Tiger 3 | ఉదయం 7 గంటల నుంచే షో
Tiger 3 Movie Showtimes | దీపావళి కానుకగా థియేటర్లలోకి వస్తోంది టైగర్-3 సినిమా. దేశవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచే ఈ సినిమా షోలు పడబోతున్నాయి.
యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న భారీ చిత్రం ‘టైగర్ 3’. సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్ హీరోహీరోయిన్లుగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. దీపావళి పండుగ సీజన్‌లో సందడి చేయడానికి రెడీగా ఉంది. దీపావళి సందర్భంగా నవంబర్ 12న, అంటే ఆదివారం నాడు ‘టైగర్ 3’ సినిమాని రిలీజ్ చేయబోతోన్నారు. ఈరో జు ఉదయం 7 గంటలకు మొదటి షో పడుతుందని మేకర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు అన్ని అనుమతులు తెచ్చుకున్నట్టు స్పష్టం చేశారు.
ఈ సినిమాకు దేశవ్యాప్తంగా నవంబర్ 5 నుంచి బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఇలా ఉదయం 7 గంటలకే షో స్టార్ట్ చేయడానికి ఓ కారణం ఉంది. ఓవర్సీస్ లో ముందుగా టైగర్-3 పడుతుంది. స్పై థ్రిల్లర్ కాబట్టి స్పాయిలర్స్ వచ్చేస్తాయి. వాటిని కట్టడి చేసేందుకు ఉదయం 7 గంటల నుంచే ఇండియాలో షోను వేయమని అభిమానుల నుంచి ఒత్తిడి రావడంతో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏక్ థా టైగర్, టైగర్ హై జిందా, వార్, పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ల తరువాత వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రాబోతోన్న 5వ చిత్రం టైగర్-3. ఈ చిత్రాన్ని మనీష్ శర్మ తెరకెక్కించాడు. మల్టీప్లెక్సుల్లోని అన్ని ఫార్మాట్లలో ఈ చిత్రం రానుంది. 2డీ, ఐమాక్స్ 2డీ, 4డీఎక్స్, పీవీఆర్ ఎక్స్ఎల్, 4డీఈ మోషన్ ఇలా అన్ని ఫార్మాట్లలో రానుంది. హిందీతో పాటు.. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి థియేటర్లలోకి వస్తోంది.
సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాపై ఉత్తరాదిన భారీ అంచనాలున్నాయి. పైగా సల్మాన్-కత్రినాది సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో అంచననాలు మరింత పెరిగాయి. వరుస బ్లాక్ బస్టర్స్ తో ఓవైపు షారూక్ ఖాన్ దూసుకుపోతున్న నేపథ్యంలో, సల్మాన్ పై ఒత్తిడి పెరిగింది. సింగిల్ డేలో ఈ సినిమా 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి.