హీరో కు నిరసన సెగ.. ప్రెస్ మీట్ నుంచి వాకౌట్
Siddharth - కావేరీ జలాల నిరసన సెగ హీరో సిద్దార్థ్ ను తాకింది. బెంగళూరులో ఆయన ప్రెస్ మీట్ ను నిరసనకారులు అడ్డుకున్నారు.
కావేరీ నదీజలాల వివాదం సినిమాలనూ తాకింది. ఈ సీజన్ లో ఆ నిరసన సెగ ఎదుర్కొన్న తొలి నటుడు సిద్దార్థ్. తన కొత్త సినిమా ప్రచారం కోసం బెంగళూరు వెళ్లిన సిద్ధార్థ్ ను నిరసనకారులు అడ్డుకున్నారు. తమిళనాడుతో తమకున్న రాజకీయ వివాదాన్ని సిద్దార్థ్ సినిమాపై రుద్దే ప్రయత్నం చేశారు.
సరిగ్గా ప్రెస్ మీట్ ప్రారంభానికి ముందు నిరసనకారులు, సభలోకి ఎంటరయ్యారు. సిద్దార్థ్ ను మాట్లాడనివ్వలేదు. కొద్దిసేపు ఎదురుచూసిన సిద్దార్థ్ కు విషయం అర్థమైంది. వెంటనే అక్కడ్నుంచి లేచి వెళ్లిపోయాడు. సిద్దార్థ్ సినిమా నుంచి మొదలైన ఈ నిరసన సెగ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.
త్వరలోనే తమిళ హీరో విజయ్ నటించిన లియో సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. ఆ సినిమాను కూడా రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించారు నిరసనకారులు. చూస్తుంటే, కొన్నాళ్ల పాటు కన్నడనాట తమిళ సినిమాలకు నిరసన సెగ తప్పేలా లేదు.
జరిగిన ఘటనపై నటుడు ప్రకాష్ రాజ్ బాధ వ్యక్తం చేశాడు. రాజకీయ నాయకుల్ని ప్రశ్నించాల్సిన నిరసనకారులు, ఇలా నటుల్ని అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నాడు. ఓ కన్నడ పౌరుడిగా చింతిస్తున్నానంటూ, సిద్దార్థ్ కు క్షమాపణలు చెప్పాడు. కావేరీ జలాల వివాదానికి సంబంధించి ఈరోజు కన్నడనాట బంద్ కు పిలుపునిచ్చారు. ప్రస్తుతం కొన్ని బస్సులు తిరుగుతున్నప్పటికీ, ప్రజలెవ్వరూ బయటకురాలేదు.