రేపే విజయ్ ‘లియో’ విడుదల!
అక్టోబర్ 19 న ‘లియో’ తెలుగు వెర్షన్ రద్దు అంటూ నిన్నంతా హల్చల్ చేసిన వార్తలకి ఈ రోజు తెరపడింది. ‘లియో’ యధావిధిగా రేపు అక్టోబర్ 19 నే విడుదలవుతోంది.
అక్టోబర్ 19 న ‘లియో’ తెలుగు వెర్షన్ రద్దు అంటూ నిన్నంతా హల్చల్ చేసిన వార్తలకి ఈ రోజు తెరపడింది. ‘లియో’ యధావిధిగా రేపు అక్టోబర్ 19 నే విడుదలవుతోంది. ‘లియో’ తెలుగు వెర్షన్ టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం జేస్తూ దాఖలైన పిటిషన్ పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులిస్తూ అక్టోబర్ 20 వరకూ విడుదల ఆపాలని ‘లియో’ తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన సితార ఎంటర్టయిన్మెంట్స్ ని ఆదేశించింది. వెంటనే సితార ఎంటర్టయిన్మెంట్స్ కి చెందిన నిర్మాత ఎస్. నాగవంశీ చర్య తీసుకుని పిటిషన్ దారుతో కోర్టు వెలుపల సెటిల్ చేసుకుంటున్నట్టు, విడుదల వాయిదా పడదని, ఈరోజు ప్రకటించారు.
‘లియో’ తెలుగు టైటిల్ విజయవాడలో రిజిస్టర్ అయి వున్నందున్న పిటిషన్ దారు కోర్టు నాశ్రయించాడు. ఒకవైపు జోరుగా అడ్వాన్సు బుకింగ్స్ జరుగుతోంటే విడుదల వాయిదా వార్తలు రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ‘లియో’ కోసం అత్యధిక సెంటర్స్ ని చేజిక్కించుకున్నారు. ఈ విషయంలో ‘భగవంత్ కేసరి’, ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా వెనుకబడ్డాయి. అడ్వాన్సు బుకింగ్స్ లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ‘లియో’ ముందంజలో వుంది.
అందర్నీ చాలా ఆశ్చర్య పరుస్తున్న విషయమేమిటంటే, కేరళలో 8 కోట్ల రూపాయల మేరకు అడ్వాన్సు బుకింగ్స్ జరగడం! ఇది రజనీకాంత్ ‘జైలర్’ కి కూడా సాధ్యం కాలేదు. ఇక ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో రూ. 50 కోట్ల మేరకు అడ్వాన్సు బుకింగులు జరిగాయి.
కాగా ‘లియో’ హిందీ వెర్షన్ విడుదల చేయడానికి పీవీఆర్- ఐనాక్స్ ఒప్పుకోలేదు. ఓటీటీ విడుదలకి 8 వారాల విండో ఇస్తేనే హిందీ వెర్షన్ విడుదల చేస్తామని షరతు పెట్టింది. అన్ని భాషల్లో 4 వారాల విండోకే సిద్ధపడిన నిర్మాతలు పీవీఆర్- ఐనాక్స్ నుంచి వైదొలిగారు. దీంతో ఈ సంస్థ చేతిలో వున్న ఐమాక్స్, ఇన్సిగ్నియా ప్రీమియం ఫార్మాట్స్ లో విడుదల అవకాశాన్ని కూడా కోల్పోయారు నిర్మాతలు. ఈ నష్టం విలువ రూ. 7 కోట్లు.
అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ‘లియో’ హిందీ వెర్షన్ విడుదలకి అడ్డంకులు లేకపోవడం మేలైంది.
తెలుగులో దసరాకి విడుదలవుతున్న మూడో వయొలెంట్ మూవీ ‘లియో’. రేపు బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ తో బాటే విడుదలవుతోంది. ఎల్లుండి రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల. విజయ్ నటించిన ‘లియో’ అత్యంత హింసాత్మక మూవీగా ప్రచారమవుతోంది. ఇందుకు కారణముంది. ఈ మూవీ 2005 లో విడుదలైన ‘ఏ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్’ హాలీవుడ్ మూవీకి అధికారిక రీమేక్ అని నిర్మాతే వెల్లడించారు. కాబట్టి హాలీవుడ్ మూవీలో వున్న స్థాయిలో ‘లియో’ లో హింస వుండి తీరుతుంది.
ఓ సౌమ్యంగా వుండే వ్యక్తి అనుకోకుండా ఎదురైన సంఘటనలో దుండగుల్ని క్రూరాతి క్రూరంగా హతమార్చేసి- తన క్రౌర్యానికి తనే ఆశ్చర్య పోతాడు, భయపడి పోతాడు. కానీ వూళ్ళో అందరూ అతడ్ని హీరోగా ఆకాశానికెత్తేస్తారు. ఇక అతడ్ని హతమార్చడానికి మిగిలిన దుండగుల గ్యాంగ్ వెంటాడుతుంది. విగ్గో మోర్టెన్‌సెన్ నటించిన, ‘ఏ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్’ ఇదే పేరుతో 1997 లో విడుదలైన గ్రాఫిక్ నవలకి అనుసరణ. దీన్ని కొన్ని మార్పులు చేసి ’లియో’ గా తీశారు.
ఇందులో విజయ్ లియో దాస్ గా, పార్థీగా రెండు పాత్రల్లో కన్పించనున్నట్టు తెలుస్తోంది. భార్య సత్యగా త్రిష, ఆంథోనీ దాస్ గా సంజయ్ దత్ (సంజయ్ దత్ విజయ్ కి దుష్ట తండ్రి పాత్ర అని తెలుస్తోంది), హెరాల్డ్ దాస్ గా అర్జున్ నటించారు. 4 పాటలకి అనిరుధ్ రవిచందర్ సంగీతం వహించాడు. మనోజ్ పరమ హంస ఛాయాగ్రహణం. అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ ‘మాస్టర్’, ‘ఖైదీ’, విక్రమ్’ అందించిన లోకేశ్ కనకారాజ్ దర్శకుడు.
ఈ సినిమా నిడివి కూడా దాదాపు మూడుగంటలు. బాలకృష్ణ, రవితేజ సినిమాలు కూడా దాదాపు మూడు గంటలే. మూడు గంటల హింస వీటిలో ఇమిడివుంటుందన్న మాట.బాలకృష్ణ సినిమాలో మూడు పాటలు, రవితేజ సినిమాలో రెండు పాటలు, విజయ్ సినిమాలో మూడు పాటలు మాత్రమే వుండడంతో ఈ సినిమాలో సాగదీసిన హింసాత్మక దృశ్యాలు వుంటాయని ఊహించ వచ్చు. యాక్షన్ పార్టు ఎంత బారుగా వుంటే యాక్షన్ డైరెక్టర్లకి అంత ఎక్కువ పని. తక్కువ టాకీపార్టుతో డైరెక్టర్లకే తక్కువ పని. ఈ తక్కువ టాకీ పార్టులో వున్న కథయినా కథలాగా వుంటే అదే దివ్యామృతం పండగ ప్రేక్షకులకి!