Tiger NageswarRao | రన్ టైమ్ సమస్య కాదంటున్న దర్శకుడు
Tiger Nageswar Rao - రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాకి భారీ నిడివి సమస్య కాదు అంటున్నాడు దర్శకుడు.
దసరా బరిలో నిలిచిన 3 సినిమాల్లో పెద్ద సినిమా టైగర్ నాగేశ్వరరావు మాత్రమే. భగవంత్ కేసరి సినిమా పెర్ ఫెక్ట్ నిడివితో వస్తోంది. లియో సినిమా రన్ టైమ్ కాస్త పెరిగినా, అదేం సమస్య కాదు. కానీ టైగర్ నాగేశ్వరరావు మాత్రం ఏకంగా 3 గంటల డ్యూరేషన్ తో వస్తోంది. దసరా బరిలో ఇంత పెద్ద సినిమాను జనాలు చూస్తారా?
కచ్చితంగా చూస్తారని అంటున్నాడు దర్శకుడు వంశీ. తనకు ఆ నమ్మకం ఉందంటున్నాడు. నిడివి విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని... సినిమా చూసిన తర్వాత మరో 10 నిముషాలుంటే బావుండేదని ఫీలింగ్ కలుగుతుందని చెబుతున్నాడు. అంతేకాదు, రోలింగ్ టైటిల్స్ వస్తున్నపుడు కూడా ప్రేక్షకులు కుర్చీ నుంచి లేవరని అంటున్నాడు.
టైగర్ నాగేశ్వరరావు సినిమాలో తనకు అత్యంత కష్టం అనిపించిన పార్ట్ ను బయటపెట్టాడు దర్శకుడు. సినిమాలో ట్రయిన్ సీక్వెన్స్ ఉందని, దాన్ని తీయడం చాలా కష్టమైందని అన్నాడు. గోదావరి బ్రిడ్జ్ ని రీక్రియేట్ చేయడం మామూలు విషయం కాదని, డీవోపీ, ఫైట్ మాస్టర్స్.. ఆర్ట్ డిపార్ట్మెంట్.. అందరూ తన విజన్ కి అద్భుతంగా సపోర్ట్ చేశారని అన్నాడు. ఆ సీక్వెన్స్ తీయడానికి తనకు 20 రోజులు పట్టిందని, దాని సిజీ చేయడానికి ఏడాది పట్టిందని వెల్లడించాడు.
ట్రయిన్ ఎపిసోడ్ తో పాటు.. చెన్నైలో పోర్ట్ సీక్వెన్స్, జైలు నుంచి తప్పించుకునే సీక్వెన్స్.. కూడా తనకు బాగా ఇష్టమని, వాటిని తీయడానికి చాలా కష్టపడ్డానని తెలిపాడు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు రెండు పాత్రలుంటాయని, పాటల కోసం హీరోయిన్లను తీసుకోలేదని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు.
ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరధ్వాజ్ హీరోయిన్లుగా నటించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించాడు. మాస్ రాజా కెరీర్ లో ఫుల్ లెంగ్త్ పాన్ ఇండియా రిలీజ్ కూడా ఇదే.