Telugu Movies | ఏ విషయ ప్రచారం కోసం తెలుగు సినిమాలు?

Telugu Movies | వందేళ్ళ క్రితం 1921 లో తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడి కుమారుడు, లండన్ లో శిక్షణ పొంది వచ్చిన ప్రకాష్, ‘భీష్మ ప్రతిజ్ఞ’ అనే మూకీని తొలి తెలుగు సినిమాగా జాతికి అందించి చరిత్ర పుటలకెక్కారు.

Advertisement
Update:2023-07-30 19:27 IST

ఏ విషయ ప్రచారం కోసం తెలుగు సినిమాలు?

వందేళ్ళ క్రితం 1921 లో తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడి కుమారుడు, లండన్ లో శిక్షణ పొంది వచ్చిన ప్రకాష్, ‘భీష్మ ప్రతిజ్ఞ’ అనే మూకీని తొలి తెలుగు సినిమాగా జాతికి అందించి చరిత్ర పుటలకెక్కారు. తర్వాత టాకీలు ప్రారంభమయ్యాక, 1931 లో హెచ్ ఎం రెడ్డి ‘భక్త ప్రహ్లాద’ తో పౌరాణికాల ట్రెండ్ సెట్ చేశారు. 1937 వరకూ ‘పాదుకా పట్టాభిషేకం’, ‘శకుంతల’, ‘సావిత్రి’, ‘లవకుశ’, ‘సీతా కళ్యాణం’ ... ఇలా 47 వరకూ పౌరాణికాలే రాజ్యమేలాయి. ఈ ట్రెండ్ కి గూడవల్లి రామబ్రహ్మం ‘మాలపిల్ల’ తో ముగింపు పలికారు. రామబ్రహ్మంకి నాటి జాతీయోద్యమాలతో బలీయమైన సంబంధం వుండడంతో, వాటి ప్రభావానికి లోనై, తెలుగు సినిమాలు సంఘ సంస్కరణకి తోడ్పడాలన్న ధ్యేయాన్ని ఏర్పరచుకుని, 1938లో ‘మాలపిల్ల’ నిర్మించారు. సమాజంలో పాతుకుపోయిన అంతరానితనం మీద కొరడా ఝళిపిస్తూ, ఒక సనాతన బ్రాహ్మణుడు మాలపిల్లని ప్రేమించి పెళ్ళి చేసుకునే ఇతివృత్తంతో, ఈ ప్రసిద్ధ సినిమా నిర్మించి తెలుగు సినిమాని అభ్యుదయ పథం వైపు నడిపించారు.

అలాగే 1939 లో జమీందారీ వ్యవస్థకి వ్యతిరేకంగా ‘రైతుబిడ్డ’ అనే మరో అభ్యుదయ చిత్రాన్ని అందించారు. రామబ్రహ్మం మార్గాన్ని అంది పుచ్చుకుని బి ఎన్ రెడ్డి ‘వందేమాతరం’ ని, సి పుల్లయ్య ‘వర విక్రయం’ నీ నిర్మించి తెలుగు వెండి తెరని మరింత ప్రకాశమానం చేశారు.

తర్వాతి దశాబ్దంలో, అంటే 1940 లలో సామాజిక ప్రయోజనం గల సినిమాల పరంపర ఇంకా ముందుకు సాగింది. వితంతు వివాహ సమస్యతో బి ఎన్ రెడ్డి నిర్మించిన ‘సుమంగళి’, మద్యపాన సమస్యపై హెచ్ ఎం రెడ్డి నిర్మించిన ‘గృహాలక్ష్మి’ ముఖ్యమైనవి. ఇలా 1931 - 51 మధ్య తెలుగు సినిమా తొలి స్వర్ణయుగం పౌరాణికం, దేశం, సమాజం చుట్టూ పరిభ్రమించింది.

1951 -71 మధ్య మలి స్వర్ణయుగంలో కుటుంబసినిమాలు, పౌరాణికాలు, భక్తి, జానపద సినిమాలూ, క్రైమ్, యాక్షన్, వాస్తవిక సినిమాలుగా సాగేక- 1971- 91 మధ్య పూర్తిగా వ్యాపారమయమైపోయింది. ఈ వ్యాపార యుగం ‘దసరాబుల్లోడు’ తో ప్రారంభమై ‘శివ’ దాకా సాగింది. ఈ వ్యాపారయుగంలో అన్నిరకాల సినిమాలూ వచ్చి చేరాయి, నక్సల్ ఉద్యమ సినిమాలు సహా. ఇక 1991 నుంచీ నేటి వరకూ ఆధునిక వ్యాపారయుగం సాగుతోంది.

