భారీ పారితోషికాలు.. సీనియర్లు కూడా సై

మహేష్, పవన్, ప్రభాస్ లాంటి హీరోల పారితోషికాలు చుక్కల్ని తాకాయనే విషయం అందరికీ తెలిసిందే. మరి సీనియర్ హీరోలైన నాగ్, వెంకీ, చిరు, బాలయ్య ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారు?

Advertisement
Update:2022-09-23 07:48 IST

పేరుకు మాత్రమే వాళ్లు సీనియర్లు, రెమ్యూనరేషన్ విషయంలో కాదు. ఆ నలుగురు సీనియర్లకు ఆకాశమంత క్రేజ్ ఉన్న మాట వాస్తవమే. కానీ పారితోషికం విషయంలో మాత్రం ప్రభాస్, మహేష్, పవన్ లాంటి స్టార్స్ తో వీళ్లు అస్సలు పోటీపడరు. పడలేరు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో, సీనియర్లు కూడా భారీ పారితోషికానికి సై అంటున్నారు. నాన్-థియేట్రికల్ రేట్లు పెరగడంతో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తమ రేట్లను సవరించారు.

బాలకృష్ణనే తీసుకుంటే.. ఈ హీరో ఈమధ్య కాలంలో తన పారితోషికాన్ని బాగా పెంచాడు. మొన్నటివరకు 10 కోట్ల లోపు రెమ్యూనరేషన్ తీసుకునే ఈ హీరో, ఇప్పుడు తన రేటును రెండంకెలకు చేర్చాడు. ప్రస్తుతం అటుఇటుగా ఒక్కో సినిమాకు 13 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట బాలయ్య. ఇక వెంకటేష్ అయితే మరింత దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం చేతిలో ఉన్న 3 సినిమాలతో ఏకంగా 40 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ నటుడు.

అటు చిరంజీవి సంగతి అందరికీ తెలిసిందే. ఈయన చాన్నాళ్లుగా తన పారితోషికానికి, థియేట్రికల్ రైట్స్ కు ముడిపెడుతూ వస్తున్నారు. కొంత డబ్బు రూపేనా తీసుకుంటూ, మరికొంత రైట్స్ రూపంలో అందుకుంటున్నారు. ఈమధ్య తన సినిమాలకు సహ-నిర్మాతగా వ్యవహరిస్తూ భారీగా సంపాదిస్తున్నారు.. ఇలా సగటున తన ప్రతి సినిమాకు 20 కోట్ల రూపాయల వరకు మెగాస్టార్ కు గిట్టుబాటు అవుతోందని టాక్.

వీళ్లతో పోలిస్తే నాగార్జున సంపాదన తక్కువేం కాదు. బంగార్రాజు హిట్టయిన తర్వాత తన రేటును 20శాతం సవరించిన కింగ్, ప్రస్తుతం భారీ పారితోషికంతో పాటు.. యాడ్స్, బిగ్ బాస్, ఇతర ఎండోర్స్ మెంట్స్ తో భారీగా సంపాదిస్తున్నారు. వీటికి అదనంగా అన్నపూర్ణ స్టుడియోస్ సంపాదన ఉండనే ఉంది. ఓవరాల్ గా నాగ్ సంపాదన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కంటే ఎక్కువే. 

ఒకప్పుడు లెక్క వేరు.. ఇప్పట్నుంచి మరో లెక్క

ఈ స్థాయిలో వీళ్లు పారితోషికాలు తీసుకుంటారని నిజానికి వీళ్లు కూడా ఊహించి ఉండరు. 90ల్లో స్టార్ డమ్ ఎంజాయ్ చేసిన రోజుల్లో వీళ్లు తీసుకునే రెమ్యూనరేషన్లతో పోలిస్తే, ఇప్పుడు అందుకుంటున్న పేమెంట్స్ చాలా చాలా ఎక్కువ. నిజానికి కరోనా తర్వాత వీళ్ల పారితోషికాలు తగ్గుతాయని అంతా ఊహించారు. కానీ ఊహించని విధంగా నాన్-థియేట్రికల్ రేట్లు (శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్) పెరగడంతో.. సీనియర్ హీరోలకు బ్రహ్మాండంగా కలిసొచ్చింది.

వెంకీ నటించిన 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఓటీటీలోకే వచ్చాయి. వాటికి రికార్డు ధరలు పలికాయి. ఇక బాలయ్య నటించిన తాజా చిత్రం అఖండకు ఓటీటీలో, శాటిలైట్ లో రికార్డ్ ధర దక్కిన సంగతి తెలిసిందే. నాగార్జున, చిరంజీవి సినిమాలకు కూడా డిజిటల్, శాటిలైట్ మార్కెట్ అమాంతం పెరిగింది. దీంతో మొన్నటివరకు తక్కువ పేమెంట్స్ తీసుకునే ఈ హీరోలు, ఇప్పుడు తన రేట్లు సవరించారు. స్టార్ హీరోల రేంజ్ లో కాకపోయినా, కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా మార్కెట్లో దూసుకుపోతున్నారు.


Tags:    
Advertisement

Similar News