రవితేజ సినిమాకి నిరసన సెగ.. ఉప్పర కులస్తుల ఆందోళన

రెండు మూడుసార్లు ఆయన అదే పదాన్ని రిపీట్ చేశారు. దీంతో ఉప్పర కులస్తులు అభ్యంతరం తెలిపారు. సినిమా ఫంక్షన్లో దర్శకుడు అలా మాట్లాడటం సరికాదన్నారు.

Advertisement
Update:2022-12-22 15:24 IST

రవితేజ సినిమాకి నిరసన సెగ.. ఉప్పర కులస్తుల ఆందోళన

ప్రీ రిలీజ్ ఫంక్షన్లో దర్శకుడు నోరుజారి అన్న ఓ మాట సినిమాకి ఇబ్బందిగా మారింది. అయితే పరోక్షంగా అది మరింత ప్రచారాన్ని కూడా తెచ్చిపెట్టింది. చివరకు ఆ దర్శకుడు క్షమాపణ చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగినట్టే కనిపిస్తోంది.

అయితే ఇకపై ఎప్పుడూ ఎవరూ అలాంటి పదాలు వాడొద్దని ఉప్పర కులస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. దర్శకుడు నక్కిన త్రినాథరావుతోపాటు.. గతంలో ఏపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, నిర్మాత బండ్లగణేష్ కూడా ఇలాంటి అభ్యంతరకర పదాలు వాడారని వారు ఆరోపించారు. ఇకపై ఎవరూ అలాంటి పదాలు వాడొద్దని, సెన్సార్ నిబంధనలు కూడా ఆ విషయంలో సవరించాలన్నారు.

రవితేజ నటించిన కొత్త సినిమా ధమాకా రేపు విడుదలవుతుంది. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు నక్కిన త్రినాథరావు, యాంకర్ సుమపై సెటైర్లు వేశారు. ఈ క్రమంలో ఏంటి మీ 'ఉప్పర సోది' అంటూ ఆయన కామెడీ చేయాలని చూశారు. రెండు మూడుసార్లు ఆయన అదే పదాన్ని రిపీట్ చేశారు. దీంతో ఉప్పర కులస్తులు అభ్యంతరం తెలిపారు. సినిమా ఫంక్షన్లో దర్శకుడు అలా మాట్లాడటం సరికాదన్నారు. ఉప్పర(సగర) కుల సంఘాల నాయకులు హైదరాబాద్ లోని ఫిలించాంబర్ వద్ద ఆందోళన చేపట్టారు. దర్శకుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసి సినిమాని అడ్డుకుంటామని హెచ్చరించారు.




 దర్శకుడి క్షమాపణ..

అయితే ఈ వివాదం ముదిరేలోపు, టీవీ ఛానెళ్లు టీఆర్పీలకోసం దీన్ని వాడుకునే లోపు.. దర్శకుడు నక్కిన త్రినాథరావు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. తాను కూడా బీసీయేనని, బీసీల గురించే కాదు, ఏ కులం గురించి కూడా తాను తప్పుగా మాట్లాడనని, సినిమా ఫంక్షన్లో పొరపాటుగా మాట్లాడినందుకు క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ఇకపై మిగతా సందర్భాల్లో కూడా అలాంటి మాటలు దొర్లకుండా జాగ్రత్త తీసుకుంటానన్నారు. అలాంటి పదాలను అందరూ నిషేధించాలని పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News