మహిళల వస్త్రధారణపై సల్మాన్ సంచలన వ్యాఖ్యలు..
సల్మాన్ ఖాన్ ఉద్దేశం ఏదయినా ఆయన మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తున్నాయి. నెటిజన్లు ట్రోలింగ్ ఆపడం లేదు.
మహిళలు ఎలాంటి వస్త్రాలు ధరించాలి..? అసలు ఈ విషయాన్ని పురుషులు డిసైడ్ చేయడమేంటి..? ఆ స్వేచ్ఛ, హక్కు మహిళలకు లేవా..? ఇప్పటికే ఈ విషయంపై చాలామంది చాలాసార్లు చర్చ చేశారు, ఉచిత సలహాలిచ్చిన పురుషులు చీవాట్లు తిన్నారు. ఈ లిస్ట్ లోకి తాజాగా సల్మాన్ ఖాన్ ఎంటరయ్యారు. సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా షర్ట్ విప్పి కండలు చూపించే కండల వీరుడు సల్మాన్ ఖాన్, మహిళలు మాత్రం నిండైన వస్త్రధారణలో ఉండాలని చెబుతున్నారు. మహిళల శరీరాలు ఎంతో విలువైనవని, వాటిని దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పితే అంత మంచిదని సెలవిచ్చారు. దీంతో నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. సినిమాల్లో చొక్కా విప్పేసి షో చేసే మీరు, మహిళల విషయంలో అంత సంకుచితంగా ఎందుకు ఉన్నారంటూ ట్రోల్ చేస్తున్నారు.
'కిసీకా భాయ్.. కిసీకా జాన్' అనేది సల్మాన్ ఖాన్ కొత్త సినిమా. ఈ సినిమాలో పాలక్ తివారీ ఓ క్యారెక్టర్ చేశారు. సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడిన పాలక్.. సినిమా సెట్లో మహిళలందరూ మెడ వరకూ నిండుగా వస్త్రాలు ధరించాలని సల్మాన్ సలహా ఇస్తారని చెప్పారు. మహిళల వస్త్రధారణ నిండుగా ఉండేలా చూస్తారన్నారు. ఆ తర్వాత ఓ టీవీషోలో సల్మాన్ ఖాన్ కు ఈ ప్రశ్న ఎదురైంది. పాలక్ తివారీ జవాబుని గుర్తు చేస్తూ.. "మీరు మాత్రం సినిమాల్లో షర్ట్ విప్పేస్తారు, నటీమణులు మాత్రం నిండుగా దుస్తులు ధరించాలని చెబుతారట, నిజమేనా..?" అని ఇంటర్వ్యూ చేసేవారు అడిగారు. ఈ ప్రశ్నకు సల్మాన్ చెప్పిన సమాధానం వైరల్ గా మారింది.
"నా అభిప్రాయంలో మహిళల శరీరాలు విలువైనవి. వాటిని ఎంత ఎక్కువగా దుస్తులతో సంరక్షిస్తే వారికి అంత మంచిది. ఇది మహిళల గురించి చెబుతున్న మాట కాదు. మన తల్లులు, భార్యలు, సోదరీమణుల్లాంటి మహిళలను వక్రబుద్ధితో చూసే కొందరి గురించి చెబుతున్న మాట. మహిళలు అవమానాలకు గురికాకూడదని నేను కోరుకుంటున్నాను." అని చెప్పారు సల్మాన్ ఖాన్.
సల్మాన్ ఖాన్ ఉద్దేశం ఏదయినా ఆయన మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం విమర్శలకు దారి తీస్తున్నాయి. మహిళలు నిండుగా వస్త్రాలు ధరించాలి, అది వారి సంరక్షణ కోసమేనని సలహా ఇచ్చారు సల్మాన్. కానీ నెటిజన్లు మాత్రం ట్రోలింగ్ ఆపడం లేదు.