నవ యవ్వనుడిగా వస్తున్నాడు రజనీ!
లోకేష్ కనకారాజ్ దర్శకత్వంలో ‘తలైవర్ 171’ లో నటించేందుకు రజనీ సిద్ధమవుతున్నారు. ఇందులో 73 ఏళ్ళ రజనీ నవయవ్వనుడిగా కనిపించబోవడం అభిమానుల్లో సంచలనం సృష్టిస్తోంది.
‘జైలర్’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 170 వ మూవీ ‘వెట్టైయన్’ చిత్రీకరణలో బిజీగా వున్నారు. దీనికి ప్రముఖ నిర్మాత టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం. దీని తర్వాత లోకేష్ కనకారాజ్ దర్శకత్వంలో ‘తలైవర్ 171’ లో నటించేందుకు రజనీ సిద్ధమవుతున్నారు. ఇందులో 73 ఏళ్ళ రజనీ నవయవ్వనుడిగా కనిపించబోవడం అభిమానుల్లో సంచలనం సృష్టిస్తోంది. దీన్ గురించి ఇటీవలి అప్‌డేట్ ప్రకారం, రజనీకాంత్ స్క్రీన్‌పై యంగ్‌గా కనిపించడానికి మేకర్స్ డీ -ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్టు పేర్కొన్నారు.
యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇంటర్వ్యూల్లో, ఇతర ఈవెంట్లలో ‘తలైవర్ 171’ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాదని చెప్పాడు లోకేష్ కనకారాజ్. కొత్త తరంలో భారీ బడ్జెట్ మాస్-యాక్షన్ సినిమాలు తీయడంలో ఇతను ప్రసిద్ది చెందాడు. గత మూవీ విజయ్ నటించిన ‘లియో’ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు రజనీ చేత యువకుడి పాత్ర వేయించి డీ-ఏజింగ్ టెక్నాలజీతో మళ్ళీ ఒకప్పటి సినిమాల్లోని యంగ్ లుక్ రజనీని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నాడు. ‘జైలర్’ లో రజనీ 60 ఏళ్ళ సాధారణ రిటైర్డ్ ఉద్యోగి పాత్రలో కనిపించిన దానికి రివర్స్ లో యంగ్ రజనీ అన్నమాట!
రజనీ తెరపై యువకుడిగా కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ప్రోస్థెటిక్స్ మేకప్ సహాయంతో ‘కబాలి’, ‘కాలా’, ‘రోబో’, ‘దర్బార్’ వంటి సినిమాల్లో యువకుడి పాత్రలో కని పించారు. ప్రోస్థెటిక్స్ మేకప్ వేరు, డీ -ఏజింగ్ టెక్నాలజీ వేరు. ప్రోస్థెటిక్స్ మేకప్ నటుడి ముఖంపై మాన్యువల్ గా చేసేది. డీ -ఏజింగ్ టెక్నాలజీ సీజీఐ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ నుపయోగించి డిజిటల్ గా సృష్టించేది.
ఈ టెక్నాలజీతో ఒక నటుడిని - సాధారణంగా 50, 60 లలో వుండే నటుడ్ని- అతడి 20, 30 లలో వయస్సుకి కుదించి చూపించడమన్నది ఇప్పుడు ఒక బటన్ ని క్లిక్ నొక్కడంతో సమానం. ఇదేమీ కొత్త కాన్సెప్ట్ కానప్పటికీ, సౌత్ లో మొదటిసారిగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ని 2023 లో ‘ఘోస్ట్’ లో ఇలాగే చూపించారు. ఈ టెక్నాలజీ మాయాజాలాన్ని చూసేందుకు అభిమానులు ఎగబడి హిట్ చేశారు.
అయితే అన్ని సార్లూ ఇలా జరిగిందా అంటే హిందీలో జరగలేదు. రెండు సార్లు షారుఖ్ ఖాన్ మీద చేసిన ప్రయోగం విఫలమైంది. ఆ సినిమాలు ఫ్లాపయ్యాయి. అసలు కంప్యూటర్ టెక్నాలజీ సినిమా మేకింగ్‌లోకి రాకముందే మేకప్ ఆర్టిస్టులు, ఇతర సాంకేతిక నిపుణులూ వివిధ విభాగాలని నిర్వహించేవారు. పూర్తిగా పకడ్బందీగా కాకపోయినా, ఒక నటుడిని కొంత వరకు యవ్వనంలో లేదా పెద్ద వయసులో కనిపించేలా చేయడానికి తమ పరిపూర్ణ ప్రతిభని చూపెట్టేవారు. నటుడు లేదా నటిని బాల్యంలో చూపించాల్సి వచ్చినప్పుడు బాలనటుడ్ని లేదా నటిని తీసుకునే వారు. ఆ నటుడు లేదా నటిని ప్రస్తుత వయస్సు కంటే ఎక్కువ వయస్సులో కనిపించేలా చేయడానికి మాత్రం మేకప్ ట్రిక్స్ ఉపయోగించే వారు. అయితే ఈ వయసుపై బడిన మేకప్ తో ప్రేక్షకుల్ని ఒప్పించగలిగేది లోతైన నటనా నైపుణ్యం కలిగిన నటులు మాత్రమే. ఉదాహరణకి ‘ధర్మదాత’ లో ముసలి తండ్రి ఆహార్యంలో అక్కినేని నాగేశ్వరరావు ఆ వయస్సుకి తగ్గ పొల్లు పోని, ప్రతిభావంతమైన నటనతో సినిమాని హిట్ చేశారు- ఎవ్వడి కోసం ఎవడున్నాడు పొండిరా పోండి- హిట్ పాటలో అభినయం సహా.