ఈ ఆధునిక వ్యాపార యుంగంలో టీనేజీ లవ్, యాక్షన్, ఫ్యాక్షన్, బయోపిక్, దేశ భక్తి మొదలైన వాటి మీదుగా సాగి ప్రాపగండా సినిమాల దగ్గరికొచ్చి ఆగాయి- ‘ఆర్ ఆర్ ఆర్’ తో, ‘కార్తికేయ 2’ తో, ‘స్పై’ తో, ‘ఆది పురుష్’ తో.

ఈ ప్రాపగండా సినిమాలు బీజేపీ జాతీయవాద, మతతత్వ రాజకీయాలకి ప్రచార సినిమాలుగా పనిచేస్తున్నాయి. ఇది బాలీవుడ్ నుంచి మొదలైంది- ‘కాశ్మీర్ ఫైల్స్’ తో, ‘కేరళ స్టోరీ’ తో, ఇంకా కొన్ని చారిత్రక సినిమాలతో. వీటి ఆర్ధిక విజయాలు చూసి ఇదే బాట పట్టడం మొదలెట్టారు తెలుగు నిర్మాతలు. అతి దేశభక్తి, మతభక్తి సినిమాల పట్ల ప్రేక్షకుల సెంటిమెంటు మొగ్గు చూపుతోందని గ్రహించిన కొందరు తెలుగు నిర్మాతలు దీన్ని సొమ్ము చేసుకోవాలని ప్రాపగండా సినిమాల వెంట పడ్డారు. అలాటి కథలే కావాలని అడుగుతున్నారు.

‘అర్జున్ రెడ్డి’ హిట్టయినప్పుడు కూడా అలాటి కథల వేటలో పడ్డారు. ఏది సంచలన విజయం సాధిస్తుందో దాన్ని పట్టుకోవాలన్న తాపత్రయం తప్ప, నక్సల్ సినిమాలు ఆడిన కాలంలో నక్సల్ సినిమాలూ తీశారు. ఇప్పుడు ప్రచార సినిమాలు ఆడుతున్నాయని వీటి పనిబడుతున్నారు. తెలుగు నిర్మాతలకి నిజానికి హిందీ ప్రచార సినిమాల్లాగా సమాజంలో విషం చిమ్మాలన్న ఉద్దేశం లేదు. టాలీవుడ్‌ ని కాషాయీకరణ చేస్తున్నారని నార్త్ మీడియాలో వస్తున్న వ్యాసాల్లో నిజం లేదనే అనుకోవాలి.

ఇక పానిండియా స్టార్స్ అనే ట్యాగ్‌ని సంపాదించిన ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల సరసన ఇప్పుడు నిఖిల్ సిద్ధార్థ చేరాడు. అయితే ‘కార్తికేయ 2’, స్పై’ అనే ప్రచార సినిమాలతో ఉత్తరాదిలో ఫ్యాన్స్ ని సంపాదించుకున్న నిఖిల్, తన మీద హిందుత్వవాది ముద్ర వేసినా అభ్యంతరం చెప్పడం లేదు. ఇదే తనకి వర్కౌటవుతోంది మరి!

‘కార్తికేయ 2’ లో శ్రీ కృష్ణుడ్ని పురాణ పాత్రగా చూపకుండా చారిత్రక పురుషుడుగా చూపించి ఉత్తరాదిలో జేజేలందుకున్నాక, ‘స్పై’ లో స్వాతంత్ర్య సమర యోధుడు, ఆరెస్సెస్ వ్యతిరేకి, సుభాష్ చంద్రబోస్ రహస్య మరణం చుట్టూ దాచిన రహస్యాలు వెల్లడించే సినిమా నటించాడు. ఇప్పుడు లండన్‌లో ఆరెస్సెస్ నాయకుడు వీర్ సావర్కర్ కార్యకలాపాల ఆధారంగా ‘ది ఇండియా హౌస్’ లో నటిస్తున్నాడు.

