రివ్యూ బాంబింగ్ సహించేది లేదు- కేరళ హైకోర్టు

ఫిల్మ్ రివ్యూయింగ్ సిస్టమ్‌పై కఠినమైన వైఖరిని తీసుకుంటూ మంగళవారం కేరళ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Advertisement
Update:2023-11-08 15:50 IST

ఫిల్మ్ రివ్యూయింగ్ సిస్టమ్‌పై కఠినమైన వైఖరిని తీసుకుంటూ మంగళవారం కేరళ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏ సంస్థ క్రింద నమోదు చేసుకోని, లేదా గుర్తింపు పొందని సినిమా సమీక్షకులు వున్నారని, ఆన్‌లైన్‌లో వారి కంటెంట్‌ ని ప్రచురించేటప్పుడు అనుసరించాల్సిన మార్గదర్శకాలు కూడా లేవని వ్యాఖ్యానించింది హైకోర్టు. అక్టోబర్‌లో కొందరు యూట్యూబ్ సినిమా సమీక్షకులు సినిమాలని కూడా చూడకుండా నెగెటివ్ రివ్యూల్ని అప్‌లోడ్ చేస్తున్నారని, ఇది సినిమా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్నదనీ, ఫిర్యాదు చేస్తూ మలయాళ దర్శకుడు ముబీన్ రవూఫ్ దాఖలు చేసిన పిటిషన్‌ పై కోర్టు విచారణ చేపట్టింది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఫిల్మ్-రివ్యూయింగ్ వ్లాగర్‌లు సినిమాలు విడుదలైన తర్వాత కనీసం ఏడు రోజుల వరకు సినిమాల సమీక్షల్ని పోస్టు చేయకుండా వుండేలా ముబీన్ గ్యాగ్ ఆర్డర్‌ ని కోరారు. జస్టిస్ దేవన్ రామచంద్రన్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ కేసుపై వ్యాఖ్యలు చేసింది. రివ్యూకర్తలు తమకు వర్తించే ఏ నిబంధనలూ లేవన్న సాకుతో తమ భావస్వేచ్చని హరించలేరన్నంత మాత్రాన, పిటీషన్ దారుల ఫిర్యాదు అయోగ్యమైపోదని, ప్రత్యేకించి వారిలో ఎవరైనా జర్నలిస్టుగా ఏ గుర్తింపూ పొందనప్పుడు, లేదా అలాంటి ఇతర సర్వీస్ ప్రొవైడర్‌లకు సమానమని చూపించడానికి రికార్డులో ఏమీ లేనప్పుడు, భావస్వేచ్ఛ పేరిట చెలామణి కాలేరని పేర్కొంది.

అంతేకాకుండా వార్తాపత్రికల కోసం, టెలివిజన్‌ల కోసం పని చేసే విమర్శకులు ఏదో ఒక విధమైన నియంత్రణలో వున్నప్పటికీ, ఆన్‌లైన్ వేదికల కోసం పనిచేసే వారికి అలాంటిదేమీ లేదని కోర్టు పేర్కొంది. “వారు గుర్తింపు పొందిన సమీక్షకులు కాదు. వారు వారి హక్కుల గురించి మాట్లాడతారు. కానీ వారి విధుల గురించి మాట్లాడరు. రివ్యూయర్స్ అని చెప్పుకునే వారెవరూ తమ హక్కుల గురించి ఇంత దృఢ విశ్వాసాలు కలిగి వుంటే, నా ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా వుంది” అని న్యాయమూర్తి అన్నారు.

రెండు రకాల సమీక్షలు వున్నాయని కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు- “ఒకటి వ్యక్తులు తమ అభిప్రాయాల్ని వ్యక్తీకరించడానికి- వారి సొంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించినప్పుడు, మరొకటి చలనచిత్రాలకు, లేదా ఉత్పత్తులకు రేటింగ్ నిచ్చే వేదికలున్నప్పుడు, రెండిటినీ వేర్వేరుగా డీల్ చేయాల్సి వుంది” అన్నారు.

మునుపటి విచారణలో, కోర్టు ఆన్‌లైన్ వేదికల్ని నిశితంగా పరిశీలించాలని పిలుపునిచ్చింది. తద్వారా అనామక, దుర్మార్గపు సమీక్షలు ప్రసారం కాకుండా వుండగలవని వివరించింది. మంగళవారం అమికస్ క్యూరీ శ్యామ్ ప్యాడ్‌మన్ మాట్లాడుతూ, కోర్టు ఆదేశాల తర్వాత ప్రతికూల ఆన్‌లైన్ సమీక్షల ముప్పు కొంతవరకు తగ్గిందని అన్నారు. అందిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నామని, అనామక పోస్టుల్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రభుత్వ ప్లీడర్ విద్యా కురియకోస్ కోర్టుకి తెలిపారు. చాలా మంది సమీక్షకులు జర్నలిస్టులుగా గుర్తింపు పొందలేదు, లేదా ఎలాంటి మార్గదర్శకాల ప్రకారం లేరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రమాణాల పరంగా తగిన చర్యలు తీసుకుంటేనే దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది సుధీ వాసుదేవన్ వాదించారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సువిన్ ఆర్ మీనన్ ప్రతిస్పందన దాఖలు చేయడానికి రెండు వారాల సమయం కోరారు.

ఈ విషయాన్ని వాయిదా వేయడానికి ముందు, జస్టిస్ రామచంద్రన్, “సమీక్షల ఉద్దేశం సమాచారం అందివ్వడం, ఎవేర్నెస్ కలగజేయడం అయినప్పుడు, సినిమాల మీద రివ్యూ బాంబింగ్ చేస్తామని, నాశనం చేస్తామనీ అంటే సహించేది లేదు” అన్నారు.

కాగా, ఈ అంశంపై అందిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు చేపట్టిన చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ముందుంచింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనామక పోస్టులపై నిఘా పెట్టిందని, ఏదైనా ఫిర్యాదు అందితే క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామనీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది కూడా ఒక సమర్థ యంత్రాంగం ఈ సమస్యల్ని నిశితంగా పరిశీలిస్తోందని కోర్టుకి తెలియజేషారు. న్యాయమూర్తి తదుపరి విచారణను నవంబర్ 21వ తేదీకి వాయిదా వేశారు.

భావప్రకటనా స్వేచ్ఛని దురుద్దేశం కోసం లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయరాదనే బలమైన సందేశాన్ని కేరళ హైకోర్టు పంపుతోంది. ఇది చలనచిత్ర పరిశ్రమలో మరింత నిర్మాణాత్మక విమర్శలకి, సమతుల్య సమీక్షలకీ మార్గం సుగమం చేస్తుందని; సృజనాత్మకతకి, కళాత్మక వ్యక్తీకరణకీ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందిస్తుందనీ మలయాళ సినిమా పరిశ్రమలో భావిస్తున్నారు.

ఇలావుండగా, రివ్యూ బాంబింగ్ పై కేరళ హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రివ్యూ బాంబింగ్ ని ఎదుర్కోవడానికి కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (కెఎఫ్‌పిఎ) ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఫెఫ్కా) కొత్త మార్గదర్శకాల్ని, చర్యల్ని రూపొందించాయి. వివరాలు రేపు.

Tags:    
Advertisement

Similar News