ఒకే టికెట్ విధానం మనకి వర్కౌట్ కాదు!

గత ఫిబ్రవరిలో అమెరికాలోని అతి పెద్దదైన ఏఎంసీ (అమెరికన్ మల్టీ సినిమా) థియేటర్స్ గ్రూపు ప్రవేశపెట్టిన కొత్త సినిమా టికెట్ల బుకింగ్ విధానం విమర్శల పాలు కావడంతో ఈ వారం ఉపసంహరించుకుంది.

Advertisement
Update:2023-07-27 20:10 IST

ఒకే టికెట్ విధానం మనకి వర్కౌట్ కాదు!

గత ఫిబ్రవరిలో అమెరికాలోని అతి పెద్దదైన ఏఎంసీ (అమెరికన్ మల్టీ సినిమా) థియేటర్స్ గ్రూపు ప్రవేశపెట్టిన కొత్త సినిమా టికెట్ల బుకింగ్ విధానం విమర్శల పాలు కావడంతో ఈ వారం ఉపసంహరించుకుంది. దీని ప్రభావం మన దేశంలో మల్టీప్లెక్స్ టికెట్ల విధానంపై పడుతుందా అనేది చూడాల్సి వుంది. ముందు సీట్లు తక్కువ ధరలో, మధ్య సీట్లు ఇంకో ధరలో, పూర్తిగా వెనుక సీట్లు ఇంకా ఎక్కువ ధరలో వుండే లొకేషన్ ఆధారిత టైర్డ్ సీట్ ప్రైసింగ్ (తరగతుల వారీ టికెట్ల బుకింగ్) విధానం ఏఎంసీ ప్రవేశపెట్టినప్పుడు ప్రేక్షకులు అసంతృప్తి చెందారు. ఈ అసంతృప్తి పెరిగి పెరిగి ఒక పెద్ద హాలీవుడ్ నటుడు సహా ప్రేక్షకులు సోషల్ మీడియాలో ‘మీ రోజులు దగ్గర పడ్డాయి’ అని ఏఎంసీ ని హెచ్చరించేదాకా విమర్శలు వెల్లువెత్తడంతో, ఏఎంసీ చప్పున వెనక్కు తగ్గింది.

ఈ కొత్త బుకింగ్ విధానాన్ని ‘సైట్‌లైన్ ఎట్ ఏఎంసీ’ పేరిట పరిచయం చేసింది. ఇది మూడు అంచెల టిక్కెట్ ధరల్ని కలిగి వుంది. అత్యంత సాధారణ శ్రేణి ‘స్టాండర్డ్ సైట్‌లైన్’ ముందు వరసలో, ‘ప్రివర్డ్ సైట్ లైన్’ మధ్య వరసలో. ‘వేల్యూ సైట్ లైన్’ వెనుక వరుసలో నిర్ణయించింది. అయితే ముందు వరస సీట్లు స్టబ్స్ సబ్‌స్క్రిప్షన్ సభ్యులకు మాత్రమే అందుబాటులో వుంచింది. ఈ మొత్తం విధానాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన కొన్ని కేంద్రాల్లో ప్రవేశ పెట్టింది. సంవత్సరం చివరి నాటికి అన్ని దేశీయ ఏఎంసీ కేంద్రాల్లో అమలు చేయాలని భావించింది..

సైట్‌లైన్‌ని అందించే థియేటర్‌లు ఆన్‌లైన్‌లో, ఏఎంసీ యాప్‌లో, బాక్సాఫీసులో టిక్కెట్ కొనుగోలు ప్రక్రియ సమయంలో, ప్రతి సీటింగ్ ఎంపికని స్పష్టంగా వివరించే వివరణాత్మక సీట్ మ్యాప్‌ ని కూడా అందించింది. అయితే ఈ ప్రయోగం ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా బెడిసి కొట్టింది ప్రేక్షకుల తిరుగుబాటుతో.