ఇక సీనియర్ రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ అయితే బిజెపికి సైద్ధాంతిక మాతృ సంస్థ ఆరెస్సెస్ ని కీర్తిస్తూ సినిమాని, వెబ్ సిరీస్‌లనూ వ్రాయనున్నట్టు ప్రకటించారు. ఇక్కడితో ఆగలేదు- ‘కాశ్మీర్ ఫైల్స్’ ని చూసి తెలంగాణలో కూడా ఒక ఫైల్స్ తీయాలని రజాకార్ల కథ అందుకుని విడుదలకి సిద్ధం చేస్తున్నారు వేరే నిర్మాతలు. దీని పోస్టర్ అత్యంత అభ్యంతరకరంగా వుందని కూడా విమర్శలొచ్చాయి.

ఇదేగాకుండా ఇంకో రజాకార్ల సినిమా భారీ యెత్తున తెర కెక్కించే ప్రయత్నాలు సాగుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ తో బాలీవుడ్ నిర్మాతలు తీస్తున్నారు. ఒక తమిళ స్టార్ ని కూడా అడిగితే డేట్స్ లేవు. అయితే ఈ రజాకార్ల సినిమాని పొడిగించి అప్పట్లో కేంద్రం తీసుకున్న పోలీస్ యాక్షన్ ని కూడా చూపిస్తామని దర్శకుడు చెబితే, పోలీస్ యాక్షన్ లో లక్షల మంది ముస్లిములు కూడా చనిపోయారు కదా అంటే, అది కూడా చూపిస్తామని, నిజాం చేసిన మంచి పనులు కూడా చూపిస్తామనీ ఈ వ్యాసకర్తతో చెప్పాడు దర్శకుడు!

ఇలా వందేళ్ళ క్రితం భక్తి రసంలో ముంచెత్తే సినిమాలుగా తెలుగు పౌరాణికాలు ప్రారంభమైతే, ఇప్పుడు ‘ఆదిపురుష్’ లాంటి విభజన వాద ప్రాపగండా పౌరాణికాలుగా తీస్తున్నారు. తొలి స్వర్ణయుగంలో జాతీయోద్యమ, సమాజ సంస్కరగణ ధ్యేయాలతో తెలుగు సాంఘీక సినిమాలని నిర్మిస్తే, ఇప్పుడు సమాజాన్ని చీల్చే సామాజిక భక్తి లేని వూర దేశభక్తి సినిమాల్ని, మతవిద్వేష సినిమాల్నీ నిర్మిస్తున్నారు.

దేశంలోని ఇతర ప్రాంతాల ప్రేక్షకులకి కూడా నచ్చే కథలతో ముందుకు రావాలని దర్శకుల్ని ప్రత్యేకంగా అడుగుతున్న నిర్మాతలు వున్నారు. ప్రబలంగా వున్న రైట్ వింగ్ సెంటిమెంట్‌ ని క్యాష్ చేసుకునే సినిమాలు వారికి కావాలి. దేశం ఏమైపోయినా ఫర్వాలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయవాద, మతపర, విద్వేషపూరిత ఉద్రేకాలు వ్యాపించి వున్నాయని భావిస్తూ ఈ పరిస్థితిని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు.

కానీ ఇప్పుడు మోడీ మ్యాజిక్, హిందుత్వ మంత్రం ఏవీ పనిచేయవని సాక్షాత్తూ ఆరెస్సెస్ పత్రికే తేల్చేసిన విషయాన్ని కూడా పరిశీలించుకోవాలి నిర్మాతలు. బరితెగింపుగా తీసిన ‘ఆదిపురుష్’ తోనే ప్రచార సినిమాలంటే వెగటు పుట్టింది ప్రేక్షకులకి. దీని ప్రభావంతో ’72 హూరే’ కి నమస్కారం పెట్టేశారు. ఇంతేగాకుండా 2024 ఎన్నికలకి ఇంకా 10 నెలలు కూడా సమయం లేదు. ఈలోగా ప్రచార సిమాలు తీసి కాస్తోకూస్తో సొమ్ముచేసుకునే అవకాశం వుంటుందో లేదో?

Tags:    
Advertisement

Similar News