Tollywood: చిన్న సినిమాలతో నెంబర్ వన్ టాలీవుడ్

Advertisement
Update:2022-11-09 12:59 IST

గతవారం శుక్ర శనివారాల్లో మళ్ళీ ఓ 10 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. పెద్ద సినిమాలు లేని వారం భారీ సంఖ్యలో చిన్న, మధ్యస్థ సినిమాలు విడుదలైపోవడం ఇటీవల మామూలై పోయింది. ఇలా గత వారాంతంలో అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన 'ఊర్వశివో రాక్షసివో', సంతోష్ శోభన్, ఫరియా నటించిన 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' రెండు ప్రధాన సినిమాలతో బాటు, 6 చిన్న సినిమాలు, 2 డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. ఇక 40 ఏళ్ళనాటి అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'ప్రతిబింబాలు' కూడా వీటి మధ్య విడుదలైంది. అయితే విషాదమేమిటంటే ఇవన్నీ బాక్సాఫీసు ముందు బోల్తా పడ్డాయి.

దేశంలో ఇంకే భాషలో కూడా ఒక వారం ఇన్నేసి సినిమాలు విడుదలవుతున్న పరిస్థితిలేదు. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పెద్ద సినిమాల్లేని అవకాశం చూసుకుని తెలుగు సినిమాలంత భారీ సంఖ్యలో చిన్నా చితకా సినిమాలు విడుదల కావడం లేదు. వేలం వెర్రిగా ఇలాటివి తీయడం దండగ అనుకుంటున్నారేమో. ఒకోసారి పెద్ద సినిమాల్లేని వారం ఒకే చిన్న సినిమా విడుదలవుతున్న సందర్భాలున్నాయి.

అంటే తెలుగులో తీస్తున్నన్ని చిన్నా చితకలు పై నాల్గు భాషల్లో తీస్తూ డబ్బులు పోగొట్టుకోవడం లేదు. పెద్ద సినిమాల్లేని వారం విడుదలవుతున్న తమిళ చిన్న సినిమాల సంఖ్య ఈ మూడు నెలల లెక్క తీస్తే- సెప్టెంబర్ 9న 3, 15న 1, 26 న 5, 23 న 3 విడుదలయ్యాయి. అక్టోబర్ 7న 4, 14న 3, 16న 1 విడుదలయ్యాయి. నవంబర్ 4న 6 విడుదలయ్యాయి.

మలయాళంలో సెప్టెంబర్ 2 న 4, 4న 2, 8న 2, 16 న 6, 23న 5, 30 న 2 విడుదలయ్యాయి. అక్టోబర్ 4న 2, 7న 3, 14 న 4, 20న 2, 27న 3, 28న 3 విడుదలయ్యాయి. నవంబర్ 4న 4 విడుదలయ్యాయి. మాలయంలో స్టార్లు, పేరున్న హీరోలూ చాలా తక్కువ. తీసేవి చిన్న హీరోలతో చిన్న సినిమాలే. అయితే ఇవి ఎంతో కొంత చెప్పుకోదగ్గవిగా వుంటున్నాయి.

కన్నడలో సెప్టెంబర్ 2 న 2, 9న 2, 16 న 2, 23న 1, అక్టోబర్ 14న 1, 21 న 1, 28 న 1, నవంబర్ 4న 1 చిన్న సినిమాలు విడుదలయ్యాయి. హిందీలో సెప్టెంబర్ 16న 8, 23 న 1, 30న 2, అక్టోబర్ 6న 1, 28న 1, నవంబర్ 4 న 1 విడుదలయ్యాయి.

తెలుగులో పెద్ద సినిమాల్లేని వారం ఒకటీ రెండు కాదు, ఏకంగా 10, 12 చిన్నా చితకా విడుదలవుతున్నాయి. చిన్న సినిమాలకే గతి లేదంటే చితక సినిమాలు కూడా. గత శుక్రవారం 'జెట్టి,' 'బొమ్మ బ్లాక్‌బస్టర్,' 'సారధి,' 'తగ్గేదెలే,' 'చింతామణి సొంతమొగుడు' లతో బాటు తమిళ డబ్బింగ్ 'ఆకాశం', కన్నడ డబ్బింగ్ 'బనారస్' విడుదలయ్యాయి. వీటి పేర్లు కూడా ఎవరికీ తెలియవు. ఇవన్నీ ఫ్లాపయ్యాయి. చిన్నా చితకలు హిట్టయ్యే మాటేలేదు. వీటితో బాటు'ఊర్వశివో రాక్షసివో', 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' కూడా ఫ్లాపయ్యాయి.

అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ బోయనపల్లి నిర్మించిన పై రెండు సినిమాలు కూడా ఫ్లాపవడం ఈవారం ప్రధాన వార్త. ఊర్వశివో రాక్షసివో' తో కూడా హీరో అల్లు శిరీష్ కి మళ్ళీ కలిసి రాలేదు. ఈ తరం సహజీవనం కథని పాత తరం డ్రామాలాగా తీశారు. అల్లు శిరీష్ ఇంటికి దగ్గర్లోనే రహస్యంగా హీరోయిన్ తో సహజీవనం మకాం పెట్టి, పేరెంట్స్ ని ఇంట్లోనే వున్నట్టు నటిస్తూ, కిటికీ గుండా రాకపోకలు సాగించే టైపు కామెడీ ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఈ కాలం చెల్లిన టెంప్లెట్ కామెడీ- అబద్ధం చెప్పి ఆడుకునే పాత ఆటతో- గత రెండు నెలల్లోనే వికృత టైటిల్ తో 'కృష్ణ వ్రింద విహారి', పాత టైటిల్ తో 'స్వాతిముత్యం' వచ్చి ఫ్లాపయ్యాయి. ఇప్పుడు 'ఊర్వశివో రాక్షసివో' వీటి పక్కన అదే మోడల్ కథతో చేరింది.

'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' అయితే పాత రోజుల్లో బి గ్రేడ్ హిందీ బందిపోటు సినిమాల్ని గుర్తుకు తెస్తుంది. హీరో సంతోష్ శోభన్ కి మళ్ళీ ఇంకో ఫ్లాప్. అన్నల దళాన్ని జోకర్లుగా చూపించి కామెడీలు చేసే ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. ఇక 'జెట్టీ', 'బొమ్మ బ్లాక్ బస్టర్' రెండూ మత్స్యకారుల కథలే. మొదటిది ఎత్తుకున్న కథ వదిలేసి మధ్యలో ఇంకో కథ ప్రారంభించే క్రియేటివిటీతో వుంటే, రెండోది పాత మసాలా రివెంజీ డ్రామాని ఆధునిక టెక్నిక్ తో తీయడం.

'తగ్గేదెలే' ఇక చెప్పనవసరం లేదు. 'దండుపాళెం' దర్శకుడు తీసిన ముతక డ్రగ్ మాఫియా సినిమా ఇది. 'సారధి', 'చింతామణి మొగుడు' ల గురించి చెప్పుకోవడం వేస్ట్. ఇక 'ఆకాశం' తమిళ డబ్బింగ్ తెలుగులో వర్కౌట్ అయ్యేది కాదు. 'పానిండియా సినిమాగా రిలీజ్ చేసిన కన్నడ 'బనారస్' అయితే అర్ధం కాని టైమ్ లూప్ కథా ప్రయోగంతో కన్నడలోనే ఫ్లాపయ్యింది.

తెలుగులో చిన్న సినిమాల క్వాలిటీ ఏమీ పెరగదు. ఇలాగే వుంటాయి. దేశంలో అందరికంటే ఎక్కువ తీసి ఎక్కువ పరువు పోగొట్టుకోవడం తప్ప సాధించేదేమీ లేదు. అయితే ఒకటి, ఇవి ఎన్ని ఎక్కువ తీస్తే అంత సినిమా కళాకారులకి, కార్మికులకి అంత పని లభించి కడుపు నిండా తింటారు. చిన్న నిర్మాతలు తీర్చుకుంటున్న ఈ సామాజిక బాధ్యత తక్కువదేం కాదు, దీన్ని కాదనలేం.

Tags:    
Advertisement

Similar News