ఇప్పుడు ఈ టైర్డ్ సీట్ ధరల విధానాన్నిఏఎంసీ రద్దు చేసి వుండొచ్చు- కానీ మన దేశంలో థియేటర్‌లకి సంబంధించినంత వరకూ ఇది కొత్త విషయం కాదు. దేశంలో మల్టీప్లెక్స్‌లు రాకముందే, బాల్కనీ, బాక్స్, ఫస్ట్-క్లాస్, బెంచీ క్లాసు కేటగిరీలు వున్నాయి.

ఇంకా చాలా పూర్వం ఇసుక వేసిన నేల క్లాసు కూడా వుండేది పావలాకి. ఈ వివిధ క్లాసుల వేర్వేరు టికెట్ల ధరలు మన సామాజిక ఆర్ధిక పరిస్థితులకి ఆచరణీయంగానే వుండేవి, ఇప్పటికీ వున్నాయి.

ఇక దేశంలో బ్రాండెడ్ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ చైన్‌లు వచ్చిన తర్వాత కూడా, డిఫరెన్షియల్/టైర్డ్ మూవీ టిక్కెట్ ధరల విధానం అంతం కాలేదు. ఇప్పటికీ ప్రేక్షకులు వెనుక వరుసలో వుండే సీట్లకి ప్రీమియం ఛార్జీని చెల్లించడానికి సిద్ధంగా వున్నారు. దీంతో మూడు క్లాసులు ఏర్పడ్డాయి. వెనుక, మధ్య, ముందు క్లాసులు. సగటున చూస్తే వెనుక వరుస రూ. 350, మధ్య వరుస రూ. 300, ముందు వరుస రూ. 200 గా వున్నాయి. ఈ మధ్య కొన్ని మల్టీప్లెక్సుల్లో రూ. 200 ముందు వరసని రెండుగా విభజించారు. పూర్తిగా మెడ పైకెత్తి చూడాల్సిన ముందు రెండు వరసల్ని అల్పాదాయ వర్గాల కోసం టికెట్టు ధర రూ. 150 గా నిర్ణయించారు.

ఈ మధ్య విడుదలైన హాలీవుడ్ 'ఓపెన్‌హైమర్' మూవీ టికెట్లు వెనుక వరుసకి ఇంకా పెంచి అమ్మారు. ఎంత పెంచినా అమెరికాలో లాగా మనవాళ్ళు గొడవ చెయ్యరు. బెనిఫిట్ షోలకే వేలకి వేలు పెట్టి టికెట్లు కొనే సదాచారం మనది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఏఎంసీ చేసిన పనిని మన థియేటర్లు చేయాలా? మన థియేటర్లు తరగతుల వారీ టిక్కెట్ ధరల పద్ధతిని విరమించుకోవాలా? సినిమా హాళ్ళలో సినిమా టిక్కెట్ ధరలు కాలం చెల్లిన టిక్కెట్ ధరల విధానాన్ని అనుసరించకూడదు. ఎందుకంటే ఇది పక్షపాతంగా, అన్యాయంగా, వివక్షతతో కూడినదిగా అన్పిస్తుంది.

అయితే బ్రాండెడ్ మల్టీప్లెక్సుల్లో సినిమా టిక్కెట్టు కొనుగోలు చేయలేని ఒక వర్గం ప్రేక్షకులు వుండ వచ్చని, తక్కువ ధరతో ముందు వరుస సీట్లు అక్కడ సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తాయనీ కూడా అన్పించ వచ్చు. అంతేకాకుండా అమెరికన్లకి, మనకి ప్రేక్షకుల మధ్య కొనుగోలు శక్తిలో / తలసరి ఆదాయంలో భారీ వ్యత్యాసం వుంది.

మన ప్రేక్షకులకి ఇప్పుడున్న పద్ధతే నచ్చుతుంది. మల్టీప్లెకుల్లో అన్ని సీట్లకీ ఒకే ధర వసూలు చేస్తే, వెనుక వరుసలో మాస్ ప్రేక్షకుడు వచ్చి క్లాస్ ప్రేక్షకుడి పక్కన కూర్చుంటే క్లాస్ ప్రేక్షకుడికి మండిపోతుంది. ఇక మల్టీప్లెక్సుకి వెళ్ళడం మానేస్తాడు. ఇంట్లోనే ఓటీటీలో చూసుకుంటాడు.

Tags:    
Advertisement

Similar News