Siddhardha - డబ్బుకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వడంట
Siddhardha - డబ్బు కి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనంటున్నాడు సిద్ధార్థ్. తనది చాలా సింపుల్ లైఫ్ స్టైల్ అంటున్నాడు.
తను డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వనంటున్నాడు హీరో సిద్దార్థ్. డబ్బు ఉంటేనే సంతోషంగా ఉంటామనే కాన్సెప్ట్ కు తాను వ్యతిరేకం అని చెబుతున్నాడు. చిన్న చిన్న విషయాల్లో కూడా తను ఆనందం వెదుక్కుంటానని అంటున్నాడు.
"ఈ తరంలో డబ్బు సంపాదించాలనే ఆశ ఎక్కువగా కనిపిస్తోంది. సెలబ్రిటీల విపరీత సంపాదన అందరికీ తెలిసిందే. అయితే, నేను పెరిగిన విధానం వేరు. డబ్బు కంటే ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది నా పాలసీ. మ్యూజిక్ తో పాటు, చిన్న చిన్న విషయాల్లో నేను ఆనందాన్ని వెతుక్కుంటాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న రోజుల్లో కేవలం 2వేలు మాత్రమే ఇచ్చేవారు. అందులోంచి పెట్రోల్ కు 160 రూపాయలు అయిపోయేవి. అయినా అప్పుడు నేను ఆనందంగానే ఉన్నాను. నేను సాధారణ విషయాల్లో ఆనందం, సంతృప్తి పొందుతాను. కోరుకున్నప్పుడల్లా ప్రశాంతంగా నిద్రపోతాను. కాలేజీ రోజుల్లో నాటి పాత దుస్తులనే ఇప్పటికీ ధరిస్తున్నాను."
ఇలా తను డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వననే విషయాన్ని బయటపెట్టాడు సిద్దార్థ్. ఎప్పటికీ గుర్తిండిపోయే చిత్రాన్ని రూపొందించాలనేది తన కల అని.. అదే తన డ్రీమ్ ప్రాజెక్టు అని తెలిపాడు. తన డ్రీమ్ ప్రాజెక్టుకు 'చిన్నా' అనే టైటిల్ పెట్టాడు. దీంట్లో నటించడంతో పాటు, స్వయంగా తనే నిర్మిస్తాడట. ఆ సినిమాతో ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకుంటానని నమ్మకంగా చెబుతున్నాడు సిద్దార్థ్.
ఈ హీరో నటించిన టక్కర్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాతో తను బౌన్స్ బ్యాక్ అవ్వడం గ్యారెంటీ అంటున్నాడు సిద్ధూ.