Tarakarama Theatre: తారకరామ థియేటర్ తిరిగి ప్రారంభం.. దీని వెనుక ఉన్న చరిత్ర తెలుసా?

Asian Tarakarama Cineplex: 1991లో రాజీవ్ గాంధీ హత్య అనంతరం ప్రతిపక్ష నాయకుల ఆస్తులపై దాడులు జరిగాయి. అప్పుడు జరిగిన అల్లర్లలో కొందరు తారకరామ థియేటర్‌ను నాశనం చేశారు.

Advertisement
Update:2022-12-14 19:23 IST

నందమూరి కుటుంబానికి చెందిన తారకరామ థియేటర్‌ను మూడో సారి తిరిగి ప్రారంభించారు. కాచిగూడలోని ఈ థియేటర్‌ను 'ఏషియన్ తారకరామ'గా పునరుద్దరించారు. బుధవారం దీనిని నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. అమ్మ, నాన్న పేర్లు కలిసి వచ్చేలా కట్టిన దేవాలయం ఈ థియేటర్ అని బాలకృష్ణ చెప్పారు. సునీల్ నారంగ్ అందరికీ అందుబాటులో ఉండే రేట్లతో థియేటర్‌ను నడుపుతామని చెప్పడం సంతోషమని అన్నారు. ఓటీటీ రూపంలో పరిశ్రమ పోటీని ఎదుర్కుంటున్న సమయంలో ఇలా టికెట్లు అందుబాటు ధరలో ఉంచడం అభినందనీయమని చెప్పారు. సునీల్ నారంగ్ వాళ్ల నాన్న నారాయణ్ కే. దాస్ నారంగ్, మా నాన్న ఎన్టీఆర్ మంచి స్నేహితులని గుర్తు చేశారు.

తారకరామ చరిత్ర ఇది..

హైదరాబాద్‌లోని కాచిగూడ చౌరస్తా సమీపంలో 70వ దశకంలో కొంత మంది పేదలు నివాసం ఉండేవాళ్లు. అక్కడ వాళ్లు తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తూ ఉండేవారు. అయితే వారిని బలవంతంగా ఖాళీ చేయించి.. ఆ స్థలాన్ని సొంతం చేసుకొని ఈ థియేటర్ నిర్మించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన 'అక్బర్ సలీం అనార్కిలి' సినిమాతో ఈ థియేటర్‌ను ప్రారంభించాలని భావించారు. థియేటర్ నిర్మాణం ఆలస్యం కావడంతో ముందుగా ఆ సినిమాను ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో విడుదల చేశారు. 1978లో 'తారకరామ' పూర్తయిన తర్వాత నైజాంలో సినిమాను విడుదల చేశారు. అయితే ఈ థియేటర్లో ఆ సినిమా కేవలం 22 రోజులు మాత్రమే ఆడింది. మొత్తానికి మొదటి సినిమా ఫ్లాప్‌గా నిలిచింది.

ఆ తర్వాత ఈ థియేటర్‌లో రెగ్యులర్‌గా తెలుగు, హిందీ సినిమాలు నడిచేవి. అమితాబచ్చన్ నటించిన 'డాన్' సినిమా 525 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఆ థియేటర్‌లో ఎక్కువ రోజులు ప్రదర్శించబడిన సినిమా అదే. ఇక 'గీతాంజలి' సినిమా 225 రోజులు.. మంగమ్మగారి మనుమడు, మన్నెలో మొనగాడు, నాగదేవత, అత్తకుయముడు అమ్మాయికి మొగులు, రాజా హిందుస్తానీ, భారతీయుడు సినిమాలు 175 రోజుల పాటు నడిచాయి. అంకుశం 156 రోజులు, శ్రీమతి ఒక బహుమతి 125 రోజులు, జీన్స్ 120 రోజులు, హమ్ సాథ్ సాథ్ హై 112 రోజులు నడిచాయి.

1991లో రాజీవ్ గాంధీ హత్య అనంతరం ప్రతిపక్ష నాయకుల ఆస్తులపై దాడులు జరిగాయి. అప్పుడు జరిగిన అల్లర్లలో కొందరు తారకరామ థియేటర్‌ను నాశనం చేశారు. పూర్తిగా ధ్వంసం అయిన ఈ థియేటర్ చాన్నాళ్ల పాటు మూతపడింది. 1995లో తిరిగి పునరుద్దరించి ప్రారంభించారు. అప్పటికే చుట్టుపక్కల కొత్త థియేటర్లు రావడంతో ఈ హాలుకు రావడానికి ప్రేక్షకులు ఇష్టపడలేదు. దీంతో దీన్ని బీ-సెంటర్‌గా మార్చేశారు. తారకరామ థియేటర్లో తెలుగు సినిమాలు చూసే వాళ్లు కరువవడంతో చౌకబారు ఇంగ్లీష్, మళయాల బూతు చిత్రాలు ప్రదర్శించడం మొదలు పెట్టారు.

పూర్వవైభవం పూర్తిగా కోల్పోయిన ఈ థియేటర్‌ను కొన్నేళ్ల క్రితం ఏషియన్ సినిమాస్ వాళ్లు లీజుకు తీసుకున్నారు. స్క్రీన్, సౌండ్ సిస్టమ్, సీట్లు, ఇంటీరియర్స్ మార్చి 1200 సీట్ల కెపాసిటీని 975కి కుదించి తిరిగి 2013 జనవరి 9న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో ఉరి - ది సర్జికల్ స్ట్రైక్ 73 రోజులు, బిచ్చగాడు 54 రోజులు, మహర్షి 50 రోజులు, బదాయి హో 49 రోజులు, అల వైకుంఠపురంలో 43 రోజులు, 2.0 42 రోజులు ఆడాయి.

కరోనా సమయంలో థియేటర్ మూతపడటంతో భారీగా నష్టాలు వచ్చాయి. ఇందులో దాదాపు 1000 సీట్లు ఉండటం కూడా ఏషియన్ వారికి భారంగా మారింది. ఆ మేరకు సీట్లకు ట్యాక్స్ కడుతుండటం.. ప్రేక్షకుల రద్దీ తగ్గడంతో మరోసారి రినోవేట్ చేశారు. 4కే ప్రొజెక్షన్, సుపీరయర్ సౌండ్ సిస్టమ్‌తో 590 సీటింగ్ కెపాసిటీతో థియేటర్‌ను పునరుద్దరించారు. ఈ నెల 16న అవతార్-2 సినిమాతో థియేటర్‌లో ప్రదర్శనలు మొదలు కానున్నాయి. సంక్రాంతికి విడుదలయ్యే 'వీరసింహారెడ్డి' కూడా తారకరామలో ప్రదర్శించనున్నట్లు తెలుస్తున్నది. 

Tags:    
Advertisement

Similar News