గాడ్ ఫాదర్ లో ఆఫర్ అలా వచ్చింది..!
గాడ్ ఫాదర్ సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందో వివరించాడు హీరో సత్యదేవ్. స్వయంగా చిరంజీవి తనను కూర్చోబెట్టి నెరేషన్ ఇచ్చారని, అది తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పుకొచ్చాడు.
చిరంజీవి హీరోగా నటించిన సినిమా గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసిఫర్ కు రీమేక్ గా వస్తోంది ఈ సినిమా. ఇందులో ఓ కీలకమైన పాత్రను సత్యదేవ్ పోషించాడు. సినిమా విడుదల సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడాడు. గాడ్ ఫాదర్ లో తనకు ఆఫర్ ఎలా వచ్చిందో వివరించాడు. స్వయంగా చిరంజీవి తనను భోజనానికి పిలిచి, గాడ్ ఫాదర్ కథ చెప్పి, పాత్ర తీరుతెన్నుల్ని వివరించారని వెల్లడించాడు సత్యదేవ్.
"అన్నయ్య (చిరంజీవి ) ఒక షూటింగ్ లో లంచ్ కి రమ్మని పిలిచారు. వెళ్లాను. ఒక సినిమా ఉందని కథ చెప్పడం మొదలుపెట్టారు. అన్నయ్య నాకు కథ చెప్పడం ఏంటని ఆశ్చర్యంగా చూస్తున్నాను. నేను ఎప్పుడూ కలలో కూడా కనని వింత అనుభవం అది. నేను ఆయనకి వీరాభిమానిని, నేను గురువు గా భావించిన వ్యక్తి ఆయన. అలాంటిది ఆయన నాకు కథ, పాత్ర చెప్పడం ఆశ్చర్యమనిపించింది. ఆయన నా వంక చూసి, నేను సరిగ్గా కథ చెప్పడం లేదా.. పోనీ దర్శకుడితో చెప్పించనా అని అడిగారు. మీరు నాకు కథ చెప్పడం ఒక కలలా ఉంది, నాకేం అర్ధం కావడం లేదన్నయ్యా.. మీరు చేయమని చెప్తే చేసేస్తాను.. మీరు కథ చెప్పడం ఏంటని అన్నాను. సినిమా చూశావా అని అడిగారు. చూడలేదు, చూడను కూడా. చేసేస్తానని చెప్పా. ఆయన అడిగిన తర్వాత సినిమా చూడాలనే ఆలోచనే రాలేదు. ఆ క్షణం చాలా గొప్పగా అనిపించింది. అయితే పాత్ర చేస్తున్నపుడు అందులో ఉన్న లోతు కొంచెం కొంచెం అర్ధమైంది. చిన్న టెన్షన్ కూడా మొదలైంది."
ఇలా గాడ్ ఫాదర్ లో తనకు అవకాశం వచ్చిందని తెలిపాడు సత్యదేవ్. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ విలన్ పాత్ర పోషించాడు ఈ హీరో. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ, మంచి కథలు, పాత్రలు దొరికినప్పుడు, విలన్ వేషాలైనా వేస్తానని తెలిపాడు. పైగా మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి పిలిచి అడిగినప్పుడు ఎవ్వరూ నో చెప్పరని తెలిపాడు సత్యదేవ్.