నంది అవార్డులు నటులకు ప్రోత్సాహం ఇస్తాయి.. వెంకటేష్ కీలక వ్యాఖ్యలు

నంది అవార్డ్స్‌పై సినీ నటుడు వెంకటేష్ స్పందించారు. ప్రభుత్వం అవార్డులు ఇస్తే తమకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. నంది అవార్డులపై వెంకటేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement
Update:2023-05-30 21:45 IST

ప్రభుత్వాలు అందజేసే అవార్డులు నటులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తాయని అగ్ర హీరో వెంకటేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత సినీ పరిశ్రమకు ప్రభుత్వం అందజేసే నంది అవార్డుల ప్రదానం ఆగిపోయింది. అవార్డుల అందజేత విషయమై అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆలోచించడం లేదు. నంది అవార్డులు ఇవ్వాలని పలువురు సినీ పెద్దలు కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల పాలకులకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు.

మధ్యలో తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో సింహా అవార్డులు ఇవ్వాలని భావించింది. అయితే ఆ తర్వాత ఆ ఆలోచనను అమలు చేయలేదు. అయితే ఇటీవల ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నంది అవార్డ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అవార్డులు ఇమ్మంటే ఇస్తారు కానీ.. సినిమా అవార్డులు ఇవ్వరంటూ వ్యాఖ్యానించారు. అశ్వినీదత్ చేసిన కామెంట్స్ కు ప్రభుత్వం తరఫున పోసాని కృష్ణ మురళి తదితరులు కౌంటర్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే నంది అవార్డ్స్ పై ప్రముఖ సినీ నటుడు వెంకటేష్ స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అవార్డుల గురించి ఆలోచించను.. అని చెప్పారు. ప్రభుత్వం ఇస్తే ఇవ్వొచ్చు లేదంటే లేదన్నారు. కానీ అవార్డులు ఇస్తే తమకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. నంది అవార్డులపై వెంకటేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News