SreeLeela | అస్సలు తగ్గేదేలే
SreeLeela - వరుసగా ఫ్లాపులొస్తున్నప్పటికీ శ్రీలీల తన రెమ్యూనరేషన్ ను కాపాడుకుంటూ వస్తోంది. దీనికి కారణం ఏంటి?
కెరీర్ స్టార్ట్ చేసి పట్టుమని ఐదేళ్లు కూడా కాలేదు. అప్పుడే అగ్రస్థానానికి ఎగబాకింది శ్రీలీల. అంతేకాదు, ఈ ఐదేళ్లలో 30 లక్షల రెమ్యూనరేషన్ నుంచి ఏకంగా కోటి 20 లక్షలు పారితోషికం అందుకునే స్థాయికి చేరిపోయింది. పెళ్లి సందడి సినిమాలో శ్రీలీలకు 30 లక్షలు ఇచ్చారు. అదే ఆమెకు తెలుగులో తొలి సినిమా.
అంతకంటే ముందు కన్నడలో ఆమె నటించింది. అందుకే ఆమెకు 30 లక్షలిచ్చారు. పెళ్లి సందడి తర్వాత శ్రీలీలకు అమాంతం అవకాశాలు పెరిగాయి. దీంతో నిర్మాతలే ఆమెకు 50 లక్షలు ఫిక్స్ చేశారు. ఆ తర్వాత 50 లక్షల నుంచి 75 లక్షలు లాక్ అయింది.
ఏడాది కిందటే ఆమె కోటి రూపాయల మార్క్ అందుకుంది. ఆ వెంటనే తన రెమ్యూనరేషన్ కోటి 20 లక్షల రూపాయలకు చేరుకుంది. శ్రీలలకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసిన సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్. ఇప్పుడు అదే సంస్థ, శ్రీలలకు కోటి 20 లక్షల రూపాయలు అందిస్తోంది.
విజయ్ దేవరకొండ హీరోగా సినిమా నిర్మిస్తున్న ఈ సంస్థ, అందులో హీరోయిన్ గా శ్రీలీలను అనుకుంది. అగ్రిమెంట్ కూడా పూర్తయింది. కాకపోతే ఆ సినిమా కోసం ఆమెను తీసుకోవడం లేదు. అగ్రిమెంట్, అడ్వాన్స్ మాత్రం అలానే ఉంచారు. మరో సినిమాలో శ్రీలలను తీసుకుంటున్నారు. ఓవైపు ఫ్లాపులొస్తున్నప్పటికీ శ్రీలీల పారితోషికం తగ్గలేదంటే దానికి కారణం ఇదే.