అయితే ఒక వయసు మీరిన నటుడ్ని ప్రేక్షకులు తేడా గమనించకుండా పరిపూర్ణ యవ్వనుడిగా చూపించడం దాదాపు ఆ రోజుల్లో అసాధ్యమైన పని. ఇలా ఇప్పుడు ఇన్నాళ్ళకి ఇది సాధ్యమవుతోంది. కంప్యూటర్-జనరేటెడ్ ఇమేజరీతో బాటు విజువల్ ఎఫెక్ట్స్ తోడ్పాటుతో డీ-ఏజింగ్ టెక్నాలజీని సినిమాల్లో మొట్టమొదటి సారిగా హాలీవుడ్ మూవీ ‘ఎక్స్-మెన్: ది లాస్ట్ స్టాండింగ్ (2006) లో ఉపయోగించారు (ఏదైనా మొట్టమొదటిసారిగా వాళ్ళే ఉపయోగిస్తారు). తర్వాత ఆస్కార్ అవార్డు పొందిన ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్’ (2008) లో ఉపయోగించారు. హిందీలో షారుఖ్ ఖాన్ 'రా.వన్' లో 2011 లో ప్రయోగించారు. తర్వాత 2016 లో ‘ఫ్యాన్’ లో 20 ఏళ్ళ పాత్రగా చూపించారు. ఇవి ప్రేక్షకులకి నచ్చలేదు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ‘భారత్’ (2019), అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ (2022) కూడా డీ- ఏజింగ్ టెక్నాలజీతో సక్సెస్ కాలేదు. తమిళంలో లోకేష్ కనకరాజే కమల్ హాసన్ ని బ్లాక్ బస్టర్ ‘విక్రమ్’ (2022) లో డీ- ఏజింగ్ టెక్నాలజీతో యంగ్ గా చూపించాలనుకుని, క్వాలిటీ సరిగా లేకపోవడంతో దాన్ని విరమించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన తెలుగు ‘ఆచార్య’ (2022) లో ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశంలో ఈ టెక్నాలజీతో యంగ్ గా చూపించారు. ఇది కూడా ఫ్లాపయ్యింది.
డీ-ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించిన సినిమాలన్నీ మన దేశపు బాక్సాఫీసులో ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి. ఇప్పుడు రజనీకాంత్ తో ఏమవుతుందో చూడాలంటే 2025 వరకూ అగాలి. యంగ్ హీరోని ముసలి మేకప్ తో చూపిస్తే మొదట్నుంచీ ప్రేక్షకులు ఆదరించారు. కానీ వయసు మీదబడి ఈ ఫేసుకి ఓ పదేళ్ళ పాటు అలవాటు పడిన ప్రేక్షకులకి, 20 ఏళ్ళ ఫేసుతో చూపిస్తే జీర్ణించుకోలేని సైకాలజీ ఏదో పనిచేస్తున్నట్టుంది. 60 ఏళ్ళ వయసులో 20 ఏళ్ళ హీరోయిన్ తో డాన్సుల్ని ఎంజాయ్ చేసే ప్రేక్షకులు, 60 ఏళ్ళ హీరోని 20 ఏళ్ళ హీరోగా చూపిస్తే కెమిస్ట్రీ మానసిక కారణాల వల్ల వర్కౌట్ కావడం లేదని భావించాలేమో. గతంలో రజనీతో ఇంకో ప్రయోగం చేశారు- ‘కొచ్చాడయన్’ లో నిజ రజనీ కాకుండా పూర్తిగా త్రీడీ యానిమేషన్లో చూపించి భారీ స్థాయిలో చేతులు కాల్చుకున్నారు. టాప్ రేటుకి తెలుగులో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత ఆస్తులు పోగొట్టుకుని కనుమరుగయ్యాడు.