార్, రాజేశ్ ఖన్నా, జీతేంద్రలతో రీమేక్ చేశారు.

ఇక కె బాపయ్య కూడా 31 హిందీ రీమేకులతో తాతినేని రామారావు తర్వాత నెంబర్ టూ గా వున్నారు. దిలీప్ కుమార్, సంజీవ్ కుమార్, జీతేంద్ర, రాజేష్ ఖన్నా, జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి, గోవిందా, ఋషీ కపూర్, షారూఖ్ ఖాన్...ఇలా పాపులర్ బాలీవుడ్ స్టార్స్ తో 31 రీమేక్స్ చేశారు. నాటి తెలుగు 'పాతాళ భైరవి' సహా. అంటే తెలుగు సినిమా కథలు ఆ రోజుల్లో హిందీలో అంతబాగా ఆకర్షించే వన్న మాట.

డాక్టర్ దాసరి నారాయణరావు- 13 తెలుగు సినిమాలు హిందీలో తీశారు. రాజేష్ ఖన్నా, జీతేంద్రలతో తీశారు. తెలుగు దర్శకులందరికీ జీతేంద్రే దిక్కు. ఆయన హిందీ రీమేకులు ఆంధ్రాలోనే షూటింగులు చేసుకుంటూ ఎప్పుడు చూసినా తెలుగు గడ్డపైనే వుండేవాడు.

కె. విశ్వనాథ్- తెలుగులో తను తీసిన సినిమాల్లో తొమ్మిదిటిని హిందీలో రీమేక్ చేశారు. ఇందులో సిరిసిరి మువ్వ, జీవనజ్యోతి, స్వాతిముత్యం మొదలైనవి వున్నాయి. కె. మురళీ మనోహర్ రావు కూడా ఏడు హిందీ రీమేకులు చేశారు.

ఇక పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై హీరో కృష్ణ అయితే 14 తెలుగు హిట్స్ ని హిందీలో నిర్మించారు. డాక్టర్ డి రామానాయుడు కూడా 10 హిందీ రీమేకులు తీశారు. రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పాల్సిందేముంది- ఆయన ఏకంగా 50 సినిమాలు హిందీలో తీశారు. ఒకటి రెండు రీమేకులు తప్ప మిగిలినవన్నీ -రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్- ఇలా హిందీ ఒరిజినల్సే.

ఇలా నిర్మాతలు, దర్శకులే గాకుండా, హీరోయిన్లు శ్రీదేవి, జయప్రదలు ఈ రీమేకులతో హిందీలో కెళ్ళిపోయి తిరుగులేని స్టార్స్ అయ్యారు. కాబట్టి బాలీవుడ్ విజయంలో టాలీవుడ్ భాగస్వామ్యం పూర్వం నుంచే వుంది. ఇవ్వాళ ఏడాదికో, రెండేళ్ళకో ఒక పానిండియా సినిమా తీస్తూ బాలీవుడ్ ని జయించేస్తున్నా మనుకోవడం కరెక్ట్ కాదు. పదుల సంఖ్యలో సీనియర్లు తీసిన హిందీ సినిమాల ముందు ఇంకేదీ నిలబడదు.

Tags:    
Advertisement

Similar News